- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోస్ట్‌బాక్సు లేని ఊరు వేస్టురా కన్నా.!
పోస్టుబాక్సులు ఇక కనిపించవూ అంటున్నారు కదా.. దానితో ఉన్న జ్ఞాపకాలను నెమరేసుకుందాం.

దిశ, ఫీచర్స్: ఊళ్లో స్కూల్ ముందు ఎర్ర పోస్ట్ బాక్స్. అది కేవలం ఒక ఇనుప డబ్బా కాదు. గ్రామీణ జీవితానికి ఒక జీవనాడి. అప్పట్లో ఆ పోస్ట్ బాక్స్ అంటే ఒక ప్రపంచం. ఇప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లు వచ్చాయి. కానీ ఒకప్పుడు దూరంగా ఉన్నవాళ్ల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా.. ఉద్యోగ ఆఫర్ లెటర్ రావాలన్నా.. ప్రభుత్వ అధికారిక సమాచారం చేరాలన్నా ఆ ఎర్ర డబ్బాయే అందరి ఆశ. ఏమో అంటున్నారు కదా.. పోస్టుబాక్సులు ఇక కనిపించవూ అనీ.. దానితో ఉన్న జ్ఞాపకాలను నెమరేసుకుందాం.
ఒక్కరే ఉండేది
వేరే ఊర్లో లేదా సిటీలో ఉద్యోగం చేసేవాళ్లు ప్రతి నెలా ఊరికి ఉత్తరమేసేవాళ్లు. వాళ్ల ఉత్తరం కోసం ఇంట్లోవాళ్లంతా ఎదురుచూసేది. "సార్.. ఉత్తరం వచ్చిందా?" అని రోజూ పోస్ట్‌మాన్‌ను అడిగేది. ఆ పోస్ట్ బాక్స్‌లో ఉత్తరం వేస్తే, అది ఎప్పుడు చేరుతుంది? ప్రత్యుత్తరం ఎప్పుడు వస్తుంది? ఈ ఎదురుచూపులోనే ఒక ఉత్కంఠ ఉండేది. యోగక్షేమాలు, పండుగల శుభాకాంక్షలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ప్రభుత్వ సబ్సిడీల సమాచారం... ప్రతీదీ ఉత్తరాల ద్వారానే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ వ్యవస్థ అంత సులభం కాదు. రెండు-మూడు గ్రామాలకు ఒక్కరే పోస్ట్‌మాన్. అతనికి బస్సు లేదు, బైక్ లేదు... కేవలం సైకిల్ మీదే తిరగాలి. "ఒకసారి నా ఉద్యోగ ఆఫర్ లెటర్ మూడు నెలలు ఆలస్యమైంది. పోస్ట్‌మాన్ సైకిల్ పంక్చర్ అయిందని చెప్పాడు. కానీ తర్వాత తెలిసింది... కొన్ని ఉత్తరాలు అతని బ్యాగ్‌లోనే మరచిపోయాడట!" వంటివెన్నో వినేవాళ్లం. కొన్నిసార్లు పోస్ట్‌మాన్ కావాలనే ఉత్తరాలు పంచకుండా ఆర్నెళ్లకోసారి చెత్తకుప్పలో పారేసేవాడు.
ఉత్దరాలే ఆధారం
పోస్ట్ బాక్స్ మన జీవితంలో భాగమైపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చి, "పోస్ట్ బాక్స్‌లో లెటర్ వేశామా?" అని అడిగేవారు. పండుగల సమయంలో, శుభాకాంక్షల కార్డులు వేసేవాళ్లం. గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు... అన్నీ ఉత్తరాలపైనే ఆధారపడేవి. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్‌ను స్పీడ్ పోస్ట్‌తో విలీనం చేస్తున్నారట. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ బాక్స్‌లు ఇప్పటికీ కీలకం. డిజిటల్ యుగంలో కూడా ఇంటర్నెట్ లేని గ్రామాల్లో ఉత్తరాలే ఆధారం. అప్పట్లో పట్నంలో ఉండే పిల్లలు తల్లిదండ్రులకు ఉత్తరమేసేవాళ్లు. ఏదైనా సంతోషకర వార్తను మోసుకొస్తే పోస్ట్‌మాన్‌కు స్వీట్ ఇచ్చేవాళ్లు. ఎంతో కొంత డబ్బు కూడా ఇచ్చేవాళ్లు. ఇలాంటి అనుబంధాలు ఎన్నో ఉన్నాయి పోస్టుబాక్స్‌తో.
రహస్య స్నేహితుడిలా..
యువతకు పోస్ట్ బాక్స్ ఒక రహస్య స్నేహితుడు. ప్రేమికులు రహస్యంగా ఉత్తరాలు రాసుకునేవాళ్లు. పోస్ట్ బాక్స్ కేవలం ఉత్తరాల కోసం మాత్రమే కాదు, అది గ్రామంలో ఒక సామాజిక కేంద్రంగా కూడా ఉండేది. సాయంత్రం సమయంలో గ్రామస్తులు పోస్ట్‌మాన్ రాక కోసం ఎదురుచూసేవారు. ఆ సమయంలో గ్రామంలోని విశేషాలు, పంటల సమాచారం, పొరుగు ఊళ్ల వార్తలు... అన్నీ చర్చించేవారు. పిల్లలు ఆ పోస్ట్ బాక్స్ చుట్టూ ఆడుకునేవారు. వృద్ధులు తమ జ్ఞాపకాలను పంచుకునేవారు. ఆ ఎర్ర డబ్బా ఒక విధంగా గ్రామంలోని హృదయ స్పందనలా ఉండేది. పోస్ట్ బాక్స్ గ్రామీణ జీవితంలో ఒక భావోద్వేగంగా మారింది. ప్రేమ కథలు, గ్రామస్తుల సామాజిక సమావేశాలు, ఆశలు, ఆకాంక్షలు ఇవన్నీ ఆ పోస్టుబాక్సులో దాగి ఉన్నాయి. డిజిటల్ యుగంలో కూడా ఈ జ్ఞాపకాలను కాపాడుకోవాలి. ఆ పోస్ట్ బాక్స్‌ను మరింత ఆధునికం చేసి గ్రామీణ జీవితంలో దాని స్థానాన్ని నిలబెట్టాలి.






