- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి నష్టం: ఎంపీ రఘునందన్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.

దిశ, మిరుదొడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఏ పరిస్థితి ఎదురైనా, ఎలాంటి రాజకీయ విమర్శలు వచ్చినా ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీ బీజేపీయేనని అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన, 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, ఎల్.కే. అద్వానీ సహా పలువురు నాయకులు, బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని, పత్రికా స్వేచ్ఛను అణచివేశారని ఆరోపించారు. అలాంటి చర్యలతో ప్రజాస్వామ్యానికి నష్టం జరిగిందని పేర్కొంటూ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం
మిరుదొడ్డి మండల కేంద్రంలో సుమారు రూ.40 లక్షల ఎంపీ లాడ్స్, ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న మురుగు కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మున్నూరు కాపు భవనాన్ని ప్రారంభించి, కూరగాయల మార్కెట్‌లో శౌచాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిథిలావస్థకు చేరుకున్న బస్‌స్టాండ్, మూత్రశాలలను పరిశీలించిన ఆయన, ఆర్టీసీ డిపో మేనేజర్‌తో మాట్లాడి మరమ్మతుల కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అదేవిధంగా అందె గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో రజక, ముదిరాజ్ కమ్యూనిటీ భవనాలతో పాటు సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.






