- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పటి నేస్తం.. అచ్చు కాగితం!
అచ్చు కాగితం.. కార్బన్ పేపర్.. ఇప్పటికీ నా మనసులో మాయా మంత్రమే.. దాన్ని యూజ్ చేస్తే వచ్చే గర్వం.. ఒకింత ఆశ్చర్యం.. చెప్పలేనంత సంతోషం..

దిశ, ఫీచర్స్ : అచ్చు కాగితం గుర్తుందా? ఇప్పుడు షాపులలో బిల్ బుక్స్‌లో పెడుతుంటారు కదా? అవే ఒకప్పుడు మన పుస్తకాల బ్యాగుల్లో పెట్టుకునేవాళ్లం. అచ్చు కాగితం ఉంటే అదొక గొప్ప విషయం అన్నమాట. అలాంటి అచ్చు కాగితం గురించి ఒకసారి నెమరేసుకుందాం.
వాడకమూ ఓ కళే..
కార్బన్ పేపర్ అంటే మా చిన్న ప్రపంచంలో ఒక చిన్న మ్యాజిక్‌లా ఉండేది. ఒకేసారి రెండు కాపీలు రాయాల్సి వస్తే నోట్‌బుక్ మధ్యలో ఆ నీలం రంగు కార్బన్ పేపర్‌ను జాగ్రత్తగా పెట్టి పైన గట్టిగా అక్షరాలు రాస్తూ ఉండేవాళ్లం. కింద పేజీలో కూడా అచ్చం అదే అక్షరాలు కనిపిస్తే మేమే ఏదో గొప్ప పని చేసినట్టుగా అనిపించేది. కార్బన్ పేపర్ పెట్టడం కూడా ఓ కళే. కొంచెం తేడా వచ్చినా అక్షరాలు సరిగ్గా పడవు. అందుకే పేజీలు సరిగ్గా సెట్ చేసి అది కదలకుండా జాగ్రత్తగా పట్టుకుని రాయాల్సి వచ్చేది. కానీ చాలా మటుకు వాడేసిన అచ్చు పేపర్లే తెచ్చుకునేవాళ్లం.
డ్రెస్సుకు అంటిన మరకలు..
కొన్నిసార్లు త్వరగా రాయాలని తొందరపడి కార్బన్ స్లిప్ అయిపోయేది. అప్పుడు మళ్లీ మొదటి నుంచి సెట్ చేసి రాయడం ఆ చిన్న చిన్న ఇబ్బందుల్లో కూడా ఒక రకమైన సరదా ఉండేది. రాస్తూ ఉంటే వేలికి, చేతికి నీలం రంగు పూసుకుపోవడం తప్పనిసరి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ కార్బన్ మచ్చలు తప్పించుకోలేము. ఆ మచ్చలతోనే ఇంటికి వెళ్లితే ‘మళ్లీ కార్బన్ పేపర్ పూసుకున్నావా?’ అని అడిగే వాళ్లు. అవేమో తెల్లటి స్కూల్ యూనిఫాంకు అంటుకునేవి. ఎంత కడిగినా పూర్తిగా పోకపోయేది. ఇంట్లో వాళ్లకు అవి పెద్ద తలకాయనొప్పి కానీ మాకు అవి గర్వంగా అనిపించేవి.
ఎప్పటికీ మాయమవ్వదు..
ఆ రోజుల్లో కార్బన్ పేపర్ అంటే కేవలం ఒక వస్తువు కాదు. మా చదువుల్లో భాగం. రోజువారీ అలవాట్లలో భాగం. ఇప్పుడు ఒక్క బటన్ నొక్కితే ప్రింటర్లు కాపీలు ఇస్తున్నా ఆ కాలంలో ఒకే అక్షరం రెండు చోట్ల కనిపించడం ఎంత ఆశ్చర్యంగా అనిపించేదో ఇప్పుడు చెప్పడం కష్టం. అప్పటి ఆ చిన్న సంతోషాలు, ఆ ఆశ్చర్యం, అసలైన ఆనందం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ నీలం రంగు మచ్చలతో నిండిన వేళ్లు.. జాగ్రత్తగా రాసిన పేజీలు కేవలం జ్ఞాపకాలుగా కాదు ఒక ఆస్తిగా అనిపిస్తాయి. టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా కార్బన్ పేపర్ ఇచ్చిన ఆ చిన్న మాయ మాత్రం మనసులో ఎప్పటికీ మాయమవ్వదు.
- సుబ్బూరు సురేష్






