- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కనువిందు చేసే నీలవాక అందాలు.. ఆగుతూ.. సెల్ఫీలు దిగుతూ..
కేవలం ఆకు పచ్చని రంగులతో మాత్రమే కాకుండా.. అలరించే నీలిరంగు చెట్లతో నిండి ఉంటుంది ఆ ప్రాంతం.

దిశ, ఫీచర్స్ : మీరు పర్యాటకు ప్రేమికులైతే గనుక ఈ సీజన్‌లో తప్పక చూడాల్సిన ఒక ప్రదేశం ఒకటుంది అంటున్నారు ఔత్సాహికులు. ఎందుకంటే.. ఈ సీజన్‌లో అది మరింత అందంగా ఉంటుంది. చూడగానే ఆకట్టుకుంటుంది. ఎగుడు దిగుడు లోయలతో కేవలం ఆకు పచ్చని రంగులతో మాత్రమే కాకుండా.. అలరించే నీలిరంగు (Violet) చెట్లతో నిండి ఉంటుంది. కళ్లకు అందంగా, మనసుకు ఆహ్లాదంగా తోస్తుంది. అందుకే మార్చి నుంచి మే నెల చివరి వరకు అనేకమంది పర్యాటకులకు, ముఖ్యంగా యువ జంటలకు ఈ ప్రాంతమొక ‘కలల ప్రయాణం’గా పేర్కొంటారు. ఇంతకీ అదేమిటి?, ఎక్కడుంది? అనే కదా మీ సందేహం! మరేదో కాదు. మన దేశంలోనే, కేరళ రాష్ట్రంలోని మున్నార్. ప్రస్తుతం ఇది పర్పల్ కలర్ చెట్లతో ప్రజలను అలరిస్తూ.. ఆనందాలను పంచుతోంది. ఆ విశేషాలేమిటో మనమూ తెలుసుకుందాం పదండి!
ఆకులు రాలి.. రంగులు తేలి..
అందమైన ప్రకృతి అందాలకు నెలవుగా కేరళను పేర్కొంటారు. ఇక్కడ టూరిస్టు ప్లేస్‌లు అనేకం ఉన్నప్పటికీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మున్నార్‌కు మరో ప్రత్యేకత ఉంటుంది. అందుకు కారణం ఇక్కడి అందమైన పర్వత లోయల్లోని జకరాండా చెట్లు(Jacaranda trees) విరగ బూస్తాయి. వీటినే స్థానికంగా నీలవాక(Neelavaka - నీలి చెట్టు) చెట్లు అని పిలుస్తారు. తెలుగువారు నీలిచెట్లు, స్వర్ణసుందరి చెట్లు అని కూడా పిలుస్తుంటారు. ఏప్రిల్‌లో అవి ఆకులు రాలిపోయి, కేవలం ఊదా రంగు పూలతో నిండి ఉంటాయి. వాటి వల్ల మున్నార్ కొండలు, లోయలు, రోడ్లు మరింత అందంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మరయూర్ నుంచి మధ్య రోడ్డు, పల్లివాసల్- మున్నార్ స్ట్రెచ్, వాగువరై టీ ఎస్టేట్, చిన్నకనాల్ వంటి ప్రాంతాల్లో ఈ ఊదా పూల సీజన్ అద్భుంతంగా అనిపిస్తూ మనసుకు హాయినిస్తుంది.
నీలవాక నీడలో..
పచ్చని తేయాకు తోటల మధ్య నీలిరంగు పూల కలయిక ఒక అద్భుతమైన, అపూర్వమైన అందమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులు, ప్రయాణికులు ఈ అందమైన ప్రకృతి ఒడిలో ఆనందంగా గడిపి వెళ్తుంటారు. ఇక రోడ్లపై నుంచి వెళ్లేవారు కూడా ఊదారంగు చెట్లను చూడగానే కాసేపు ఆగి సెల్ఫీలు తీసుకొని మరీ వెళ్తుంటారు. అనేకమంది మంది ఏప్రిల్‌లో ట్రిప్ కోసం ఈ ప్రాంతాన్నే ఎక్కువగా ఎంచుకుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలు తెల్లటి దుస్తులు ధరించి నీలవాక చెట్ల నీడలో ఫొటోలు దిగడానికి ఇష్టపడుతుంటారు. ఇలా అనేకమంది మున్నార్ అందాలను తమ సెల్‌ఫోన్లలో బంధిస్తుంటారు. సెల్ఫీలు దిగి జ్ఞాపకాల డైరీలో భద్ర పర్చుకుంటారు. ప్రస్తుతం ఈ మున్నార్ నీలి రంగు చెట్ల అందాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వాటిని చూస్తూ.. షేర్ చేస్తూ మురిసిపోతున్నారు నెటిజన్లు.






