- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేసవి సెలవుల్లో తాటి ముంజల మజా
తాటి ముంజల తండ్లాట.. ఎండలో ఆడాక ముంజలు తింటే వచ్చే మజా.. ఆహా.. మొదటి ముంజలు ఎల్లమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి.. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో ఆస్వాదించేది..

దిశ, ఫీచర్స్ : అబ్బా.. ముంజలు వచ్చేశాయి. వాటిని చూస్తే నోరూరుతోంది. తాటి ముంజల చాటున ఎన్నో మెమొరీస్ దాగివున్నాయి. సీజన్ రాగానే అవన్నీ ఇప్పుడు యాదికొస్తున్నాయి. మళ్లీ ముంజల మధురానుభూతుల్లోకి తొంగి చూడాలనిపిస్తోంది.
తాటి చెట్ల మధ్యే..
ఎండాకాలం వచ్చిందంటే తాటి ముంజల సీజన్ మొదలైనట్టే. గీత కార్మిక కుటుంబాల్లో జన్మించిన మాకు తాటి చెట్లతో అనుబంధం కేవలం వృత్తిపరమైనది మాత్రమే కాదు అది జీవనశైలిలో భాగం. ఎల్లమ్మ తల్లికి నైవేద్యంగా ముందుగా తాటి ముంజలు సమర్పించడం ఒక సంప్రదాయం. ఆ తర్వాతే వాటిని కుటుంబ సభ్యులు తినడం ఆనవాయితీ. పండుగ సందర్భంలో పొలం వద్దకు వెళ్లి తాటి చెట్ల మధ్య గడపడం.. అక్కడే లేత ముంజలను రుచి చూడడం గ్రామీణ జీవితంలోని అమూల్యమైన అనుభవం.
మధుర జ్ఞాపకాలు..
తాటి ముంజలు బాల్యాన్ని గుర్తు చేసే ఓ మధుర అనుభూతి. చిన్నప్పుడు వేసవి సెలవులు వచ్చాయంటే మిత్రులతో కలిసి మధ్యాహ్నపు ఎండల్లో కూడా ఆటలతో కాలక్షేపం చేయడం సాధారణం. క్రికెట్ ఆడుతూ అలసిపోయాక పొలాలవైపు వెళ్లి తాటి ముంజలు తినడం, బావుల్లో ఈత కొట్టడం వంటి అనుభవాలు అప్పటి పిల్లల రోజువారీ జీవితం. ముంజల్లోని చల్లని నీళ్లు తాగడంలో కూడా పిల్లల్లో పోటీ ఉండేది. ఒకరి కంటే మరొకరికి ఎక్కువ దొరికితే చిన్నపాటి గొడవలు కూడా జరిగేవి. ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వులు తెప్పించే మధుర జ్ఞాపకాలు.
రుచి మారలేదు..
కాలంతో పాటు మనుషుల జీవనశైలి మారిపోయింది. మట్టి పరిమళం, స్వచ్ఛమైన గాలి, సహజమైన నీరు ఇవన్నీ ఇప్పుడు అరుదైనవిగా మారాయి. అయితే ఈ మార్పుల మధ్య కూడా తాటి ముంజల రుచి మాత్రం ఎప్పటికీ మారలేదు. తాటి ముంజలు వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే సహజ వరంగా చెప్పవచ్చు. మలమల మాడే ఎండల్లో ముంజల్లోని తీయని నీళ్లు తాగితే దప్పిక వెంటనే తీరిపోతుంది. ఇవి శరీరానికి తేమను అందించడమే కాకుండా సహజ శక్తిని కూడా ఇస్తాయి. కల్లు, ముంజలు రెండూ తాటి చెట్టుకు సంబంధించినవే అయినా వాటి స్వభావం పూర్తిగా వేరు.
ఇప్పుడు పిల్లలతో..
ముంజలు ఆరోగ్యకరమైన, సహజమైన ఆహారంగా గ్రామీణ ప్రజల జీవనంలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తాటి ముంజలపై ఉన్న ప్రేమ మాత్రం మారలేదు. ఒకప్పుడు మేం ఇంట్లో పోటీగా తిన్న ముంజలు, ఇప్పుడు పిల్లలతో పంచుకునే అనుభవంగా మారాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ప్రేమతో పంపించే ఈ ముంజలు అనుబంధాల ప్రతీక. సిటీ జీవనంలో పెరుగుతున్న పిల్లలకు తాటి ముంజల గురించి తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి వాటి తీపి, వాటి వెనుక ఉన్న అనుభూతి ప్రత్యేకం. ఎండాకాలంలో ముంజలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
- కేశగౌని వీరస్వామి గౌడ్






