- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుప్రీంకోర్ట్ to ఫుడ్ కోర్ట్ .!
లాయరే అయినా.. తన అభిరుచి కోసం చెఫ్ కొనసాగుతోంది

దిశ, ఫీచర్స్: మనమేదో వృత్తిలో స్థిరపడతాం. కానీ మనసు ఇంకో అభిరుచిని ప్రేరేపిస్తుంటుంది. అందుకే వృత్తి ఏదైనా సరే.. అభిరుచికి కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడే మనసుకు నిమ్మళముంటుంది. సుప్రీంకోర్ట్‌లో పనిచేసిన మీనాక్షి కుమార్ వృత్తిపరంగా లాయరే అయినా.. తన అభిరుచి కోసం చెఫ్ కొనసాగుతోంది.
కోర్టు నుంచి మొదలై..
మీనాక్షి వాళ్ల నాన్న లాయర్. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేవాడు. అలా చిన్నప్పటి నుంచి వాదనలు, వాయిదాలు, తీర్పులు, తీర్మాణాలు చూస్తూ పెరిగింది మీనాక్షి. ఆ ప్రభావంతోనే తాను కూడా లాయర్ కావాలనుకొని యునైటెడ్ కింగ్‌డమ్‌లోని న్యూకాసిల్ యూనివర్శిటీలో లా మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత నాన్నతో కలిసి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేసింది. ఇద్దరూ ఎన్నో కీలక కేసులను వాదించారు. క్రిమినల్ లాయర్‌గా ఆమెకు మంచి పేరుంది. కానీ కేసు వాదనలు, వాయిదా తీర్పుల మధ్య తనకొక నిశ్శబ్ద కోరిక కలిగింది. అయితే ఆ కోరిక రొటీన్ తీర్పులు.. వాదనలతో సంబంధం లేనిది. అదే షెఫ్.
ఆర్గానిక్ ఫార్మింగ్..
లా చదివేటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వంట సొంతంగానే ప్రిపేర్ చేసేది. అంతేకాదు స్నేహితులకు వండిపెట్టేది. చదువు కోసమే కాదు.. సంతోషం కోసం కూడా నైపుణ్యం నేర్చుకోవచ్చని అక్కడే తెలుసుకుంది. అప్పుడొచ్చిన ఆలోచనే తర్వాత తనను బ్యాంకాక్‌కు తీసుకెళ్లింది. అక్కడ లే కార్డన్ బ్లూ కోర్సులో చేసింది మీనాక్షి. ఆసియాలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ మిచెలిన్-స్టార్డ్ షెఫ్ గగన్ ఆనంద్ దగ్గర అప్రెంటిస్‌షిప్ కూడా చేసింది. కోవిడ్ టైంలో ఇండియాకు వచ్చింది. ఇంటికే పరిమితమైన ఆమె టెర్రస్‌పై బ్రాకోలీ, బాసిల్, లెటుస్ వంటి కూరగాయలు పండించేది. అది క్రమంగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు తీసుకెళ్లింది.
ఆర్థిక స్వాతంత్ర్యం..
ఒకవైపు కోర్టు, ఇంకోవైపు ఫార్మింగ్ గురించి ఆలోచిస్తున్న తరుణంలో మీనాక్షికి ఫుడ్ కోర్ట్ మీద ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తితోనే "రూట్స్ కేఫ్"ను స్టార్ట్ చేసింది. ఇదొక "ఫామ్ టు టేబుల్" కాన్సెప్టెడ్ స్టార్టప్. పొలంలో పండించిన తాజా కూరగాయలను అప్పటికప్పుడు తీసుకొచ్చి ప్రిపేర్ చేస్తారు. దీనికోసం ముందస్తు ప్లానింగ్ ఏమీ ఉండదు. కస్టమర్ ఇచ్చిన ఆర్డర్‌ను బట్టి అప్పటికప్పుడు చేసిపెట్టే గ్లోబల్ మెనూ ఉంటుంది. స్క్రాచ్ నుంచి తయారైన థాయ్ కర్రీలు, వియత్నామీస్ రోల్స్ రసం, చిల్లీ ఆయిల్ మష్రూమ్ రిసోట్టో, మిల్లెట్-బేస్డ్ డిషెస్ ఉంటాయిక్కడ.
షెఫ్ పాత్రలో..
రూట్స్ కేఫ్‌ను టేస్ట్‌కే కాదు.. టీమ్ పరంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంది. దీంట్లో పనిచేసే స్టాఫంతా మహిళలే. ఇప్పుడు మీనాక్షి ఢిల్లీలో మూడు ఫుడ్‌కోర్ట్‌లు నడుపుతోంది. డిసెంబర్ లోగా మరో రెండు తెరవనున్నారు. మీనాక్షి స్థాపించిన ఈ ఫుడ్ స్పేస్‌లన్నీ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, సమాజంలో వారికి గుర్తింపు, గౌరవం, ఆత్మాభిమానం అనే కాన్సెప్ట్‌తో నడుస్తున్నాయి. స్టార్ట్ చేసినప్పుడు తనకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. తన పేరెంట్స్ కలగన్నది ఇది కాదు. ఇంకా తను ప్రయాణించిన మార్గమూ ఇది కాదు. అయినప్పటికీ తనకు వెలితిగా ఉన్న షెఫ్ పాత్రలో ఒదిగిపోయి ఆదర్శంగా నిలుస్తోంది మీనాక్షి.






