- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో డ్రైవర్ కూతురు.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్.!
సామాన్య యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది 24 ఏళ్ల మీనాక్షి హుడా

దిశ, ఫీచర్స్: సాధించాలనే కసి, తపన ఉంటే కుంభస్థానాన్ని కూడా అలవోకగా కొట్టొచ్చు. దానికి కుటుంబ సహకారం తోడైతే ప్రపంచాన్ని శాసించొచ్చు. ప్రపంచ రికార్డులు సాధించొచ్చు. సరిగ్గా ఇలాంటి విజయాన్నే సొంతం చేసుకొని సామాన్య యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది 24 ఏళ్ల మీనాక్షి హుడా.
నాన్న దిగులు..
మీనాక్షిది రోహ్తక్. సాధారణ కుటుంబం వాళ్లది. నలుగురు తోబుట్టువుల్లో చిన్నది మీనాక్షి. వాళ్ల నాన్న శ్రీకృష్ణ ఆటో రిక్షా డ్రైవర్. రాత్రింబవళ్లు కష్టపడి కుటుంబాన్ని పోషించేవాడు. తాను ఎంతచేసినా కుటుంబ పోషణకు సరిపోయేది కానీ.. కూడబెట్టడం కుదరకపోయేది. అలా మీనాక్షి ప్రతీ దశలో పేదరికం వెంటాడింది. వాళ్ల నాన్నకు మీనాక్షి టాలెంట్ గురించి ఎలాంటి డౌట్ లేదు. ఉన్నదల్లా ఆమె కొనుక్కునే వస్తువులు, స్పెషల్ డైట్ కిట్ల గురించే. తరుచూ ఆందోళన చెందేవాడు. క్రీడల్లో రాణించాలంటేమో ఇవన్నీ కచ్చితంగా పాటించాల్సిందే. ఇంకా కోచ్ కూడా అవసరం అని ఆలోచించేవాడు.
మొదటి టైటిల్..
12 ఏళ్ల వయసులో మీనాక్షి బాక్సింగ్ అకాడమీలో చేరింది. కోచ్ విజయ్ తనలోని ప్రతిభను గుర్తించాడు. తన కుటుంబ పరిస్థితిని కూడా అర్థం చేసుకొని కిట్ కొనిచ్చాడు. మీనాక్షి జీవితంలో అదే మొదటి కిట్. తన డైట్ సమస్యలను కూడా పరిష్కరించాడతను. వాళ్ల నాన్న మొదట్లో సంశయించినా ఎలాగోలా కోచ్ తనను ఒప్పించాడు. రింగ్‌లో మీనాక్షిని చూసిన తర్వాత మనసు మార్చుకొని రోజూ ఆటోలో తీసుకెళ్లడం, టోర్నమెంట్లకు డబ్బులు సమకూర్చడం వంటి సహకారం అందించాడు. అలా మొదటిసారిగా 2019లో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ నేషనల్స్ గోల్డ్ సబ్-జూనియర్ టైటిల్ సొంతం చేసుకుంది.
వరుస విజయాలు..
శ్రీకృష్ణకు నమ్మకం మరింతగా బలపడింది. తన బిడ్డ కోసం తీసుకుంటున్న రిస్క్, పడుతున్న శ్రమకు, పెడుతున్న ఖర్చుకూ సార్థకత జరిగిందని మనసలో అనుకున్నాడు. నాన్న సహకారంతో 2021లో సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్, 2022లో ఆసియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 52కేజీల ఫ్లై వెయిట్‌లో సిల్వర్ సాధించింది. తర్వాత 48కేజీ క్లాస్‌కు మారింది. ఇది ఒలింపిక్ కేటగిరీ కాకపోయినా తన సత్తా నిరూపించుకోవడానికి దక్కిన అవకాశంగా భావించింది. అలా వరుసగా 2023, 2024లో నేషనల్ టైటిల్స్ గెలిచింది. అంతేకాదు ప్రముఖ బాక్సర్ నీతు ఘంఘాస్‌ను ఓడించింది.
వరల్డ్ ఛాంపియన్..
2025లో లివర్‌పూల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మీనాక్షి మహిళల 48కేజీ కేటగిరీలో గోల్డ్ సాధించి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో కజకిస్తాన్‌కు చెందిన మల్టిపుల్ వరల్డ్ ఛాంపియన్, ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ నజీమ్ కైజైబేను 4-1 స్ప్లిట్ డెసిషన్‌తో ఓడించింది. వరల్డ్ ఛాంపియన్ కావడం తన కల. అందుకే కఠోర సాధన చేస్తోంది. ఒక ఆటోరిక్షా నడిపే వ్యక్తి కూతురుగా రంగంలోకి దిగి దేశం గర్వించే స్థాయిలో రాణిస్తోంది. తన విజయం ఆరంభం మాత్రమే.. సాధించాల్సింది చాలా ఉందని చెప్తోంది మీనాక్షి. తన విజయం నేటి యువతకొక సందేశం.






