మట్టిలోనే మహిమ ఉందిరా.. పిల్లలతో ప్రకృతి సాహస యాత్రలు చేయిస్తున్న తల్లి.!

by Daayi Srishailam |

‘హార్ట్ అండ్ సాయిల్’ సంస్థ ద్వారా ప్రకృతి సాహస యాత్రలను అందిస్తోంది.

మట్టిలోనే మహిమ ఉందిరా.. పిల్లలతో ప్రకృతి సాహస యాత్రలు చేయిస్తున్న తల్లి.!
X

దిశ, ఫీచర్స్: ఈ డిజిటల్ యుగంలో పిల్లలు తెరలకు అతుక్కుపోతున్నారు. అలాంటి సమయంలో వారిని ప్రకృతితో మమేకం చేయడం ఎంతో అవసరం. ముంబైకి చెందిన నేహల్ షా ఒక తల్లిగా ఈ అవసరాన్ని గుర్తించి తన ‘హార్ట్ అండ్ సాయిల్’ సంస్థ ద్వారా ప్రకృతి సాహస యాత్రలను అందిస్తోంది.

కొడుకు కూడా తనలాగే..

ముంబైలో పెరిగిన నేహల్‌ చిన్నప్పుడు తోటల్లో ఆడుకునేది. దీంతో మొక్కలు పెంచడం అలవాటైంది. వాళ్ల నాన్న, తాతయ్యలతో కలిసి మొక్కలు నాటేది. పక్షులు, జంతువులతో స్పెండ్ చేసేందుకు ఎక్కువ సమయం ఇచ్చేది. ఈ అనుభవాలు ఆమెలో ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమను ఏర్పరిచాయి. రేడియో మిర్చీలో పనిచేస్తున్న సమయంలో ఒక ట్రెక్కింగ్ క్లబ్ ద్వారా వెస్టర్న్ ఘాట్స్‌లో సాహస యాత్రలు చేసింది. వివాహం తర్వాత కూడా ఆమె దేశవ్యాప్తంగా బ్యాక్‌ప్యాకింగ్ ట్రిప్‌లు చేసింది. తల్లిగా మారిన తర్వాత, తన కొడుకు దేవ్‌కు కూడా ఇలాంటి అనుభవాలు ఇవ్వాలని నిశ్చయించుకుంది.

ప్రకృతే నేర్పిస్తుంది

2016లో నేహల్ తన ఫేస్‌బుక్ పేజీలో క్యాంపింగ్ ట్రిప్ గురించి పోస్ట్ చేసింది. 30 మందికి పైగా తల్లిదండ్రులు ఆ ట్రిప్‌లో పాల్గొన్నారు. నేహాల్ కొడుకు దేవ్ ఇతర పిల్లలతో కలిసి ఆనందించడం చూసి తనలోని అనుమానాలు తొలగిపోయాయి. ఆ ట్రిప్ తర్వాత నేహల్ వెనుదిరిగి చూడలేదు. దేవ్ మూడున్నర సంవత్సరాల వయసులో జంగిల్ సఫారీ చేశాడు. నాలుగేళ్ల వయసులో హిమాలయ ట్రెక్‌లో పాల్గొన్నాడు. జలోరీ పాస్ ట్రెక్‌లో కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవ్ ధైర్యంగా ముందుకు సాగాడు. “ప్రకృతి గొప్ప గురువు. అది విజయం, వైఫల్యం రెండింటినీ ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది అంటోంది నేహల్.

హార్ట్ అండ్ సాయిల్

దేవ్ లాంటి పిల్లల కోసం 2016లో ‘హార్ట్ అండ్ సాయిల్’ సంస్థను స్థాపించింది. ఇప్పటివరకు 2,000 కుటుంబాలకు ప్రకృతి అనుభవాలను అందించింది. దేవ్ ఇప్పుడు 10 సంవత్సరాల వయసులో హిమాచల్ ట్రెక్‌లు, స్నార్కెలింగ్, క్యాంపింగ్, భూటాన్‌లోని టైగర్ నెస్ట్ ట్రెక్ వంటి అనేక సాహసాల్లో పాల్గొన్నాడు. ఈ అనుభవాలు అతని దృక్పథాన్ని విస్తృతం చేశాయి. తల్లీకొడుకుల బంధాన్ని బలోపేతం చేశాయి. నేహల్ తన సంస్థ ద్వారా ఇతర తల్లిదండ్రులకు కూడా స్ట్రాబెరీ పికింగ్, రాపెల్లింగ్, కయాకింగ్, వ్యవసాయ కార్యకలాపాలు, రాత్రి నక్షత్రాలను చూడటం వంటి విభిన్న కార్యక్రమాలను ఆమె నిర్వహిస్తుంది.

పిల్లలపై ఒత్తిడి పెంచొద్దు

2024లో నేహల్ తన ఉద్యోగాన్ని వదిలి ‘హార్ట్ అండ్ సాయిల్’పై పూర్తిగా దృష్టి పెట్టింది. ఆమె ఇప్పుడు మేఘాలయ, పెంచ్ (మధ్యప్రదేశ్) వంటి ప్రాంతాలకు వన్యప్రాణి సఫారీలు, ట్రెక్‌లను ప్లాన్ చేస్తోంది. ఆమె ట్రిప్‌ల ప్రత్యేకత ఏమిటంటే అన్ని వయసుల పిల్లలకు అవకాశం కల్పించడం. చిన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా సులభంగా ప్రయాణించే అవకాశం ఉందిక్కడ. “ప్రయాణాన్ని సవాలుగా భావించకండి. సహజంగా సాగనివ్వండి. పిల్లల పెంపకాన్ని ఒత్తిడిగా భావించకండి. ఎప్పుడూ బిజీగా ఉండాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకు వారి బాల్యాన్ని ఆస్వాదించే అవకాశం ఇవ్వండి” అని సూచిస్తోంది.

Next Story