వారెవ్వా జాక్‌పాట్ కొట్టిన ఇండియా.. అండమాన్‌లో భారీ గ్యాస్ నిక్షేపాలు లభ్యం

by Kema Shiva Kumar |

అండమాన్ సముద్రంలో వరుసగా రెండోసారి ఏకంగా 66 శాతం సక్సెస్ రేటుతో సహజ వాయువు నిక్షేపాలు లభ్యం కావడం భారత్‌లో కొత్త ఆశలు రేపుతోంది.

వారెవ్వా జాక్‌పాట్ కొట్టిన ఇండియా.. అండమాన్‌లో భారీ గ్యాస్ నిక్షేపాలు లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంధన సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitics) పెరుగుతున్న వేళ భారత్‌కు భారీ ఊరట లభించింది. అండమాన్ సముద్రంలో (Andaman Sea) వరుసగా రెండోసారి భారీ సహజ వాయువు (Natural Gas) నిక్షేపాలు లభ్యమయ్యాయని కేంద్ర పెట్రోలియం శాఖ కీలక ప్రకటన చేసింది. తాజా పరిణామంతో దేశీయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చమురు వెలికితీత మెగా ప్రాజెక్టులు విజయవంతమైతే, భారత్ కూడా ఇంధన స్వయంసమృద్ధిని సాధించే దిశగా అడుగులు వేయనుంది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ రంగ సంస్థ ‘ఆయిల్ ఇండియా లిమిటెడ్’ (OIL) అండమాన్ దీవుల తూర్పు తీరానికి దాదాపు 15 కి.మీ దూరంలో సముద్ర గర్భంలో ‘విజయపురం-3’ అనే అన్వేషణ బావిని తవ్వింది. ప్రాథమిక పరీక్షల్లో ఇక్కడ భారీగా సహజ వాయువు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది.

66 శాతం సక్సెస్ రేటు..

అయితే, సముద్ర గర్భంలో చమురు, గ్యాస్ అన్వేషణలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ, అండమాన్ బేసిన్‌లో మాత్రం ఇప్పటి వరకు తవ్విన 3 బావుల్లో.. రెండింట్లో గ్యాస్ లభించడం విశేషం. అంటే ఇక్కడ సక్సెస్ రేట్ 66 శాతంగా ఉంది. గతంలో విజయపురం-2 నుంచి సేకరించిన శాంపిల్స్ ఆధారంగా ఇందులో 85 శాతం పైగా అత్యంత నాణ్యమైన మిథేన్ (Methane) వాయువు ఉన్నట్లుగా కాకినాడ ల్యాబ్‌లో సైంటిస్టులు తేల్చారు. భౌగోళికంగా మయన్మార్‌లోని ప్రసిద్ధ ‘శ్వే’ (Shwe) గ్యాస్ ఫీల్డ్, ఇండోనేషియాలోని చమురు క్షేత్రాలు ఏ భూగర్భ పొరల ఆధారంగా ఏర్పడ్డాయో.. అండమాన్ బేసిన్ కూడా అదే పొరలకు అనుసంధానమై ఉండటంతో ఇక్కడ మరిన్ని భారీ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

కమర్షియల్ ప్రొడక్షన్‌కు పదేళ్ల సమయం..

గ్యాస్ నిక్షేపాలు లభించినప్పటికీ, అవి మన ఇళ్లకు, పరిశ్రమలకు చేరడానికి కనీసం మరో 10 ఏళ్ల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకే బావితో గ్యాస్ పరిమాణాన్ని అంచనా వేయలేమని.. చుట్టుపక్కల మరికొన్ని బావులు తవ్వి మొత్తం ఎన్ని బిలియన్ క్యూబిక్ మీటర్ల (BCM) గ్యాస్ ఉందో లెక్కగట్టాల్సి ఉంటుంది. గ్యాస్ నాణ్యత, లోపల ఉన్న ఒత్తిడి, వెలికితీత ఖర్చులపై శాస్త్రవేత్తలు సమగ్ర నివేదకను తయారు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సముద్రం మధ్యలో ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫారమ్‌లు, సముద్రం లోపల పైప్‌లైన్లు, తీర ప్రాంతంలో ప్రాసెసింగ్ టెర్మినల్స్ నిర్మించడానికి వేల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయి. అండమాన్ వంటి పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో కఠినమైన అనుమతులు సాధించడం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ అండమాన్ నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభమైతే.. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు ఆధారపడటం తప్పతుందని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

రూ.37,500 కోట్ల ‘కోల్ గ్యాసిఫికేషన్’ మిషన్

అండమాన్ గ్యాస్ మార్కెట్లోకి రావడానికి మరో 10 ఏళ్లు పడుతున్న నేపథ్యంలో.. ఇంత లోపు భారత్ తన ఇంధన కష్టాలను తీర్చుకోవడానికి బొగ్గును ఆయుధంగా మార్చుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం రూ.37,500 కోట్ల భారీ బడ్జెట్‌తో నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్‌ను వేగవంతం చేసింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాస్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.

Next Story