మిట్టీ కా ఘర్.. చదువొక్కటే కాదు జీవితాన్నీ నేర్పిస్తుంది.!

by Daayi Srishailam |

ఇళ్లను గుర్తుచేసే సహజమైన వాతావరణంలో విద్యను అందిస్తోంది.

మిట్టీ కా ఘర్.. చదువొక్కటే కాదు జీవితాన్నీ నేర్పిస్తుంది.!
X

భోపాల్‌లోని నీల్‌బాద్ శివారులో మట్టితో నిర్మించిన ఒక ప్రత్యేకమైన పాఠశాల గుండెలను కదిలిస్తోంది. ఈ 'మిట్టీ కా ఘర్' అనే పాఠశాల గిరిజన సముదాయాల నుంచి వచ్చే పిల్లలకు వారి ఇళ్లను గుర్తుచేసే సహజమైన వాతావరణంలో విద్యను అందిస్తోంది.

- దిశ, ఫీచర్స్

గిరిజన పిల్లలకు ఆశ్రయం

పార్ధీ, గోండీ గిరిజన సముదాయాలు బ్రిటిష్ పాలనలో 'క్రిమినల్ ట్రైబ్స్'గా ముద్రవేయబడ్డారు. 1952లో ఈ చట్టం రద్దయినప్పటికీ ఆ ముద్ర అలాగే ఉండి బస్తీలలో, అడవుల్లో నివసించే గిరిజనులకు ఆధునిక విద్య ఒక కలగా మిగిలిపోయింది. అలాంటివారికి మిట్టీ కా ఘర్ ఒక ఆశాకిరణంగా మారింది. 2017 నుంచి భోపాల్‌లోని 'ముస్కాన్' అనే ఎన్జీవో ఈ పాఠశాలను నడుపుతోంది. మిట్టీ కా ఘర్‌లో 210 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ఆ పాఠశాలకు ఇప్పుడు పునరుద్ధర అత్యంత అవసరం అని చెప్తున్నారు.

సహజ అనుభూతి

మిట్టీ కా ఘర్‌ను ఎండబెట్టిన మట్టి ఇటుకలతో నిర్మించారు. ఇవి మట్టి, నీరు, గడ్డితో తయారవుతాయి. ఈ నిర్మాణం పిల్లలకు వారి ఇళ్లను గుర్తు చేస్తుంది. దీనివల్ల వారక్కడ సౌకర్యవంతంగా ఉంటున్నారు. సాధారణ సిమెంట్ భవనాల్లో పిల్లలు అసౌకర్యంగా ఫీలవుతారు. కానీ ఇక్కడ వారు స్వేచ్ఛగా ఉంటారు. మట్టి ఒక సహజమైన పదార్థం కాబట్టీ సూర్యరశ్మి, గాలి, ఇతర సహజ శక్తులతో సమతుల్యంగా ఉంటుంది. ఖరీదైన రంగులు, సిమెంట్‌‌కు బదులుగా పాత భవనాల నుంచి రీసైకిల్ చేసిన కలప నిర్మించారు.

సామాజిక వేదిక

తడి వాతావరణం, నీటి సమస్యల వల్ల మట్టి ఇటుకలు బలహీనపడ్డాయి. నల్లమట్టి కావడం వల్ల అది తేమను ఎక్కువగా గ్రహించి సమస్యను తీవ్రతరం చేసింది. దీనిని పరిష్కరించడానికి వాస్తుశిల్పి సౌరభ్ గుజార్ బృందం ఎరుపు ఇటుకలు, సున్నంతో పునరుద్ధరణ పనులను చేపట్టింది. ఇవి తేమను తట్టుకోగలవు. మిట్టీ కా ఘర్ కేవలం విద్యను అందించే పాఠశాల మాత్రమే కాదు. ఇది గిరిజన పిల్లలకు సామాజిక, ఆరోగ్య సంబంధిత సమస్యలను పరిష్కరించే వేదిక కూడా. ఈ పాఠశాలలో చదువుతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహార సమస్యలపై కూడా దృష్టి సారిస్తారు.

జీవిత నైపుణ్యాలు

ముస్కాన్ ఎన్జీవో వ్యవస్థాపకురాలు శివానీ తనేజా. గిరిజన, ఇతర వెనుకబడిన సముదాయాల పిల్లలను సాంప్రదాయ పాఠశాలల్లో చేర్పించడం కష్టమని గుర్తించిన ఆమె, వారి సామాజిక, ఆర్థిక నేపథ్యానికి అనుగుణంగా విద్యను అందించే ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. ఈ లక్ష్యంతోనే 'జీవన్ శిక్షా పహల్' అనే ప్రయోగాత్మక పాఠశాలను మిట్టీ కా ఘర్‌లో ప్రారంభించారు. ఈ పాఠశాలలో పిల్లలు కేవలం పుస్తకాలను చదవడమే కాకుండా, జీవితంలో ఉపయోగపడే నైపుణ్యాలను కూడా నేర్చుకుంటారు. గోండీ, పార్ధీ, కంజర్, దళిత, ముస్లిం సముదాయాల పిల్లలు వస్తున్నారు.

Next Story