పిల్ల పెళ్లి.. తల్లి లొల్లి.. నెట్టింట వీడియో వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2026-04-11 19:13:03  IST  )

30ఏళ్లు వచ్చినా మ్యారేజ్ చేసుకోవట్లేదని తల్లి గోల.. ఓ అయ్య చేతిలో పెట్టి వదిలించుకునే ప్లాన్.. కానీ ససేమిరా అంటున్న కూతురి వీడియో వైరల్

పిల్ల పెళ్లి.. తల్లి లొల్లి.. నెట్టింట వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి విషయంలో తల్లిదండ్రులు చేసే ఒత్తిడి మామూలుగా ఉండదు. కొన్నిసార్లు నవ్వొస్తుంది వాళ్లు చెప్పే ముచ్చట వింటుంటే. సెంటిమెంట్స్ పక్కనపెడితే.. చిన్నపిల్లలకు బూచోడిని చూపించి భయపెట్టినట్లు చేస్తుంటారు పెళ్లి విషయంలో. ఇక్కడ తల్లీ.. కూతురు మధ్య ఇలాంటి సన్నివేశమే జరిగింది. ఇది అందరికీ కనెక్టవుతూ మ్యారేజ్ మెమొరీస్‌ను గుర్తుచేస్తోంది.

పెద్ద ప్లానింగే..

కూతురు వయసు 31 సంవత్సరాలు. పెళ్లీడుకొచ్చింది కాబట్టి ఓ అయ్యింటికిచ్చి లగ్గం చేయాలనుకుంటారు ఎవరైనా. పెండ్లి చేస్తే బరువు, బాధ్యత తీరుతుందనేది వారి ఆలోచన. ఈ అమ్మాయి వాళ్ల అమ్మ కూడా ఇలాగే ఆలోచించింది. ఏదో రకంగా కూతుర్ని ఒప్పించి పెండ్లి చేయాలన్నది తన ఉద్దేశం. పాపం ఎన్నో రకాలుగా చెప్పి చూసింది. అయినా ఆ అమ్మాయి పెండ్లికి ససేమిరా అంటోంది. కూతుర్ని ఒప్పించలేక తల ప్రాణం తోకకొస్తుంది ఆమెకు. ఇట్లయితే వినదు.. ఏదో ఒకటి చేసి కూతుర్ని పెండ్లికి ఒప్పించాలని పెద్ద ప్లానింగే వేసింది.

ముందే పసిగట్టి..

మెల్లగా కూతుర్ని దగ్గరికి ప్రేమగా పిలిచింది. మమ్మీ ఏదో ఫిటింగే పెట్టేటట్లుందని ముందే పసిగట్టింది కూతురు. ‘ఏం చేస్తున్నావురా బంగారు తల్లి’ అని ఆప్యాయంగా పలకరించింది. ‘మమ్మీ.. నీ బిస్కెట్లేసుడు నాకర్థమైందిగానీ అసలు విషయమేంటో చెప్పూ’ అని కూతురు సమాధానమిచ్చింది. ‘ఈసారైనా పెండ్లిచేసుకో తల్లి’ అని అన్నది వాళ్లమ్మ. ‘ఎహెపో’ అని కూతురి సమాధానం. ‘ఒసేయ్.. తింగరిదానా.. నువ్వుగనుక ఇప్పుడు పెండ్లిచేసుకోకపోతే.. మీ నాన్న ఆత్మ నీ చుట్టే తిరుగుతుంది. నీకిక నిద్రలేని రాత్రులే పో ఇగ’ అని హెచ్చరించింది.

పిచ్చిపట్టినట్లు..

తల్లి మాటలు విని కూతురు నవ్వు ఆపుకోలేకపోయింది. కిల్లకిల్ల నవ్వుతూ భూమి పట్టింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. ‘నా పెండ్లి గురించి మా అమ్మ నన్ను మానిప్యులేట్ చేయడంలో పూర్తిగా పిచ్చిపట్టినట్లు చేస్తోంది చూడండి’ అంటూ షేర్ చేసిన వీడియోకి దాదాపు ఒక లక్ష వ్యూస్ వచ్చి వైరల్ అయింది. నెటిజన్లు ఈ వీడియోను చూసి మస్తు నవ్వుకుంటున్నారు. కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. చాలామంది తమ సొంత అనుభవాలను కామెంట్లలో పంచుకున్నారు.

నెటిజన్ల కామెంట్లు..

ఒకరంటారు.. ‘నాకు 29 ఏళ్లు. మా అమ్మ కూడా ఇలాంటివే చెబుతుంది. ఎప్పుడూ ‘బాబా’ పేరు తీస్తుంది’ అని. ఇంకొకరంటారు.. ‘వాళ్లు ఏమైనా చెప్పి.. ఏమైనా చేసి పెళ్లి చేయించాలని చూస్తారు’ అనీ. కొందరు.. ‘నా నాన్న పెళ్లి చేసుకో నీ అకౌంట్‌లో 10 లక్షలు వేస్తా అన్నాడు. ఇప్పటికీ డబ్బు వేయలేదు’.. వంటి అనుభవాలను పంచుకున్నారు. ఈ వీడియో ఫన్నీగా కనిపించినా మనచుట్టూ ఇప్పటికీ ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయి. 30 ఏళ్లు దాటిన యువతులకు పెండ్లి చేయాలని నానా రకాలుగా తిప్పలు పడుతుంటారు.

Next Story