- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dengue : వర్షాల నేపథ్యంలో ఫీవర్ వస్తోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్!!
Dengue : వర్షాల నేపథ్యంలో ఫీవర్ వస్తోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్!!

దిశ, ఫీచర్స్ : నిన్న మొన్నటి వరకు ఎండలు దంచికొట్టాయి. కానీ ఇప్పుడు మధ్య మధ్యలో వర్షాలు పడటంతో కొన్నిసార్లు చల్లగా, మరికొన్ని సార్లు వేడిగా ఉండే భిన్నమైన వాతావరణ పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దోమల బెడద పెరగడం, పలువురు జ్వరాల బారినపడటం వంటివి కూడా జరుగుతున్నాయి. సీజన్ మారుతున్న క్రమంలో ఇవి సాధారణమే అయినప్పటికీ, లక్షణాలను బట్టి అలర్ట్ అవ్వకపోతే తీవ్రమైన అనారోగ్యాలకు దారితీయవచ్చు. కాబట్టి ఐదారు రోజులకు మించి జ్వరం తగ్గడం లేదంటే అనుమానించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు ఎందుకంటే అది డెంగ్యూ (Dengue fever)కూడా కావచ్చు. ఇంతకీ అదెలా వస్తుంది? లక్షణాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
ఎందుకు వస్తుంది?
*వైద్య నిపుణుల ప్రకారం.. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీనిని కలుగుజేసే వైరస్ నాలుగు రకాల సీరోటైప్‌లలో(DENV-1, DENV-2, DENV-3, DENV-4) ఉంటుంది. అయితే ప్రధానంగా Aedes aegypti, అలాగే Aedes albopictus రకం దోమల ద్వారానే ఇది వ్యాపిస్తుంది. ఈ దోమలు డెంగ్యూ సోకిన వ్యక్తిని కుట్టి, ఆరోగ్యవంతమైన వ్యక్తిని కూడా కుట్టడం ద్వారా వైరస్ సంక్రమించి డెంగ్యూ ఫీవర్ వస్తుంది. అయితే ఈ దోమల పెరుగుదలకు కారణం ఇంటి పరిసరాల్లో, వీధుల్లోని గుంతల్లో నీరు నిలిచి ఎక్కువ రోజులు ఉండటం, అలాగే పాత టైర్లు, డబ్బాలు, కుండీలు, నీటి ట్యాంకులు వంటివి ఉండటం దోమలకు ఆవాసాలుగా, అవి గుడ్లు పెట్టడానికి అనుకూలమైన ప్రదేశాలుగా మారుతాయి. దీంతో డెంగ్యూ దోమలు పెరుగుతాయి. అలాగే వెచ్చని, తేమతో కూడిన వాతావరణం దోమల పెరుగుదలకు దోహదపడుతుంది. అంటే ఓ వైపు ఎండలు కొడుతూ.. మరోవైపు మధ్య మధ్యలో వర్షం కూడా పడటం వంటి వాతావరణం అందుకు దోహదపడుతుంది. అట్లనే డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడం, మురుగు రోడ్లపై ప్రవహించడం, అపరిశుభ్రత కూడా దోమల పెరుగుదలకు కారణం అవుతాయి. దీనివల్ల డెంగ్యూ వ్యాపిస్తుంది.
లక్షణాలు
డెంగ్యూ లక్షణాలు సాధారణంగా దోమ కాటు తర్వాత 4 -10 రోజులలో కనిపిస్తాయి. 2-7 రోజుల పాటు ఉంటాయి. అయితే తేలికపాటి లక్షణాలుగా మొదలై తీవ్రంగా మారుతాయి. అకస్మాత్తుగా 104°F (40°C) లేదా అంతకంటే ఎక్కువ జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, ముఖ్యంగా కళ్ల వెనుక నొప్పి (రెట్రో-ఆర్బిటల్ పెయిన్). దీంతోపాటు కండరాలు, కీళ్ల నొప్పులు, వికారం, వాంతులు, ఆకలి తగ్గడం, చర్మంపై ఎరుపు లేదా గులాబీ రంగు దద్దుర్లు అలసట వంటివి కనిపిస్తాయి. ఈ లక్షణాలను అనుభవిస్తూ.. ఐదారు రోజులకు మించి జ్వరం తగ్గడం లేదంటే డెంగ్యూ బారిన పడి ఉంటారని అనుమానించాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.
నివారణ ఎలా?
డెంగ్యూ (Dengue fever) అనేది వైరస్ వల్ల వ్యాపిస్తుంది. దానికి కారణం దోమలు. కాబట్టి దోమలు పెరగకుండా చూసుకోవాలి. అందుకోసం పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. గుంతల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి. అలాగే దోమ కాటుకు గురికాకుండా సురక్షితమైన దుస్తులు ధరించాలి. రాత్రి పడుకునే సమయంలో, ఉదయం పూట పొడవు చేతుల దుస్తులు, పొడవైన ప్యాంట్లు ధరించడం బెటర్. DEET, IR3535 లేదా ఇకారిడిన్ కలిగిన రిపెల్లెంట్‌లను చర్మంపై, దుస్తులపై ఉపయోగించంచడం, దోమ తెరలను ఉపయోగించడం వంటివి దోమ కాటు నుంచి రక్షిస్తాయి. దీంతోపాటు మీ పరిసరాల్లో, ఇంటి చుట్టు పక్కల నీటి నిల్వలను తొలగించండి. పాత టైర్లు, కుండీలు, డబ్బాలు వంటి నీరు నిలిచే ప్రదేశాలను తొలగించండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు తీవ్రమైన జ్వరం, ఇతర డెంగ్యూ లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి సలహాలు పాటించాలి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






