యూరియా సిండికేట్ దందా..

by Taduka Kalyani |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా సిండికేట్ దందా జోరుగా సాగుతోంది.

యూరియా సిండికేట్ దందా..
X

దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా సిండికేట్ దందా జోరుగా సాగుతోంది. అక్రమార్జనే ద్యేయంగా ఎరువుల వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు యూరియా విక్రయిస్తూ.. రైతులను దోపిడీ చేస్తున్నారు. తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారితో కుమ్మక్కై అక్రమ దందాను ప్రొత్సాహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో తొలకరి వర్షంతో ఖరీఫ్ సీజన్ సాగు పనులు జోరుగా సాగుతున్న.. నేపథ్యంలో రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు యూరియా కుత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తూ.. రైతులను దోచుకుంటున్నారు. ఒక్కో యూరియా బస్తా పైన 100 నుంచి 150 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు..

ఇచ్చేధర ఒక్కటి.. బిల్లులో రాసేది మరోకటి..

యూరియా అమ్మకాల్లో వ్యాపారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కొందరు వ్యాపారులు రైతులకు యూరియా ఇచ్చేధర ఒకటైతే. బిల్లులో మాత్రం మరోలా రాసి ఇస్తున్నారు. మరికొందరైతే షాపు పేరు ఉన్న బిల్లు ఇవ్వకుండా రైతులకు తెల్ల కాగితం మీద రాసి ఇస్తున్నారు. తర్వాత ఆ రైతుల పేర్లను ప్రభుత్వం రికార్డుల కోసం బిల్లు బుక్స్ లో రాస్తున్నట్టు సమాచారం. తాజాగా జిల్లాలోని ఓ ఎరువుల దుకాణంలో యూరియా కోనుగోలు చేసిన రైతు వద్ద నుంచి బస్తాకు 350 చొప్పున వసూలు చేసి.. బిల్లులో మాత్రం 270 నమోదు చేసి ఇచ్చారు. ఇటీవల కాగజ్ నగర్ లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్న మూడు ఫర్టిలైజర్ షాపులపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఖరీఫ్ సాగుకు ముందునుంచే విక్రయాలు.

జిల్లాలో ఖరీఫ్ సీజన్ సాగు నెల ముందునుంచే వ్యాపారులు ఎరువులను నిల్వ చేసి రైతులకు విక్రయిస్తున్నారు. యూరియా సొసైటీ లు, గ్రోమోర్ సెంటర్లు, డీసీఎంఎస్ల వద్ద ఎమ్మార్పీకి లభిస్తుంది. కానీ అధికారులు వీటిని అలాట్ చేయకుండా ప్రైవేటు వ్యాపారులకు అధికంగా కేటాయిస్తున్నారు. ఇదికూడా ఖరీఫ్ ముందే ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది సైతం వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ లో విక్రయించడంతో ఎరువులు లభించక రైతులు రోడ్ ఎక్కి ఆందోళనలు చేపట్టారు. దీనికి గత జిల్లా వ్యవసాయ అధికారిని బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

అధికారులు చర్యలు తీసుకోవాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి దుర్గం దిన్ కార్..

జిల్లాలో వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులకు యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నారు. బిల్లులు కూడా ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. తనిఖీ చేసి. వ్యాపారుల చర్యలు తీసుకోవడంతోపాటు అక్రమ వసూళ్లను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు..

Next Story