ఇంట్లోనే క్యాన్సర్, హెచ్ఐవీ‌ టెస్ట్.. కొత్త పరికరాన్ని డెవలప్ చేసిన పరిశోధకులు

by Javid Pasha |

ఇంట్లోనే క్యాన్సర్, హెచ్‌ఐవీ వంటి టెస్టులు చేసుకోగలిగే డీఎన్‌ఏ సెన్సార్‌ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు.

ఇంట్లోనే క్యాన్సర్, హెచ్ఐవీ‌ టెస్ట్.. కొత్త పరికరాన్ని డెవలప్ చేసిన పరిశోధకులు
X

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్, హెచ్‌ఐవీ వంటి టెస్టులు చేయించుకోవాలనుకునేవారు ఇక ఆస్పత్రులు, ల్యాబుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకపోవచ్చు! ఎందుకంటే.. ఎవరికి వారు ఇంట్లోనే పరీక్షించుకోగలిగే డీఎన్‌ఏ సెన్సార్‌ను మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పేపర్ ఆధారిత సెన్సార్ చాలా చిన్నటి జీవ సంబంధిత నమూనాను సైతం ఉపయోగించి, క్యాన్సర్, హెచ్‌ఐవీ వంటి తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన బయోమార్కర్లను గుర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పరిశోధకులు డెవలప్ చేసిన డీఎన్‌ఎ సెన్సార్ పరికరం గోల్డ్ నానోపార్టికల్స్‌ను, అలాగే నిర్దిష డీఎన్ఏ సీక్వెన్స్‌ను ఉపయోగించి పని చేస్తుంది. టార్గెటెడ్ వ్యాధికి సంబంధించిన జన్యు పదార్థం దానిని తాకినప్పుడు రసాయనిక ప్రతిచర్య జరిగి, కంటికి కనిపించే రంగు మార్పు లేదా ఎలక్ట్రికల్ సిగ్నల్ వస్తుంది. దీంతో సింపుల్‌గా వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. ఎటువంటి ఖరీదైన ల్యాబ్ పరికరాలు లేకుండానే ఫలితాలు కూడా త్వరగా వస్తాయి. అంతేకాకుండా ఇది పోర్టబుల్ పరికరం కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ల్యాబులు అందుబాటులో లేని ఏరియాల్లో చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించడం దీని ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టి, చికిత్స చేయడంలో ఆలస్యాన్ని నివారించవచ్చు. దీంతో ఇది రోగులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పరీక్షించుకునేలా చేసి, ఆరోగ్య సంరక్షణలో వారి పాత్రను బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రజల వినియోగానికి అందుబాటులో లేదు. భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది.

Next Story