ఈ 4 అలవాట్లు చాలు.. మీ ఆయుష్షును పెంచేస్తాయ్!

by Javid Pasha |

దీర్ఘకాలిక ఒత్తిడి గుండెకు శత్రువు. దీనిని నియంత్రించడానికి యోగా, మెడిటేషన్, నేచర్ వాక్స్ వంటివి అవసరం.

ఈ 4 అలవాట్లు చాలు.. మీ ఆయుష్షును పెంచేస్తాయ్!
X

దిశ, ఫీచర్స్ : మీరు ఎంతకాలం ఆరోగ్యంగా జీవించి ఉంటారనేది చాలా వరకు మీ చేతుల్లోనే ఉంటుందని, మీ రోజువారీ అలవాట్లపై ఇది ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా గుండె పనితీరు దీనిని డిసైడ్ చేస్తుంది. అయితే చాలామంది ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఆలోచిస్తుంటారు. కానీ ముందు నుంచే గుండె ఆరోగ్యంపై తగిన శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. అలాగనీ దీర్ఘకాలిక గుండె ఆరోగ్యం కోసం ఖరీదైన సప్లిమెంట్లు లేదా మందులు అవసరం లేదు. చాలా సాధారణమైన, శాస్త్రీయంగా సమర్థించబడిన అలవాట్లు ద్వారా మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సింపుల్ శ్వాస వ్యాయామాలు

ప్రతి రోజూ 5-10 నిమిషాలు శ్వాసవ్యాయామాలు(deep breathing) చేయడం గుండెకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాఫ్రాగ్మాటిక్ బ్రీతింగ్ లేదా 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ వంటివి పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేసి, స్ట్రెస్ హార్మోన్లు అయిన కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తాయి. దీని వల్ల రక్తపోటు తగ్గి, హార్ట్ బీట్ క్వాలిటీగా స్థిరంగా ఉంటుంది. అధ్యయనాల ప్రకారం.. రోజువారీగా బ్రీతింగ్ వ్యాయామాలు చేసే వారిలో హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV) మెరుగుపడి, గుండె సమస్యలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదయం లేదా రాత్రి పడుకోబోయే ముందు ఈ శ్వాస వ్యాయామాలు చేయడం ఉత్తమం.

2. నాణ్యమైన నిద్ర అలవాట్లు

రాత్రిపూట, నైట్ షిప్టులు చేసేవారైతే పగటి పూట లేదా మధ్యాహ్నం ఇలా.. సమయం ఏదైనా సరే సరిపడా నాణ్యమైన నిద్ర అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా 7-8 గంటల క్వాలిటీ స్లీప్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది దీర్ఘాయువును పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది ఒక అలవాటుగా కొనసాగించాలని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా నిద్ర లోపం ఉన్నప్పుడు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి, రక్తపోటు పెరగడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు వస్తాయి. మంచి నిద్ర అలవాట్లు (నిర్ణీత సమయంలో పడుకోవడం, గదిని అనుకూలమైన వాతావరణంలో ఉంచడం, కాఫీ, టీ వంటివి సాయంత్రం తర్వాత మానేయడం) ద్వారా శరీరం రికవరీ మోడ్‌లోకి వెళ్తుంది. సైన్స్ ప్రకారం.. మంచి నిద్ర గుండెలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, హార్ట్ ఎటాక్ & స్ట్రోక్ రిస్కును 20-30% వరకు తగ్గించగలదు.

3. ఒత్తిడిని తగ్గించడం

దీర్ఘకాలిక ఒత్తిడి గుండెకు శత్రువు. కాబట్టి దీనిని నియంత్రించడానికి మెడిటేషన్, యోగా, నేచర్ వాక్స్ లేదా మ్యూజిక్ వినడం, ఇష్టమైన వారితో సంభాషణలు వంటివి చాలా ఉపయోగకరం. దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఇది రక్త నాళాలను రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. రక్తపోటును స్థిరంగా ఉంచుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. అనేక అధ్యయనాలు చూపించినట్లు, రోజూ 10-15 నిమిషాలు మెడిటేషన్ చేసే వారికి కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ తగ్గుతుంది. స్ట్రెస్‌ను నిర్వహించడం(Stress reduction) అంటే గుండెను దీర్ఘకాలంపాటు బలంగా ఉంచడమే కాబట్టి ఈ అలవాటు చాలా ముఖ్యం.

4. స్క్రీన్ టైమ్ పరిమితం చేయడం

రాత్రికి లేదా పగలు నిద్రపోయేవారు అయినా సరే పడుకోవడానికి 1-2 గంటల ముందు మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ స్క్రీన్లను దూరంగా ఉంచడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే.. వీటి ద్వారా వెలువడే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్‌ను అడ్డుకుని నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల నిద్ర లేమి, బ్లడ్ ప్రెజర్ పెరగడం వంటివి సంభవించి గుండెపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. అందుకే స్క్రీన్ టైమ్ తగ్గించాలి. వీలైతే అందుకు బదులుగా పుస్తకం చదవడం లేదా లైట్ మ్యూజిక్ వినడం వంటివి చేస్తే నాణ్యమైన నిద్ర వస్తుంది. ఇది గుండె రేటును స్థిరంగా ఉంచి, మొత్తం కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నాలుగు అలవాట్లను క్రమం తప్పకుండా అనుసరిస్తే మీ గుండె దీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంటుంది. ఇది దీర్ఘాయువునకు దారితీస్తుంది. రోజువారీ అలవాట్లలో ఇలాంటి చిన్న చిన్న మార్పులే జీవితంలో ఆరోగ్యకరమైన మార్పులకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. వైద్య నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Next Story