- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనసు గాయాల నుంచి.. మనిషి గర్వపడే స్థాయికి.!
బాధనే కళగా మార్చి వేలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది

దిశ, ఫీచర్స్: జీవితంలో కొన్ని సంఘటనలు మనల్ని మార్చేస్తాయి. ఆ సంఘటనల తాలూకు మరకలు కొన్ని మనసుపై పడతాయి. ఆ మరకలను.. వాటి వెనకాల ఉన్న గాయాలనే బలంగా మార్చుకొని సమాజానికి ప్రేరణగా నిలిచింది హర్యానా బ్యూటీ మన్ను. నాలుగేళ్ల వయసులో జరిగిన ఒక ఘటన తన జీవితాన్ని తలకిందులు చేస్తే.. ఆ బాధనే కళగా మార్చి ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
మానని గాయంగా..
మన్ను అసలు పేరు మనిషా మరోడియా ప్రజాపతి. వాళ్ల సొంతూరు హర్యానాలోని ఝజ్జర్. చిన్నప్పుడు చెల్లెలితో కలిసి కుమ్మరివాము దగ్గర ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు మంటలు మన్నుకు అంటుకున్నాయి. తీవ్ర గాయాలతో బతికి బయటపడింది. కానీ ఆ గాయాలు ముఖం, శరీరంపై చెరగని మరకగా మారిపోయాయి. పూర్తిగా ఆమె ముఖాకారమే మారిపోయింది. శారీరక గాయాలైతే ఆపరేషన్లతో మాన్పించవచ్చు. కానీ.. మానసిక గాయాలకు ఆ అవకాశం లేదు కదా.? గాయాల తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. కుటుంబమైతే తనకెప్పుడూ అండగా నిలిచింది.
స్కూల్లో వివక్ష..
ఇంట్లో సానుకూలంగానే ఉందిగానీ బయటి ప్రపంచంతనకు కఠినంగా మారింది. స్కూల్లో తోటి విద్యార్థులు తనను చూసి భయపడేవారు. క్లాస్‌మేట్స్ అయితే ఎవరూ దగ్గరకు రాకపోయేది. తను క్లెవర్ స్టూడెంటే. చదువులోనే కాదు.. డ్రాయింగ్, డ్యాన్స్, సింగింగ్ వంటి యాక్టివిటీస్‌లో మంచి టాలెంట్ ఉంది. కానీ ఏ ఒక్క టీచరూ మన్నును ప్రోత్సహించలేదు. "అంద వికారంగా ఉన్నావ్" దూరం పెట్టేవాళ్లు. మన్ను చాలా బాధపడేది. ఇక తనవల్ల కాక స్కూల్ మారాల్సి వచ్చింది. సమాజంలో అందంమంటే బాహ్య రూపమనే భావన ఎంత లోతుగా పాతుకుపోయిందో.. ఆ వివక్ష ఎలా ఉంటుందో చిన్నప్పుడే గ్రహించింది.
దీపికా పదుకోన్ కోసం..
కొత్త పాఠశాలలో మన్నుకు మంచి స్నేహితులు, టీచర్లు దొరికారు. వారి ప్రోత్సాహంతో తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందింది. ఇక్కడే డ్రాయింగ్ వేయడానికొక ఆశ్రయం దొరికింది. తన మనసులోని బాధలను కాన్వాస్‌పై రంగులుగా మార్చేసింది. తన పోట్రెయిట్లు ముఖ్యంగా సెలబ్రిటీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కు "ఛపాక్" సినిమా కోసం ఒక పోట్రెయిట్ బహుమతిగా ఇచ్చింది. ఇది తనకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మేకోవర్ వీడియోలు పోస్ట్ చేస్తూ తన సరైన అందానికి అర్థం చెప్పే ప్రయత్నం చేస్తోంది.
అసలైన అందమంటే..
మన్నుకు ధైర్యం.. ఆత్మాభిమానం చాలా ఎక్కువ. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ను "మీరు నన్ను మోటివేట్ చేసినందుకు థాంక్స్" అంటూ దిమ్మతిరిగే రిప్లయ్‌లు ఇచ్చి తన ధైర్యాన్ని చాటుకుంటోంది. ఇప్పుడు మన్ను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. టాలెంటెడ్ ఆర్టిస్ట్. వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఐట తన కళ తనకు ఆదాయ మార్గంగా కూడా మారింది. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని అవకాశాలుగా మార్చుకోవచ్చు అనేదానికి మన్ను చక్కటి ఉదాహరణ. మన్ను లాంటి వాళ్లు సమాజంలో సరైన అందం, విజయం అంటే ఏమిటో ఈ విధంగా నిరూపిస్తున్నారు.






