- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెన్‌జీలే సో బెటర్..! మిలీనియల్స్‌లో పెరిగిపోతున్న ఆ సమస్య!!
మిలీనియల్స్ పలు విషయాల్లో బర్న్ అవుట్ బాధితులుగా మారుతున్నారు. కానీ.. జెన్‌జీలు మాత్రం సంతోషంగా ఉంటున్నారు.

దిశ, ఫీచర్స్ : సమస్యలూ సవాళ్లు ప్రతీ ఒక్కరికీ ఎదురవుతుంటాయి. బాధలూ బాధ్యతలూ అందరికీ ఉంటాయి. అంతేగానీ అవి వయసును బట్టి లేదా జెండర్‌ను మాత్రమే ఉంటాయనుకోవడం పొరపాటు. కాకపోతే ఏజ్‌ను బట్టి, ప్రత్యేక పరిస్థితులను బట్టి భిన్నమైనవిగా ఉండొచ్చు. వాటి ప్రభావాల్లో తేడాలు ఉండొచ్చు. ఇటీవల మిలీనియల్స్ (29-44 సంవత్సరాలు), జెన్‌జీ(13-28 సంవత్సరాలు)ల విషయంలోనూ అదే జరుగుతోంది. అయినప్పటికీ రోజువారీ జీవితంలో, ఉద్యోగాల్లో, నైపుణ్యాల్లో పోల్చినప్పుడు జెన్‌జీలకంటే మిలీనియల్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారని, వీరు తరచుగా బర్న్ అవుట్ బాధితులుగా మారుతున్నారని నిపుణులు అంటున్నారు. గతంలో డెలాయిట్ నిర్వహించిన ఒక సర్వేలోనూ ఇదే వెల్లడైంది.
బర్న్ అవుట్ అంటే ఏమిటి?
వాస్తవానికి బర్న్ అవుట్ అనేది దీర్ఘకాలిక ఒత్తిడివల్ల కలిగే మానసిక, శారీరక, భావోద్వేగ అలసట. ఇది ఉద్యోగం లేదా బాధ్యతలపట్ల ఆసక్తి కోల్పోవడానికి దారితీస్తుంది. అసంతృప్తికి, నిస్సహాయతకు కారణం అవుతుంది. అధిక పనిభారం, వర్క్- లైఫ్ సమతుల్యత లేకపోవడం, నిరంతర ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల కూడా ఇది సంభవిస్తుంది. కాగా దీనిని మేనేజ్ చేయలేక మిలీనియల్ (1981-1996 మధ్య జన్మించినవారు) బర్న్ అవుట్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు సర్వే పేర్కొన్నది.
మిలీనియల్స్‌పై ప్రభావం
ఇటీవలి ఒక సర్వే ప్రకారం.. దాదాపు 50% మంది మిలీనియల్స్ బర్న్ అవుట్ కారణంగా ఉద్యోగాల్లో, వృత్తుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే జాబ్స్ వదిలేస్తున్నారు. 84% మంది తాము చేస్తున్న ప్రస్తుత ఉద్యోగంలో అలసటను అధిక అసటను అనుభవిస్తున్నారు. ఎందుకంటే వీరు ఇతర తరాల కంటే ఎక్కువ గంటలు పని చేస్తూ, కష్టతరమైన బాధ్యతలను నిర్వహిస్తూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కెరీర్‌లో ఉన్నత స్థానాలను చేరుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. కానీ ఈ అతి శ్రమ(Excessive labor) మానసికంగా, శారీరకంగా అలసిపోయేలా చేస్తున్నదని డెలాయిట్ నిర్వహించిన సర్వే పేర్కొన్నది. జెన్ జీలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నారు.
జెన్‌జీలలో హ్యాపీనెస్..
ఒక వైపు మిలీనియల్స్ పలు విషయాల్లో బర్న్ అవుట్ బాధితులుగా మారుతుంటే, మరోవైపు జెన్ Z (1997-2012 మధ్య జన్మించినవారు) మాత్రం, వీరికంటే సంతోషంగా ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీరు ఉద్యోగాలు, వృత్తినైపుణ్యాలు, జీవిత లక్ష్యాలపట్ల గత తరాలకంటే భిన్నమైన ఆలోచనలను, లక్ష్యాలను కలిగి ఉంటున్నారు. కేవలం 6% మాత్రమే తమ ప్రధాన లక్ష్యం కెరీర్‌లో లీడర్‌షిప్ స్థాయికి చేరుకోవడమని చెబుతుండగా.. మిగతా శాతమంతా కెరీర్‌లో ఉన్నతమైన స్థాయి(career superiors)కంటే జీవితంలో సమతుల్యతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా జెన్‌జీలు వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తున్నారు. బర్న్ అవుట్‌కు గురయ్యే పరిస్థితి ఉంటే.. ఎంత మంచి ఉద్యోగాలైనా, అవకాశాలైనా వదిలేస్తున్నారు కానీ, అధిక ఒత్తిడిని అనుభవిస్తూ, అవస్థలు పడుతూ చేసేందుకు సిద్ధ పడటం లేదు. మిలీనియల్స్ అండ్ జెన్‌జీల మధ్య ఈ రెండు తేడాలే వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కాగా జెన్‌జీలు మెంటల్ హెల్త్‌ను, పర్సనల్ హ్యాపీనెస్‌ను కాపాడుకోవడంపై ఫోకస్ పెడుతూ, ఒత్తిడికి దూరంగా ఉండేందుకు లేదా నివారించేందుకు మరింత స్మార్ట్ విధానాలను అనుసరిస్తున్నారు.






