- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింత చిగురు... ప్రేమల ఇగురు!
చింత చిగురు కోసేందుకు ఆరాటం.. ఎండా కాలంలో పిల్లల సాహసాలకు గుర్తు.. దానితో అమ్మ చేసే కమ్మటి కూరలు గుర్తొసుంటే.. నోట్లో ఊరిళ్లు వచ్చేస్తున్నాయ్..

దిశ, ఫీచర్స్ : ఎండాకాలంలో బాల్యం చెట్లెక్కిన సాహసాలు.. ఆకులు తెంపిన అనుభవాలు.. అమ్మ చేతి వంటల రుచి.. కలిసి కూర్చొని తినే ఆనందాన్ని గుర్తు చేస్తోంది. అలాంటి వాటిలో చింత చిగురు ఒకటి. ఇది కేవలం ఒక ఆకు మాత్రమే కాదు. ఒక తరం జ్ఞాపకం. ప్రేమ.. బంధాలు.. సాహసానికి నిదర్శనం.
సెలవుల్లో..
సరిగ్గా స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ప్రకటించే సమయానికి చింత చెట్లకు చిగురు కాస్తుండేది. ఆ చిగురు వాసనే ఒక రకమైన ఆనందాన్ని కలిగించేది. ఆ రోజుల్లో మేము సంచులు.. చిన్న బుట్టలు పట్టుకొని చింత చెట్ల వెంట పరుగెత్తేవాళ్లం. ఎంత ఎత్తయిన చిటారు కొమ్మలైనా ఎక్కి తాజా చింత చిగురు తెంపేవాళ్లం. పోటీలుపడి మరీ చింత చిగురు తెంపుకొని సంచుల్లో నింపుకునేవాళ్లం. ఆ రోజుల్లో ఎవరి చెట్లకైనా చింత చిగురు తెంపుకునే స్వేచ్ఛ ఉండేది. ఒకరి దగ్గర ఉంటే ఇంకొకరికి పంపించేవాళ్లు. ఇప్పుడదే చింత చిగుర ఒక్క కిలోకి రూ.400-500 ఉంటుంది మార్కెట్లో.
చేతి ఖర్చులకు..
ఇంటి అవసరాలకు సరిపడా చింత చిగురు తీసుకొచ్చాక మిగిలినవి మార్కెట్‌లో అమ్మేవాళ్లం. ఆ డబ్బు మా చేతి ఖర్చులకు.. చిన్న చిన్న కోరికలకు ఉపయోగపడేది. ఆ సంపాదనలో ఉన్న ఆనందం.. స్వాతంత్ర్యం ఇప్పటి పిల్లలు ఊహించలేరు. చెట్ల ఎక్కడం.. గాయపడటం.. నవ్వుకోవడం.. ఒకరితో ఒకరు పోటీ పడటం... ఆ రోజుల అనుభవాలు ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తాయి. ఆ చింత చిగురు వేట నిజంగా ఒక సరదా మాత్రమే కాదు. స్నేహానికి.. చైతన్యానికి కారణం కూడా. నిజంగా అప్పటి బాల్య సాహసాలు.. స్నేహాలు.. సంతోషాలు ఎలా ఉండేవో కదా.?
అమ్మ చేతి అద్భుతం..
మా అమ్మకు చింత చిగురు అంటే ఎంతో ఇష్టం. మేం తెచ్చిన తాజా చిగురుతో ఆమె అద్భుత వంటలు చేసేది. చింత చిగురు చికెన్.. చింత చిగురు మటన్.. చింత చిగురు పప్పు.. చింత చిగురు తొక్కు అబ్బా ఇలా ప్రతి వంటకం ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ సీజన్లో చింత చిగురు తెచ్చినప్పుడల్లా ఇలా ఒకట్రెండు వెరైటీలు చేసి పెట్టేది. ఆ వాసన ఇంటి నిండా వ్యాపించేది. అమ్మ కొసిరి కొసిరి వడ్డించేది. ఇంకా తిను రా.. ఆరోగ్యానికి మంచిది అని ప్రేమగా వడ్డించేది. ఇప్పుడు అమ్మలేదు. ఆ కొసిరి వడ్డించే వాళ్లు లేరు. అసలు చింత చిగురే దొరకడం లేదు బయట.
కలిసి భోజనం..
అందరం ఒకేసారి కూర్చొని సహపంక్తి భోజనం చేసేవాళ్లం. కడుపు నిండా తినేవాళ్లం. నవ్వులు.. కథలు.. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం ఆ క్షణాలు నిజమైన కుటుంబం ఎలా ఉండాలో చూపించేవి. ఇప్పటివాళ్లకు ఇది ఎక్కువ చెప్తున్నట్లు అనిపించినా.. అది అనుభవించిన మాకు తెలుసు దాని అద్భుతమేంటో. చింత చిగురు ఆరోగ్యానికి మంచిదని ఎవరూ చెప్పకపోయినా అప్పుడు మేం కోరికోరి తినేవాళ్లం. ఇప్పుడు మంచిదని చెప్తున్నా పిల్లలు తినడం లేదు. పిల్లలంతా జంక్ ఫుడ్.. రెడీమేడ్ ప్యాకెట్లకు అలవాటైపోయారు. ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు.
- సింగారం రాజ్ కుమార్






