పాతదే కానీ కొత్తగా.. ట్రెండింగ్‌లో వింటేజ్ ఫ్యాషన్

by Yella Dhawani Reddy |

ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌లు రావడం, పాతవన్నీ మరిచిపోవడం సర్వసాధారణం.

పాతదే కానీ కొత్తగా.. ట్రెండింగ్‌లో వింటేజ్ ఫ్యాషన్
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్యాషన్ (Fashion) ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌లు రావడం, పాతవన్నీ మరిచిపోవడం సర్వసాధారణం. కానీ ఇటీవల కాలంలో నేటితరం యువత 'ఓల్డ్ ఈజ్ గోల్డ్ (Old is gold)' అనే మాటలను నిజం చేస్తూ.. పాతకాలం ఫ్యాషన్‌‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో 1970, 80లలో పాపులర్ అయిన ఫ్యాషన్ స్టైల్స్ మళ్లీ స్పాట్‌లైట్‌లోకి వచ్చాయి. అప్పటి బెల్ బాటమ్ జీన్స్, రెట్రో ప్రింటెడ్ షర్ట్స్, హైవైస్ట్ ప్యాంట్స్.. ఇప్పుడు యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. ప్రతి అంశంలో కొత్తదనం కోసం తపించే నేటి యువత.. ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం పాతదానికే ఫిదా అయిపోతున్నారు. అందులోని ప్రత్యేకత, పాత రోజులు గుర్తు చేసే నోస్టాల్జియా (Nostalgia), యూనిక్ స్టైల్ వాళ్లను ఆకట్టుకుంటోంది.

ముఖ్యంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు సోషల్ మీడియా కూడా ఈ ట్రెండ్‌కు ఊతమిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్లు వింటేజ్ లుక్స్‌తో వీడియోలు, ఫోటోషూట్స్ చేస్తూ, కొత్త తరానికి పాతదానిని కొత్తగా చూపిస్తూ క్రేజ్ పెంచుతున్నారు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు పెద్ద పెద్ద బ్రాండ్లు సైతం మార్కెట్‌లో వింటేజ్ కలెక్షన్లను తిరిగి విడుదల చేస్తున్నాయి.ఇందులో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ట్రెండ్ యూనిసెక్స్ స్టైల్‌గా మారిపోయింది. అబ్బాయిలూ, అమ్మాయిలూ ఇద్దరూ ఒకే విధమైన వింటేజ్ ప్యాంట్లు, జాకెట్లను ధరిస్తున్నారు. అయితే ఇది కేవలం ట్రెండ్‌ మాత్రమే కాదు.. ఒకవిధంగా పాతదాన్ని గౌరవించే కొత్త తరం ఆలోచనల ప్రతిబింబంగా మారుతోంది. మరీ ఈ వింటేజ్ వేవ్ ఎప్పటివరకు కొనసాగుతుందో చూడాల్సిందే, కానీ ప్రస్తుతం మాత్రం "పాతవి కొత్తగా!" అనే మాట నిజమవుతోంది.

Next Story