ఇన్‌స్టాలో ‘మ్యూజ్ ఇమేజ్ ఫీచర్’.. ప్రైవసీకి భంగమా?

by Javid Pasha |   (  Updated:2026-07-14 14:08:14  IST  )

మెటా మ్యూజ్ ఇమేజ్ ఏఐ అనేది సాధారణ భాషలో ప్రాంప్ట్స్ ఇచ్చినా కాంప్లెక్స్ ఇమేజ్‌లను హై క్వాలిటీతో జనరేట్ చేస్తుంది.

ఇన్‌స్టాలో ‘మ్యూజ్ ఇమేజ్ ఫీచర్’.. ప్రైవసీకి భంగమా?
X

దిశ, ఫీచర్స్ : ఇన్‌స్టా‌గ్రామ్ తన యూజర్లను సర్‌ప్రైజ్ చేస్తూ ‘మ్యూజ్ ఇమేజ్ AI’ అనే ఒక కొత్త ఫీచర్‌ను ఇటీవల (జులై 7, 2026) విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఇది మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ నుంచి వచ్చిన అద్భుతమైన ఇమేజ్ జనరేషనల్ మోడల్‌. అయితే ఈ @-మెన్షన్ ఫీచర్ వచ్చిన కొద్దిరోజుల్లోనే దీనిపై పలు విమర్శలు రావడంతో మెటా దీనిలోని ముఖ్యమైన భాగాన్ని వెనక్కు తీసుకుంది. అయినప్పటికీ మరో పద్ధతిలో దీనిని వినియోగించుకోవచ్చునని కూడా చెబుతుంది? ఇంతకీ ఏమిటా ఫీచర్, ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెటా మ్యూజ్ ఇమేజ్ ఏఐ అనేది నిజానికి అధునాతన ఏఐ మోడల్. సాధారణ భాషలో ప్రాంప్ట్స్ ఇచ్చినా కాంప్లెక్స్ ఇమేజ్‌లను హై క్వాలిటీతో జనరేట్ చేస్తుంది. యూజర్ ఫోటోలు లేదా మల్టిపుల్ ఇమేజ్‌లను బ్లెండ్ చేసి, ఎడిట్ చేసి, క్రియేటివ్ విజువల్స్ తయారు చేయవచ్చు. మెటా AI యాప్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్ ప్రారంభం నుంచే తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. అంతేకాకుండా తీవ్రమైన బ్యాక్‌లాష్ వల్ల ఇన్‌స్టా్గ్రామ్ ఇప్పుడు@-మెన్షన్ ఫీచర్ (అంటే.. ఇతరుల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ట్యాగ్ చేసి ఫోటోలు ఉపయోగించడం)ను తొలగించింది. అయితే ప్రస్తుతం సాధారణ మ్యూజ్ ఇమేజ్ మాత్రం మెటా AIలో ఇతర ఇమేజ్ జనరేషన్ కోసం అందుబాటులో ఉంది. కాకపోతే కేవలం వివాదాస్పద భాగం మాత్రం మెటా ద్వారా పాజ్ చేయబడింది.

ఎందుకు విమర్శలు?

మ్యూజ్ ఇమేజ్‌ జనరేటింగ్ ఫీచర్ ద్వారా యూజర్లు పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను ట్యాగ్ చేసి లేదా మెన్షన్ చేసి, ఇతరుల ఫోటోలు, మీడియాను తమ ఏఐ ఇమేజ్‌లలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు బర్త్‌డే కార్డులు, ఇతర క్రియేటివ్ కాన్సెప్టులు తయారు చేసేటప్పుడు ఇతరుల పబ్లిక్ ఫోటోలను ఆటోమేటిక్‌గా ఇమేజ్‌లో చేర్చవచ్చు. దీనివల్ల తమ వ్యక్తిగత భద్రతకు ముప్పువాటిల్లుతుందని పలువురు యూజర్లు, సాంకేతిక నిపుణులు విమర్శలు గుప్పించారు. హాలీవుడ్ టాలెంట్ యూనియన్ ‘SAG-AFTRA’ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇతరుల పర్మిషన్ లేకుండా వారి ఫోటోలను ఏఐ కంటెంట్‌లో ఉపయోగించడం ప్రమాదకరమని, ఇది సెక్సువల్ డీప్‌ఫేక్స్, హరాస్‌మెంట్, చైల్డ్ కంటెంట్ మిస్‌యూజ్‌కు దారితీస్తుందని హెచ్చరించింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ @-మెన్షన్ టూల్‌ను తాత్కాలికంగా తొలగించింది. అయినప్పటికీ మ్యూజ్ ఇమేజ్ ఇతర పద్ధతుల్లో మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. ఫుల్ ప్రైవసీ కోరుకునే యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్స్‌లో ‘Sharing and reuse’ సెక్షన్‌లోకి వెళ్లి ఏఐ (AI) క్రియేషన్స్ కోసం తమ కంటెంట్ ఉపయోగించడానికి పర్మిషన్ ఆఫ్ చేసుకోవచ్చు.

@-మెన్షన్ టూల్‌ వల్ల ఉపయోగాలు

*ఈవెంట్ ఇన్విటేషన్లు, క్రియేటివ్ కాన్సెప్టులు, పర్సనలైజ్డ్ గ్రాఫిక్స్ తయారు చేయడం.

*ఫోటోలను ఎడిట్ చేయడం, సరికొత్త ఇమేజ్‌లు క్రియేట్ చేయడం

*కంటెంట్ క్రియేటర్లు, బిజినెస్‌లు ఎంగేజ్‌మెంట్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

*సృజనాత్మకతను మరింత సులభతరం చేసి, డిజైన్ కోసం కేటాయించే సమయాన్ని తగ్గిస్తుంది.

మ్యూజ్ ఇమేజ్‌ జనరేటింగ్ ఫీచర్ నష్టాలు

*ప్రైవసీ ఉల్లంఘన జరగవచ్చు. సెట్టింగ్‌లలో మెన్షన్ టూల్‌ను ఆఫ్ చేసుకోకపోతే యూజర్ అనుమతి లేకుండానే ఇతరులు ఫోటోలు ఉపయోగించుకునే వీలుంటుంది.

*సెలబ్రిటీలు, మహిళలకు సంబంధించి డీప్‌ఫేక్స్, హరాస్‌మెంట్, మిస్‌యూజ్ అవకాశాలు పెరుగుతాయి.

*ఆటోమేటిక్ ఆప్ట్-ఇన్ వల్ల యూజర్లు తెలియకుండానే ఇన్‌క్లూడ్ అవుతారు.

*కాపీరైట్, లైక్‌నెస్ రైట్స్ సమస్యలు తలెత్తుతాయి.

Next Story