బ్లాక్ అండ్ వైట్ టీవీలో దూరదర్శన్ చూసిన ఆనందాలు

by Sujitha Rachapalli |

మాది పెద్ద కుటుంబం. పరీక్షలైపోయి సెలవులు వచ్చాయంటే ఇక ఇల్లంతా సందడే. సెలవులున్నన్ని రోజులూ మేమంతా గూటి పక్షుల్లా ఇంట్లోనే ఉండేవాళ్లం.

బ్లాక్ అండ్ వైట్ టీవీలో దూరదర్శన్ చూసిన ఆనందాలు
X

దిశ, ఫీచర్స్ : మాది పెద్ద కుటుంబం. పరీక్షలైపోయి సెలవులు వచ్చాయంటే ఇక ఇల్లంతా సందడే. సెలవులున్నన్ని రోజులూ మేమంతా గూటి పక్షుల్లా ఇంట్లోనే ఉండేవాళ్లం. గిల్లుకుని, తిట్టుకుని గడిపేవాళ్లం. నాకైతే మా చెల్లితో గొడవ రోజూ జరిగేది. మా ఇంట్లో టీవీ లేదు. కాబట్టి సాయంత్రం ఎప్పుడైతదా అని ఎదురుచూసేవాళ్లం. ఎందుకంటే పక్కింట్లో టీవీకి పోవడానికి. పక్కింట్లోనే కాదు ఎంత దూరమైనా టీవీ కోసం పరుగులు పెట్టేవాళ్లం.

పక్కింటికి పరుగులు..

టీవీ చూడాలంటే సాయంత్రం నాలుగు గంటల నుంచే మా ప్లానింగ్ మొదలయ్యేది. ఏ ఇంట్లో ఏ సీరియల్ వస్తుంది? ఏ సమయానికి చిత్రలహరి వస్తుంది అని ఫిక్స్ చేసుకుని ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి పరుగెత్తేవాళ్లం. కానీ ఆ కాలంలో కరెంట్ తరచూ పోయేది. కరెంట్ పోతే మా ముఖాలు వెలవెలపోయేవి. కరెంట్ వస్తుందన్న ఆశతో గంటల తరబడి కాచుకుని కూర్చోవడం.. కరెంట్ వచ్చిన వెంటనే టీవీ ముందు కూర్చోవడం.. ఆహా ఆ ఉత్కంఠ ఇప్పటికీ గుర్తుంటుంది. కొన్నిసార్లు టీవీలో ఏదైనా ఆసక్తికరమైన సన్నివేశం వస్తున్నప్పుడు కరెంట్ పోతే మా ముఖాలు వాడిపోయేవి.

నాన్న తెచ్చిన టీవీ..

నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న టీవీ తెచ్చాడు. ఆ రోజు మా ఇంటికి నిజమైన పండుగ. టీవీని టేబుల్ మీద పెట్టి దాని ముందు కూర్చొని చూసిన ఆ సంతోషం ఎప్పటికీ మరచిపోలేము. దూరదర్శన్ తప్ప మరే ఇతర చానెల్ లేదు అప్పట్లో. కానీ చిత్రలహరి, సీరియల్స్, వార్తలు చూడడానికి అందరం ఆత్రుతగా చూసేవాళ్లం. టీవీ ముందు కూర్చోవడానికి మేము వంతులు వేసుకునేవాళ్లం. ఎవరికి ముందు చాన్స్ వస్తుందని చిన్న చిన్న గొడవలు, ఏడుపులు జరిగేవి. కన్నుల పండుగ అంటే ఆ చిన్న బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మాత్రమే. టీవీ వచ్చాక ఇంట్లో గొడవలు కూడా కొంచెం తగ్గాయి. అందరం టీవీ చుట్టూ చేరి కూర్చోవడం మా కుటుంబానికి కొత్త అలవాటు అయింది.

అదొక స్వర్ణయుగం..

ఇప్పుడు ఎన్ని స్మార్ట్ టీవీలు, ఎన్ని యూట్యూబ్ చానెళ్లు ఉన్నా, ఆ దూరదర్శన్ యుగంలోని చిన్న స్క్రీన్ ముందు గడిచిన రోజుల సంతోషం వేరు. కరెంట్ పోయినప్పటి ఆందోళన.. పక్కింటి ఇంట్లో టీవీ చూసిన ఉత్కంఠ.. టీవీ వచ్చినప్పటి ఆనందం.. ఇవన్నీ మా బాల్యపు అమూల్యమైన జ్ఞాపకాలు. పెద్ద కుటుంబంలో టీవీ ఒక కొత్త సభ్యుడిలా వచ్చి మా జీవితాన్ని మార్చేసింది. ఆ చిన్ని టీవీ స్క్రీన్ చుట్టూ అల్లుకున్న నవ్వులు, గొడవలు, సంతోషాలు ఎప్పటికీ గుండెలో మెరుస్తూనే ఉంటాయి. ఆ చిన్ని స్క్రీన్ ముందు గడిచిన బాల్యం నిజంగా స్వర్ణయుగం అనిపిస్తోంది నాకైతే.

- బి. గోపాల క్రిష్ణ

Next Story