ఎస్‌ఐఆర్ ఫారాలను బీఎల్‌వోలే పంపిణీ చేయాలి : మాజీ ఎమ్మెల్యే

by Batti.Sumithra |

మక్తల్ మున్సిపాలిటీలో పెద్ద సంఖ్యలో ఓటర్లు నమోదై ఉన్నందున, ఓటర్ల నమోదు, ధృవీకరణ, తొలగింపు ప్రక్రియలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని జిల్లా పరిపాలన, రెవెన్యూ, ఎన్నికల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ ఫారాలను బీఎల్‌వోలే పంపిణీ చేయాలి : మాజీ ఎమ్మెల్యే
X

దిశ, మక్తల్ : మక్తల్ మున్సిపాలిటీలో పెద్ద సంఖ్యలో ఓటర్లు నమోదై ఉన్నందున, ఓటర్ల నమోదు, ధృవీకరణ, తొలగింపు ప్రక్రియలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని జిల్లా పరిపాలన, రెవెన్యూ, ఎన్నికల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్ ఫారాలను రాజకీయ నాయకుల ద్వారా కాకుండా, బీఎల్‌వోలే ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్యాల రామ్మోహన్ రెడ్డి అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ నాయకుల ద్వారా దరఖాస్తు ఫారాలు పంపిణీ చేస్తే కొందరు అక్రమంగా లబ్ధి పొందే అవకాశం ఉందని, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులు, 22 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మొత్తం 21,449 మంది ఓటర్లు నమోదై ఉన్నారని తెలిపారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక మున్సిపాలిటీలో వాస్తవ ఓటర్ల సంఖ్య వెల్లడవుతుందని అధికారులు పేర్కొన్నారు. గురువారం మక్తల్ మున్సిపాలిటీలో వార్డు సభ్యులు, బీఎల్‌వోలతో తహసీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ మేనేజర్ గులాం మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అదనపు కలెక్టర్ శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ విస్తరణ అనంతరం ఇతర గ్రామాల నుంచి వలస వచ్చి శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వారి ఓటు నమోదును నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. గతంలో నివాసం ఉన్న ప్రాంతంలోని ఓటు వివరాలను ధృవీకరించడంతో పాటు, 2001 ఓటర్ల జాబితా ఆధారంగా అవసరమైన నిర్ధారణ చేపట్టాలని తెలిపారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారి నమోదు విషయంలో వారి తల్లిదండ్రుల ఓటరు నమోదు వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుని అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలని సూచించారు.

ఈ సమావేశంలో వార్డు సభ్యుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొందరు ఓటర్లు రెండు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి స్పందించిన అదనపు కలెక్టర్ శ్రీను, ఈ నెల 31వ తేదీ తర్వాత అలాంటి ఓటర్లను గుర్తించి, వారి అభీష్టం మేరకు ఏ ప్రాంతంలో ఓటు కొనసాగించాలనుకుంటున్నారో ఆ అవకాశం కల్పిస్తామని తెలిపారు. బీఎల్‌వోలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, పాఠశాలలు ప్రారంభమైనా, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలు ఉన్నా, ఎస్‌ఐఆర్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎల్‌వోలను విధుల నుంచి తొలగించే అధికారం తనకు లేదని, ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారుల అనుమతితో బీఎల్‌వో బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ శ్రీను వివరించారు.

Next Story