- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింత చిగురు.. రుచిలో దాని తీరే వేరు!
కేవలం రుచిలోనే కాదు. పోషకాల్లోనూ నంబర్‌వన్ చింత చిగురు. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

దిశ, ఫీచర్స్ : చింత చిగురు.. వంటకాల్లో ప్రత్యేకమైన రుచిని, ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన సీజనల్ ఆకుకూర. వసంతకాలం(వేసవి)లో ఇది ఎక్కువగా లభిస్తుంది. సాధారణంగా మార్చి నుంచి జులై వరకు దొరుకుతూనే ఉంటుంది. గ్రామాల్లో, పట్టణాల్లో చాలామంది దీనిని ఇష్టపడుతుంటారు. చింత చెట్లు ఎక్కువ కాబట్టి గ్రామాల్లో విరివిగా లభిస్తుంది. అక్కడి నుంచి తెచ్చి పట్టణ మార్కెట్లలో సైతం అమ్ముతుంటారు. ప్రస్తుతం అంతటా దొరుకుతున్నది. అయితే ఈ చింత చిగురులో ఉండే పోషక విలువలేమిటి? తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చింత చిగురులోని పోషకాలు
చింత చిగురు కేవలం రుచిలోనే కాదు. పోషకాల్లోనూ నంబర్‌వన్ అంటారు పెద్దలు, పోషకాహార నిపుణులు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా కలిగి ఉండటంవల్ల శరీరంలోని కణాలను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. పీచుపదార్థాన్ని కలిగి ఉండటం మూలంగా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. అమైనో ఆమ్లాలు ఉన్నందున శరీర ఎదుగుదలకు అవసమైన ప్రోటీన్ల నిర్మాణంలో తోడ్పడతాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
చింత చిగురును ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఎండకాలంలో తినడంవల్ల వడదెబ్బ, నీరసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. కడుపులో మంట, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. కాల్షియం సమృద్ధిగా ఉండటంవల్ల పళ్లు, ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో చింతచిగురులోని పోషకాలు ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గించడంలోనూ సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నందున చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు వంటివి తగ్గుతాయి.
ఏయే కూరల్లో వాడతారు?
*చింత చిగురు పప్పు: కందిపప్పు లేదా పెసరపప్పుతో చింత చిగురు కలిపి వండితే వచ్చే చాలా రుచిగా ఉంటుందని పెద్దలు చెబుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ వంటకం చాలా ఫేమస్. వంకాయలో కూడా చింత చిగురు వేసి వండుతారు.
* చింత చిగురుతో మాంసాహారాలు : మటన్, చికెన్, రొయ్యలు, ఎండు చేపల కూరల్లోనూ చింత చిగురు వేస్తారు. రుచి అద్భుతంగా ఉంటుందని చెబుతారు.
*చింత చిగురు పచ్చడి: పచ్చిమిర్చి లేదా ఎండిన మిర్చితో కలిపి రోటి పచ్చడి చేసుకుంటారు. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.
*చింత చిగురు పొడి: చింత చిగురును ఎండబెట్టి, ధనియాలు, మిరపకాయలతో కలిపి పొడిలా చేసి నిల్వ ఉంచుకుంటారు. వేడి వేడి అన్నంలో రుచిగా ఉంటుంది.
*చిన్న చిట్కా: చింత చిగురు సీజన్ అయిపోయాక కూడా వాడుకోవాలనుకుంటే, దాన్ని నీడలో బాగా ఎండబెట్టి, పొడి చేసి గాలి చొరబడని డబ్బాలో దాచుకోవచ్చు. సంవత్సరం పొడవునా కూరల్లో వాడుకోవచ్చు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమనాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






