గురువును దిద్దిన సితార.. అర్ధాంగికి అద్వితీయ సన్మానం

by Daayi Srishailam |

ఏమిచ్చి రుణం తీర్చుకోను .?

గురువును దిద్దిన సితార.. అర్ధాంగికి అద్వితీయ సన్మానం
X

నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో తను నా జీవితంలోకి ప్రవేశించింది. చదువుకు మెరుగులు దిద్దే సమయంలో తను నా జీవితాన్ని సరిదిద్దిడం ప్రారంభించింది. నెలకు రెండు వందల రూపాయల జీతంతో ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ, మరొక వైపు డిగ్రీ చదువుతూ పడరాని పాట్లు పడుతున్నా.. తన సాన్నిహిత్యం ముందు అవి చిన్నవిగానే అగుపించాయి.


ఏమిచ్చి రుణం తీర్చుకోను ?

తన స్నేహలాలిన్యతలో ఎంతటి కఠిన సమస్యలైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నాను. అనుక్షణం నా వెన్నంటి నిలుస్తూ.. కొండంత ఆత్మస్థైర్యాన్ని నింపి.. నన్ను ప్రోత్సహిస్తున్న ఆమె నాకు ఒక మార్గదర్శి. కాలగమనంలో ఎన్నో అవమానాలు, బంధువుల ఈసడింపులు,పెడసరి మాటలు అన్నీ భరించాను. అన్నింటిలోనూ ఆమే నా ధైర్యం. కష్టాలను, కన్నీళ్లను దాచుకుని నా లక్ష్యమైన ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినపుడు తన కండ్లలో మెరిసిన కోటి కాంతులు నేనెప్పటికీ మరువలేను. వృత్తి ధర్మాన్ని పాటించే నాకు విధి నిర్వహణలో ఏ ఒక్కరోజు లోటు రాకుండా సహకరించిన తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోను ?

అగ్రతాంబూలం తనదే..

ఇంటర్ లోనే చదువుకు స్వస్తి చెబుతానేమోనననే పరిస్థితుల నుంచి చదువు చెప్పే ఉపాధ్యాయుడిగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతున్నానంటే ఈ విజయంలో అగ్రతాంబూలం తనదే ! నా ప్రతి విజయం ఆమెదే ! ఇల్లాలంటే వంటింటి కుందేలు కాదని, అత్త మామలకు సపర్యలు చేస్తూ, పిల్లల ఆలనా పాలనాతో నిరంతరం భర్తకు సహకరించే జీతం తీసుకోలేని ఉద్యోగి నా అర్ధాంగి. మూడు ముళ్ల బంధంతో నాతో ఏడడుగులు నడిచిన ఆమె.. ఎన్ని జన్మలవరకైనా మరవని ప్రాణ స్నేహితురాలు ఆమె.

ఆమె పాత్ర అనిర్వచనీయం

ఉపాధ్యాయ దినోత్సవం రోజున అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ నేను ఉపాధ్యాయుడిగా నిలబడేందుకు సహకరించిన నా సితార.. మా ఇంటి తార అందుకు అర్హురాలిగా గుర్తించాను. ఉపాధ్యాయునిగా పనిచేయడంలో, కథా రచయితగా రాణించడంలో, వందలాది బాలలను కథకులుగా తీర్చి దిద్దడంలోనూ, ఈ సమాజంలో నేను పొందే ప్రతి గౌరవంలోనూ ఆమె పాత్ర అనిర్వచనీయమైనది. ఆమె ప్రోత్సాహం అద్వితీయమైనది. రెండు పుష్కరాల ఉపాధ్యాయ జీవనంలో అనుక్షణం తగిన సహకారం అందిస్తున్న నా జీవిత భాగస్వామి తారని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గౌరవించడం సముచితమని భావించాను. అందుకే ఉపాధ్యాయు దినోత్సవం రోజునే ఇంట్లో ఇలా సన్మానించాను. మా తారకు .. మనసారా దక్కిన గౌరవం ఇది.

- దుర్గమ్ భైతి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

9959007914

Next Story