కిష్టయ్యంకుల్.. కిరాయి సైకిల్!

by Sujitha Rachapalli |

ఎందుకో కానీ నేనెప్పుడు బయట అడుగు పెడదామన్నా నేను కూడా రెడీ అన్నట్లు తనెప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తనంటే నాకు ఇష్టమే అయినా.. కొన్నిసార్లు తన కంట పడకూడదని, తన స్పర్శ తగలకూడదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాను.

కిష్టయ్యంకుల్.. కిరాయి సైకిల్!
X

దిశ, ఫీచర్స్ : ఇప్పుడు మూడో తరగతి పిల్లోడు కూడా ముచ్చటగా బైక్ మీద రయ్య్‌మని పోతుండు. కానీ మా బాల్యంలో తొక్కుదామంటే కనీసం సైకిల్ కూడా ఉండకపోయేది. పక్కింటోళ్లకో, ఎదురింటోళ్లకో ఉండేది కానీ అడగకబుద్ధి కాకపోయేది. ఒకవేళ అడిగినా ఇచ్చేవాళ్లు కాదు. కానీ మనసంతా సైకిల్ మీదనే ఉండేది. ఇక ఎండా కాలం సెలవులొస్తే పానమంతా ఆగమాగం అయ్యేది. అలాంటి సమయంలోనే మాకు వరంలా కనిపించేది కిష్టయ్య కిరాయి సైకిల్.

గల్లగురిగిలో వేసి..

కిష్టయ్యంకుల్ అర్ధ రూపాయికి ఒక గంట సైకిల్ కిరాయికి ఇచ్చేవాడు. కానీ మన దగ్గర అర్ధ రూపాయికి దిక్కెక్కడిది? ఇంట్లో అడిగితే కిందా మీదా పడి ఐదు పైసలు ఇచ్చేవాళ్లు. దాన్ని అమాంతం శంకరయ్య సేటు దుకాణంలో గోలీలకు ఖర్చే చేసేది. ఇక అద్ద రూపాయికి అవకాశమెక్కడిది? అందుకే ఇంటికెవరైనా చుట్టాలొస్తే చెయ్యి చాచేవాళ్లం. దూరం చుట్టాల దగ్గర కాదుగానీ అమ్మమ్మ, మేనమామ దగ్గర అడిగేవాళ్లం. అడగకున్నా వాళ్లు ఇచ్చేవాళ్లు. పావలా సంపాదించడానికే ఎన్నో వేషాలు వేయాల్సి వచ్చేది. అమ్మ చెక్కరి, చాయిపత్తా తీసుకురమ్మంటే అందులో ఓ ఐదు పైసలు, నాన్న మంజన్ పొడి తీసుకురమ్మంటే అందులో ఐదు పైసలు మిగిలిచ్చుకొని అలా ఒకొక్క పైసా గల్లగురిగిలో వేసి రెండు రూపాయలు జమ చేసుకునే వాళ్లం. ఎలాగోలా కిరాయి సైకిల్ తీసుకునేవాళ్లం.

గంటకు రూపాయి..

పెద్ద సైకిల్స్ అయితే పది పదిహేను ఉండేవి. అందులో ఏడెనిమిది పనుల మీద వెళ్లే వాళ్లు తీసుకపోయేది. ఇక మిగిలిన మూడు నాలుగు సైకిళ్లు మాలాంటి పిల్లలకు తక్కువ కిరాయికి ఇచ్చేవాళ్లు. ఇవి కాకుండా రెండు చిన్న సైకిల్స్ ఉండేవి. వాటికైతే గంటకు రూపాయి ఉండేది. పిల్లలంతా వాటి కోసమే పోటీ పడేవాళ్లు. సైకిల్ ఎప్పుడొస్తదా అని గంటల తరబడి ఎదురుచూస్తూ అక్కడే కూర్చునేవాళ్లం. గంటసేపు కిరాయికి తీసుకొని నేను అద్దగంట.. మా తమ్ముడు అద్దగంట తొక్కేవాళ్లం. కొన్నిసార్లు దోస్తులం ఒకరికొకరం బదులు ఇచ్చిపుచ్చుకుంటుండేవాళ్లం. చిన్న సైకిలైతే ఈజీగానే తొక్కేవాళ్లంగానీ.. పెద్ద సైకిలైతే భయం భయంగా తొక్కేవాళ్లం. అలా భయపడుతూ ఎన్నిసార్లు కింద పడ్డానో. మోకాళ్లు చెక్కలయ్యేవి కూడా. కానీ ఆ కష్టాలన్నీ సైకిల్ మీద కూర్చున్నప్పుడు మరచిపోయేవాళ్లం. సైకిల్ తొక్కుతున్నామన్న గర్వం ఎంతో గొప్పగా ఉండేది.

ఖజానా ఖాళీ అయ్యేది..

సైకిల్ తొక్కే క్రమంలో గంట సమయం తరచూ దాటిపోయేది. గంట దాటి రెండు మూడు నిమిషాలే అయినా కిష్టయ్యంకుల్ ఇంకో గంటకు లెక్క కట్టేవాడు. మళ్లీ ఇంకో రూపాయి పెట్టి తొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు సైకిల్ కిందపడ్డా.. పంచర్ అయినా అదనంగా సమర్పించుకోవాల్సి వచ్చేది. అప్పటికే మన దగ్గర ఖజానా ఖాళీ అయ్యేది కాబట్టీ అంకుల్‌కి ఏం చెప్పాలో, ఏమియ్యాలో అర్థం కాకపోయేది. తలకాయ కిందికేసి చాలాసేపు అలానే నిలబడేది. చూసీ చూసీ అంకుల్ గులుగుతూ కోపంగా పొమ్మని చెప్పేవాడు. మల్లా ఇట్ల చేస్తే మీ నాయినకు చెప్తా.. సైకిలియ్యనూ అని చెప్పేవాడు. నాకే సక్కగరాదు అంటే దోస్తుగాళ్లు సైకిల్ నేర్పించమని అడిగేవాళ్లు. అలా ఎంతోమందికి నేర్పించిన.

- వై. నిరంజన్

Next Story