ఫ్యాషన్ పరిశ్రమలో పర్యావరణ హితం.. లెదర్‌కు బదులు డెస్సెర్టో..!

by Javid Pasha |

లెదర్ తయారీ కోసం జంతువులను వధించకుండా, ప్రత్యామ్నాయ ఫ్యాషన్‌ను ఎలా క్రియేట్ చేయాలో మెక్సికన్ ఆవిష్కర్తలు ఆలోచించారు.

ఫ్యాషన్ పరిశ్రమలో పర్యావరణ హితం.. లెదర్‌కు బదులు డెస్సెర్టో..!
X

దిశ, ఫీచర్స్ : హ్యాండ్ బ్యాగ్, మనీ పర్స్, నడుముకు పెట్టుకునే బెల్డ్, కాళ్లకు తొడిగే షూస్ ఇవన్నీ వివిధ జంతువుల తోలుతో తయారవుతాయనే విషయం తెలిసిందే. అంతేకాదు వివిధ అవసరాలకు, పరిశ్రమల్లో ఉపయోగానికి కూడా యానిమల్ లెదర్‌‌‌‌తో తయారు చేసిన వస్తువులను వాడుతారు. అయితే వీటి తయారీ ప్రక్రియలో వెలువడే కాలుష్యం పర్యావరణానికి సైతం హాని కలిగిస్తుంది. కానీ అందుకు చక్కటి ప్రత్యామ్నాయం కనిపెట్టారు మెక్సికోకు చెందిన ఇద్దరు ఆవిష్కర్తలు. అదేమిటో చూద్దాం.

తోలుకు బదులు మొక్కలు

అడ్రియాన్ లోపెజ్ వెలార్డె (Adrian Lopez Velarde), మార్టె కాజారెజ్ (Marte Cazarez) ఇద్దరూ మంచి స్నేహితులు. వ్యాపార భాగస్వాములు కూడా. ‘అడ్రియానో డి మార్టి (Adriano Di Marti)’ అనే కంపెనీని 2019లో ప్రారంభించారు. అయితే తరచూ కాలుష్య నివారణ, పర్యావరణ హితం గురించి ఆలోచించే వీరు. లెదర్ తయారీ కోసం జంతువులను వధించకుండా, వాటి తోలును ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ ఫ్యాషన్‌ను ఎలా క్రియేట్ చేయాలో కూడా ఆలోచించారు. ఈ క్రమంలోనే వీరు ఎడారుల్లో పెరిగే నోపల్ కాక్టస్ అనే బ్రహ్మ జముడు జాతికి చెందిన ఒక చెట్టు నుంచి ఫ్యాషన్ పరిశ్రమను శాశ్వతంగా మార్చే అవకాశముందని గుర్తించారు.

ప్రత్యామ్నాయంగా డెస్సెర్టో

నోపల్ కాక్టస్ నుంచి ఆ ఇద్దరు ఆవిష్కర్తలు ‘డెస్సెర్టో’ అనే తోలు ప్రత్యామ్నాయాన్ని డెవలప్ చేశారు. ఈ కాక్టస్ తోలు సంప్రదాయ జంతు తోలుకు ప్రత్యామ్నాయమే కాకుండా, పర్యావరణ అనుకూలమైనదిగాను, మన్నికైన ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్నారు. ఫ్యాషన్ పరిశ్రమలో సుస్థిరతను పెంచడమే కాకుండా, జంతువులను వధించడం వంటి క్రూరత్వాన్ని తగ్గించడంలో, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంలో నోపల్ కాక్టస్ నుంచి తయారు చేసే లెదర్ వంటి డెస్సెర్టో కీ రోల్ పోషిస్తుంది. దీనిని ఫ్యాషన్, ఆటో మొబైల్, ఫర్నిచర్ పరిశ్రమల్లో ఉపయోగించేందుకు సైతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడైతే విస్తృత ఉపయోగానికి నోపల్ కాక్టస్ అంతగా అందుబాటులో లేదు. Link

Next Story