పాన్‌వాలా..10 పుస్తకాలు రాసిన గొప్ప రచయిత.!

by Daayi Srishailam |   (  Updated:2025-07-21 14:32:49  IST  )

కష్టాల మధ్యలో కలలు కన్న వ్యక్తి పింటు

పాన్‌వాలా..10 పుస్తకాలు రాసిన గొప్ప రచయిత.!
X

దిశ, ఫీచర్స్: కోల్‌కతాలోని బెహలా వీధిలోని ఒక చిన్న పాన్ దుకాణం ఉంటుంది. అందులో కూర్చున్న వ్యక్తి పింటు పోహన్. అతడొక సాధారణ పాన్‌వాలాగా కనిపిస్తాడు. కానీ అతని కథ సాధారణం కాదు. రోజూ వందలాది మంది అతని దుకాణం వద్ద పాన్ కొనుగోలు చేస్తారు. వారిలో చాలా మందికి తెలియదు ఈ పాన్‌వాలా ఇప్పటికే 10 పుస్తకాలు రాశాడని. ఇంకా రెండు పుస్తకాలపై పని చేస్తున్నాడని. వరదలు ముంచెత్తిన కోల్‌కతా గుండెలోని మురికివాడ నుంచి కష్టాల మధ్యలో కలలు కన్న వ్యక్తి పింటు.

కథలు చదివి..

కోల్‌కతాలోని మదన్‌మోహన్‌తలా మురికివాడలో 1989లో వరదలు వచ్చినప్పుడు పింటు నాలుగో తరగతి చదువుతున్నాడు. నీటి మట్టం పెరిగిపోవడంతో కుటుంబం మొత్తం మామయ్య ఇంటికి తాత్కాలికంగా వెళ్లాల్సి వచ్చింది. ఇంట్రోవర్ట్ అయిన పింటు చదవడానికి ఏదైనా కావాలని అనుకున్నాడు. ఒకరోజు చెట్టు కింద దుమ్ము పట్టిన ఒక పాత పుస్తకం దొరికింది. అది చిన్న కథల సంకలనం. ఆ కథలు చదివిన తర్వాత రచయిత కావాలనే కల అతని మనసులో మొదలైంది. పింటు కుటుంబ సభ్యులు దినసరి కూలీలు. రెండు పూటల ఆహారం కూడా దొరకని పరిస్థితి.

మోసమని తెలుసుకొని..

చదువు అనేది దూరంగా కనిపించే కల. కానీ పింటు మాత్రం చదువు జీవితాన్ని మార్చగలదని నమ్మాడు. బరిషా జనకల్యాణ్ విద్యాపీఠంలో చదువుతూ కుటుంబపై భారం పడకుండా చిన్న చిన్న పనులు చేశాడు. పారేసిన పుస్తకాలను సేకరించి చదివేవాడు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఒక పత్రికలో ‘పాటల రచయిత కావాలి’ అనే ప్రకటన చూసి తాను రాసిన పాటలతో ఆ అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. అయితే డబ్బులు అడిగే సరికి దాంట్లో మోసం ఉందని గ్రహించి నిరాశతో వెనుదిరిగాడు.

ఖాళీ సమయం దొరికితే..

1995లో బోర్డు పరీక్షలు పాసైన తర్వాత తండ్రి ప్రమాదానికి గురవడంతో కుటుంబ బాధ్యతలు పింటు మీద పడ్డాయి. ఒక సంవత్సరం చదువు మానేసి.. తర్వాత కొంత డబ్బు సేకరించి 11, 12వ తరగతులు పూర్తి చేశాడు. 1999లో బెంగాలీ భాషలో బ్యాచిలర్ డిగ్రీలో చేరాడు. కానీ ఫీజులు చెల్లించలేక మధ్యలోనే ఆపేశాడు. అప్పటికే కుటుంబ ఆర్థిక సమస్యలు అతన్ని వెంటాడాయి. 1999లో కేవలం రూ.1500తో బెహలా వీధిలో పాన్ దుకాణం ప్రారంభించాడు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దుకాణం నడిపేవాడు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదివేవాడు, రాసేవాడు.

10 పుస్తకాలు రాశాడు..

పింటు కథలో అతని కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. 2001లో పుతుల్‌ను వివాహం చేసుకున్నాడు. పింటు కూతురు 19 ఏళ్ళ పీయు కలకత్తా విశ్వవిద్యాలయంలో జూలజీలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తోంది. పింటు కథలు, కవితలు ‘ఆనంద బజార్ పత్రిక’, ‘ఆనందమెల’, ‘దేశ్’ వంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. 2017లో అతని మొదటి పుస్తకం ‘పరులమసిర చాగల్చనా’ ప్రచురితమైంది. అలా 10 పుస్తకాలు రాశాడు. ఇంకో రెండు పుస్తకాలు ముద్రణకు ఉన్నాయి.

Next Story