‘మోడ్రన్ పేరెంట్స్’.. పిల్లల పెంపకం సవాళ్లను ఇలా అధిగమించండి!

by B.Srinivas |   (  Updated:2026-01-24 07:52:25  IST  )

పిల్లల పెంపకంలో మోడ్రన్ పేరెంట్స్ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు. 70% మంది పనుల భారం వల్ల పిల్లలను పట్టించుకోవట్లేదట.

‘మోడ్రన్ పేరెంట్స్’.. పిల్లల పెంపకం సవాళ్లను ఇలా అధిగమించండి!
X

దిశ, ఫీచర్స్: పిల్లల పెంపకంలో మోడ్రన్ పేరెంట్స్ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటున్నారు. 70% మంది తల్లిదండ్రులు పనుల భారం వల్ల అలసిపోతున్నారు. దీనివల్ల బాలల మానసికస్థితిని పట్టించుకోకుండా తరచుగా ఎడ్యూకేషన్, ఫుడ్, క్రమశిక్షణ వంటి ఫిజికల్ యాక్టివిటీస్‌పైనే ఒత్తిడి చేస్తున్నారని చైల్డ్ సైకాలాజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల మెంటాల్టీని అర్థం చేసుకోవాడానికి అసలే ట్రై చేయట్లేదు. ఎంతసేపు వారి నీడ్స్ తీర్చడమే రిలీఫ్‌గా ఫీల్ అవుతున్నారు. సీరియస్ పెరెటింగ్, ఓవర్ కేరింగ్, నిర్లక్ష్యం వంటి అనేక కారణాలతో చాలా మంది పేరెంట్స్ వారికి తెలియకుండానే పిల్లల ఎమోషనల్, మెంటల్ హెల్త్, కాన్ఫిడెన్స్ వంటి వాటిపై ప్రతికూల ప్రభావం వేస్తున్నారని, ఈ తరహా శైలిని అవలంభించడం మంచిది కాదని నిఫుణులు హెచ్చరిస్తున్నారు.

సీరియస్ పేరెంటింగ్:
ఇంట్లో కఠినమైన నియమాలు పెట్టడం వల్ల పిల్లలు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా షేర్ చేసుకోలేరు. పేరెంట్స్ విధించే రూల్స్‌ను అర్థంచేసుకోవడం కంటే భయంతోనే గడుపుతుంటారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు క్రమశిక్షణతో ఉన్నట్లు కనిపించినప్పటికీ ఎల్లప్పుడూ తమ ఫ్రీడమ్‌‌ను హరించివేస్తున్న భావోద్వేగాలతో ఆందోళనకు గురవుతుంటారు. కాలక్రమేణా ఇది పెద్దలపై తిరుగుబాటుకు కూడా దారితీయవచ్చు. తల్లిదండ్రులు కొంతసమయం పిల్లల ఇష్టాలు, ఆటల్లో భాగం అవుతూనే ఇంట్లో నియమాల వెనుక ఉన్న కారణాన్ని వివరించి అర్థం చేయించాలి. పిల్లలు తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించుకునేలా ప్రోత్సహించాలని సైకాలాజిస్టులు సూచిస్తున్నారు.

ఫుల్ ఫ్రీడమ్:
ఈ తరం పిల్లలకు ఎలాంటి హద్దులు గీయకుండా పూర్తి స్వేచ్ఛతో పెంచడంకూడా ప్రమాదకరంగా మారుతోంది. కొంతమంది అతిగారాబం ప్రాణాలమీదకు తెస్తోంది. ఇది వద్దు, అలా చేయకు, ఇలాగే ఉండాలి, ఏది ఎంత వరకు అవసరం అనేది చెప్పకుండా డిమాండ్‌ చేసిన వెంటనే కొనిపెట్టడం వల్ల స్వయంగా పేరెంట్సే వారిలో క్రమశిక్షణ రాహిత్యాన్ని ప్రొత్సహించినట్లు అవుతుంది. పూర్తి స్వేచ్ఛకు అలవాటు పడిన పిల్లలు చదువుతోపాటు తప్పు, ఒప్పుల మధ్య తేడాను గుర్తించడంలో విఫలమవుతుంటారు. తమకు నచ్చినట్లు ఏది చేయకపోయినా అసహనానికి గురికావడం లేదా చిరాకు పడుతుంటారు. తమ ఇష్టాలను కాదంటే కొన్నిసార్లు ప్రాణాలు తీసుకుంటారు లేదంటే ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు. అందుకే స్వేచ్ఛలోనూ స్పష్టమైన సరిహద్దులుండాలని నిపుణులు చెబుతున్నారు.

నిర్లక్ష్యం డేంజర్:
తల్లిదండ్రులు పిల్లలపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఆందోళన కలిగించే అంశమే. ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి కారణంగా పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చి వదిలేయడం, టీవీ పెట్టి గదిలో కూర్చోబెట్టడం, వారి ఎమోషనల్ నీడ్స్‌ను పట్టించుకోకపోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లోనే పిల్లలు తమను తాము ఒంటరిగా ఫీల్ అవుతారు. చాలా సందర్భాల్లో పేరెంట్స్ నిర్లక్ష్యమే పిల్లల్లో ప్రతికూల ఆలోచనలు, హానికరమైన పనులకు దారితీస్తుంది. పిల్లలు పెరుగుతున్నకొద్ది ఇతరులను గౌరవించకపోవడంతోపాటు చివరకు పేరెంట్స్ పట్లకూడా ప్రేమను కలిగివుండలేరు. అందుకే ప్రతిరోజూ కొంత సమయాన్ని పిల్లలకోసం కేటాయించి, వారి ఆనందాలతో తప్పనిసరిగా కనెక్ట్ కావాల్సిందే.

ఇతరులతో పోలిక:
పోలిక అనేది పిల్లల ఎమోషనల్ డెవలప్‌మెంట్‌పై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. తోబుట్టువులు, క్లాస్‌మేట్స్, ఫ్రెండ్, చుట్టాల పిల్లలు వంటి వారి టాలెంట్, ఫిజికల్ యాక్టివిటీస్‌‌తో పోల్చడం వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల తమను తాము పనికిరాని వారిగా భావిస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతీంటుంది. 10శాతం పిల్లలు కూడా పోలికలను పోటీగా తీసుకోలేరని, ఎవరితోనైతే పోలుస్తామో వారిపట్ల కోపం లేదా అసూయ కలుగుతుందని సైకాలాజిస్టులు చెబుతున్నారు. తోబుట్టువుల మధ్య లేదా స్నేహితుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు దెబ్బతింటాయి. తమ మనసులో ఉన్న విషయాలను కూడా తల్లిదండ్రులతో పంచుకోవడం మానేస్తారు. ఇది వారి సహజమైన క్రియేటివిటినీ దూరం చేస్తుంది. ప్రతి ఒక్కరికి టాలెంట్, కాన్ఫిడెన్స్, ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహస్తే తమనుతాము తీర్చిదిద్దుకుంటారు.

ఓవర్ కేరింగ్:
పిల్లలపై ప్రేమ ఉండటం సహజం. కానీ అది ఓవర్ కేరింగ్‌కు దారితీస్తేనే ప్రమాదంగా మారుతుంది. వారి చుట్టూ ఎల్లప్పుడూ ఒక రక్షణ కవచంలా ఉండటం వల్ల వారు బయటి ప్రపంచాన్ని చూసి భయపడతారు. చిన్నపాటి వైఫల్యాన్ని కూడా తట్టుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. స్వాతంత్ర్యంగా ఏ చిన్న నిర్ణయం తీసుకోలేకపోతారు. సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోలేరు. ‘నేను సొంతంగా ఏదీ చేయలేనేమో’ అనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది. ఏం తినాలి, ఏం చదవాలి, ఎవరితో స్నేహం చేయాలి అనే విషయాల్లో పేరెంట్స్ అతిగా జోక్యం చేసుకుంటే... పిల్లలు సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతారు. పెద్దయ్యాక కూడా ప్రతి నిర్ణయానికి ఇతరులపై ఆధారపడతారు. తమ తప్పులను కప్పిపుచ్చడానికి లేదా తాము చేసిన పొరపాట్లను సరిదిద్దడానికి పేరెంట్స్ ఉంటారనే భావనతో జవాబుదారీతనం ఉండదు. కాబట్టి మీరు ఎల్లప్పుడు మార్గదర్శిగా ఉండండి. అధికారిలా కాకుండా వెనకుండి నడిపించే తోడుగా ఉండండి. చిన్న చిన్న తప్పుల ద్వారానే పిల్లలు జీవిత పాఠాలు నేర్చుకుంటారు.

పిల్లల పెంపకం ఒక కళ:
పిల్లలు మన ద్వారా ఈ ప్రపంచంలోకి వస్తారు. కానీ వారు మన ఆస్తి కాదు. వారికి సొంత ఆలోచనలు, కలలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ప్రోత్సహించడమే నిజమైన పెంపకం. నేటి తరం పిల్లలు మనం ఊహించినదానికంటే చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు. కాబట్టి ముందుగా వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. రోజులో కనీసం గంట సేపు వారితో మాట్లాడాలి. రోజంతా స్కూల్లో ఏం జరిగింది? స్నేహితులతో కలిసి ఏం చేశారు? వంటి విషయాలను అడిగి తెలుసుకోవాలి. పిల్లలముందు, పిల్లలతో అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్‌ను అనుకరిస్తారు. ఫోన్, మోబైల్ ఇతరత్రా గ్యాడ్జెట్స్ కంటే ఫిజికల్ యాక్టివిటీస్‌కు ప్రయారిటీ ఇవ్వండి. ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్‌కు దగ్గర చేయండి. వారితో ముచ్చట్లు, ఆటలు, ఇతర విషయాలు తెలుసుకునే స్వేచ్ఛను కల్పించాలని చైల్డ్ సైకాలాజిస్టులు సూచిస్తున్నారు.

Next Story