- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి పండక్కి గాలిపటాలు ఎగురవేయడం వెనుక ఆరోగ్య రహస్యం ?
పూర్వకాలం నుంచే సంక్రాంతి పండుగలో గాలిపటాలు ఎగురవేయడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఆరోగ్య పరమైన, ప్రకృతితో అనుసంధానమైన ఒక మంచి అలవాటుగా పెద్దలు భావించేవారు.

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ అంటే తెలుగువారి ఇళ్లల్లో పంట ఆనందం, పల్లె వాతావరణం, కుటుంబ కలయికతో పాటు గాలిపటాల సందడి తప్పనిసరిగా కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. సంక్రాంతి పండుక్కి గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయమా? వినోదమా? దీనివెనుక ఉన్న ఆరోగ్య రహస్యమేంటి?
సంప్రదాయం.. వినోదం..
పూర్వకాలం నుంచే సంక్రాంతి పండుగలో గాలిపటాలు ఎగురవేయడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఆరోగ్య పరమైన, ప్రకృతితో అనుసంధానమైన ఒక మంచి అలవాటుగా పెద్దలు భావించేవారు.
శరీరానికి వ్యాయామంతో పాటు విటమిన్
సంక్రాంతి కాలం చలికాలంలో వస్తుంది. ఈ సమయంలో ఉదయం, మధ్యాహ్నం ఎండలో నిలబడి గాలిపటాలు ఎగురవేయడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్–D లభిస్తుందని వైద్యులు కూడా చెబుతున్నారు. చలికాలంలో తగ్గిపోయిన రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా చేతులు, భుజాలు, మెడ కదలడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం కూడా అవుతుంది.
ఉత్తరాయణాన్ని ఆహ్వానించడం
సాంస్కృతికంగా చూస్తే, గాలిపటం స్వేచ్ఛ, ఆనందం, ఆశకు ప్రతీకగా భావిస్తారు. భూమి నుంచి ఆకాశం వైపు గాలిపటాన్ని ఎగురవేయడం ద్వారా సూర్యుడికి కృతజ్ఞత తెలపడం, ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఆహ్వానించడం అనే భావన కూడా ఉంది. మకర సంక్రాంతి రోజుల్లో ఆకాశాన్ని చూస్తూ చేసే ఈ కార్యకలాపాలు శుభప్రదంగా పరిగణిస్తారు.
కుటుంబ బంధాలను బలపరిచే సంప్రదాయం
గ్రామీణ ప్రాంతాల్లో పంట కోత పూర్తయ్యాక రైతులకు కొంత విరామం లభించే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది. కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా మారింది. దీంతో కుటుంబ బంధాలు బలపడటం, పిల్లల్లో ఉల్లాసం, ఏకాగ్రత పెరగడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
శ్రీరాముడు ప్రారంభించిన సంప్రదాయం?
సంక్రాంతి పర్వదినాన గాలిపటాలను ఎగురవేయడం వెనుక మతపరమైన కారణాలు కూడా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇతిహాసాలు చెప్పినదానిప్రకారం.. సంక్రాంతి నాడు గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం శ్రీరామచంద్రస్వామి ప్రారంభించాడు. ఆయన తొలిసారిగా గాలిపటాన్ని ఎగురవేసినపుడు.. అది ఇంద్రలోకానికి వెళ్లిందని చెప్తుంటారు. అప్పటి నుంచి హిందువులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని చెప్పుకుంటుంటారు.
అయితే.. నేటి కాలంలో గాలిపటాలు ఎగురవేస్తున్నప్పుడు జాగ్రత్తలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నైలాన్ లేదా చైనా మంజా వాడటం వల్ల పక్షులకు, ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండటంతో.. సంప్రదాయమైన పత్తి దారాలనే ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఓవరాల్ గా సంక్రాంతి పండుగలో గాలిపటాలు ఎగురవేయడం అనేది కేవలం ఆట కాదు. అది ఆరోగ్యం, ప్రకృతి, ఆనందం, కుటుంబ ఐక్యత.. ఇలా అన్నీ కలిసిన ఒక అందమైన సంప్రదాయం అని చెప్పవచ్చు. హ్యాపీ సంక్రాంతి






