- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్కబుట్ట బొమ్మలు.. కార్న్ వ్యర్థాలతో బయోడిగ్రేడబుల్ బొమ్మల సృష్టి.!
ఇవి గ్రామీణ మహిళల సాధికారతకు చిహ్నంగా నిలుస్తున్నాయి

దిశ, ఫీచర్స్: మణిపూర్‌లోని సెనాపతి జిల్లాలో ఫ్లోరిస్ట్‌గా పనిచేసే నెల్లీ చాచేయా వ్యర్థమైన కార్న్ హస్క్‌లు, వంటగది వ్యర్థాలను అద్భుతమైన బయోడిగ్రేడబుల్ బొమ్మలుగా మార్చి ఎకో ఫ్రెండ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇవి కేవలం కళాఖండాలు మాత్రమే కాదు. గ్రామీణ మహిళల సాధికారతకు చిహ్నంగా నిలుస్తున్నాయి.
ఫస్ట్ ఎక్స్‌పరిమెంట్..
చాచేయా నెల్లీ చాలా ఏళ్లు నుంచి ఫ్లోరిస్ట్‌గా పనిచేస్తోంది. ఫ్లవర్ డెకరేషన్ చేసేటప్పుడు వాడిపోయిన వాటిని చెత్తలో పడేసేది. ఒకరోజు తన వంటగదిలోని కార్న్ హస్క్‌లను పరిశీలిస్తూ వాటి మృదుత్వం, నిర్మాణాన్ని గమనించింది. అవి చెత్త కాదు కదా.? ఏదైనా అందమైనదానికి ముడిసరుకు కావచ్చేమో అని ఆలోచించింది. ప్రయోగాత్మకంగా ఒక బొమ్మను తయారుచేసింది. ఎండిన కార్న్ హస్క్‌లతో బొమ్మ శరీరాన్ని, కార్న్ కాబ్‌ల నుంచి వచ్చే సిల్కీ థ్రెడ్‌లతో జుట్టును చేసింది. బొమ్మను పూల రేకులతో అలంకరించి ముఖంపై రంగులు వేసింది. అది ఆకర్షణీయంగా అనిపించి ఇంకో స్టెప్ తీసుకోవాలని డిసైడైంది.
స్టూడియో ఏర్పాటుచేసి..
ఫ్లవర్ షాప్‌లో నెల్లీ పెట్టిన బొమ్మలను చూసిన సందర్శకులు ఆశ్చర్యపోయారు. చెత్తగా పారేసే కార్న్ హస్క్‌లతో అందమైన బొమ్మలుగా మార్చడం అద్భుతమని మెచ్చుకున్నారు. ఈ ప్రశంసలు ఆమెకు ఎంకరేజ్మెంట్‌నిచ్చాయి. క్రమంగా తమక్కావాలి అని కస్టమర్ల నుంచి ఆర్డర్‌లు షురువయ్యాయి. ఇదే అవకాశంగా సెనాపతిలోని ఒక స్టూడియో ఏర్పాటుచేసింది. ఎలాంటి కళా శిక్షణ లేకపోయినా సహజ పదార్థాలను ఉపయోగించి విత్తనాలు, పుష్పాలు, ఆకులతో అలంకరిస్తూ దానినే ఆదాయ వనరుగా మార్చుకుంది. బొమ్మల తయారీలో తన ప్రత్యేకతను చాటుకుంది.
సరికొత్త కళా బ్రాండ్..
ఒక బొమ్మ తయారు చేయాలంటే మొదట వంటగది వ్యర్థాలను జాగ్రత్తగా ఎంచుకొని కడిగి, ఎండలో ఆరబెట్టాలి. కార్న్ హస్క్‌లతో బొమ్మ శరీరాన్ని రూపొందించి మడతలు చేయాలి. కార్న్ సిల్క్‌ను జడలుగా అల్లి జుట్టుగా మార్చాలి. ఎండిన పుష్పాలతో స్కర్ట్‌లు ఇతర అలంకరణలను తయారుచేయాలి. చివరగా రంగులతో ముఖ వివరాలు, వ్యక్తిత్వం, స్వభావాన్ని జోడించాలి. ఇంకొకటి.. ఏ రెండు బొమ్మలూ ఒకేలా ఉండొద్దు. ఇది నెల్లీకి ఇష్టమైన అంశం. కొన్ని హస్క్‌లను సహజ బీజ్ రంగులో.. మరికొన్నింటిని మొక్కల ఆధారిత రంగులతో పాస్టెల్ షేడ్స్‌లో మార్చి సరికొత్త కళా బ్రాండ్ ను ఏర్పరచుకుంది.
మణిపూర్ దాటించాలని..
సెనాపతిలో వ్యర్థ నిర్వహణ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. ఈ పరిస్థితిలో నెల్లీ కళ ఎకో ఫ్రెండ్లీ క్రియేటివిటీకి బ్లూప్రింట్‌గా నిలుస్తుంది. నెల్లీ చేసే బొమ్మలు పూర్తిగా బయోడిగ్రేడబుల్. చెత్తను కళగా మారుస్తూ ఊహాశక్తితో అందమైన వస్తువుగా మార్చడమనేది చిన్న విషయమేం కాదు. తన కళ సమీప గ్రామాల్లోని మహిళలను మొక్కల వ్యర్థాలతో ఇలాంటి ఆలోచనలను అన్వేషించేలా ప్రేరేపిస్తోంది. గ్రామీణ స్థాయిలో వ్యవసాయకతను ప్రోత్సహిస్తోంది. భవిష్యత్‌లో వర్క్‌షాప్‌లు నిర్వహించి మణిపూర్ దాటి హస్తకళాకారులకు మరిన్ని వనరులను సమకూర్చాలని అనుకుంటుంది నెల్లీ.






