- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు వర్షాలు సమృద్ధిగా కురిసి వాగులు, కాలువలు గలగలా పారేవి. కత్వలు దుంకి.. చెరువులు అలుగెళ్లేవి. చేపల సందడే కనిపించేదప్పుడు. చేపలు పట్టడం ఒక సంస్కృతి. గ్రామీణ జీవన విధానానికి నిదర్శనం. ప్రకృతితో మమేకమై సరళమైన జీవనం సాగించిన ఆ రోజులు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా నిలిచే ఉంటాయి.
అదొక సంబరం..
వానలు ఎక్కువగా పడితే ఎగువ గ్రామాల్లోని చెరువులు నిండిపోతే తూములు తీసేవాళ్లు. ఆ నీరంతా దిగువనున్న వాగుల్లో ప్రవహించి, కత్వలు దుంకేవి. వాగొస్తుంది, కత్వ దుంకుతుందని తెలిస్తే ఊరొళ్లంతా చూడటానికి వెళ్లేవారు. అందరి చేతిలో చేపల వల ఉండేది. వాళ్లంతా ఉత్సాహంగా వలేసి చేపలు పడుతుండె. చేపలు పట్టడం అనేది వాటిని వండుకొని తినడం కోసం మాత్రమే కాదు. అదొక సామాజిక కార్యకలాపంగా మారేది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం వచ్చేవారు. ఇదంతా ఒక సంబరంలా, ఒక పండుగలా సాగేది.
అందరి ఇళ్లలో చేపలే..
ఊరు ఊరంతా వాగు దగ్గర్నే, కత్వ కాడనే ఉండేదాయె. చేపలు ఎదురెక్కి వస్తుంటే ప్రాణం ఊకుంటదా.? చేపలు పట్టడం రానివాళ్లు కూడా వలేసి ఎంజాయ్ చేసేవాళ్లు. చేతిలో ఐదారు కిలోల చేపల్లేకుండా ఎవరూ ఉత్తగా వచ్చేవాళ్లు కాదు. ఒకింట్లో, రెండిండ్లలో కాదు. అందరి ఇండ్లలోనూ చేపల కూరనే వండేది. ఊరు ఊరంతా చేపల వాసన్నే గుమాయించేది. ఆ వాసనతో ఊరంతా ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించేది. అది గ్రామీణ జీవన శైలి గుండె చప్పుడు. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ దీంట్లో భాగమయ్యేవారు. ఈ సమిష్టి కార్యం ఐక్యతను బలపరిచేది.
పిల్లల ఆనందం..
పిల్లలకు కత్వల దగ్గర ఆడుకోవడం ఒక ఆనందకరమైన అనుభవం. నీటిలో చేపలను చూస్తూ, ఆడుకుంటూ, నవ్వుకుంటూ వారు గడిపే సమయం వారి బాల్యానికి మరపురాని జ్ఞాపకాలను అందించేది. అదేందోగానీ వాగునీళ్లు అంతా ఒండుగానే ఉన్నా మహిళలు బట్టల మూటలు తీసుకొని ఉతకడానికి వచ్చేవాళ్లు. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఇవి సామాజిక బంధాలను బలోపేతం చేసే అవకాశంగా మారేవి. అంతేనా, ఈ కుక్కర్ల గోల ఎక్కడిది అప్పుడు.? చేపల కూరంటే ఏదో సాదాసీదాగా వండేది కాదాయె. అందుకే మసాల గసాల గట్టిగేసి వండేసరికి లంచ్ టైం అయ్యేది.
ఎప్పటికీ మరచిపోలేం..
నిజంగా చేపలు పట్టేవాళ్ల ఓపికకు మొక్కాలె. అప్పట్లో రూ.20-30కి కూడా చేపలు దొరికేవి. వీళ్లు పనికి వెళ్తే కనీసం రూ.250 రూపాయలు దొరికేవి. పనికెళ్తే అలాంటి చేపలు ఎన్నో కొనుక్కోవచ్చు. కానీ అలా చేయకుండా పనికి డుమ్మా కొట్టి చేపలు పట్టడంలో మునిగిపోయేవాళ్లు. అయితే అది కొందరికి జీవనోపాధి. కొందరికేమో కళ.. సంప్రదాయంగా మారేది. అవన్నీ ఇప్పుడు గుర్తుచేసుకుంటే మనసు ఆనందంతో నిండిపోతుంది. ఆ సరళమైన, సహజమైన జీవనం ఇప్పటికీ హృదయాల్లో చెక్కుచెదరకుండా ఉంది. ఆ గ్రామీణ సౌందర్యం, ఆ సమిష్టి జీవనం, ఆ ప్రకృతి సాన్నిహిత్యం ఈ ఆధునిక యుగంలో స్ఫూర్తినిస్తాయి.






