ఆసియాలోనే రిచెస్ట్ గ్రామం.. మన భారత్‌లోనే ఉందని తెలుసా..?

by Malleboina Mahesh |   (  Updated:2025-04-01 05:59:53  IST  )

ఆసియాలోనే రిచెస్ట్ గ్రామం మన భారత దేశంలో ఉంది. అవును మీరు విన్నది నిజమే తాజా గణాంకాల ప్రకారం.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం ధనిక గ్రామంగా ప్రసిద్ధి చెందింది.

ఆసియాలోనే రిచెస్ట్ గ్రామం.. మన భారత్‌లోనే ఉందని తెలుసా..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియాలోనే రిచెస్ట్ గ్రామం (The richest village in Asia) మన భారత దేశంలో ఉంది. అవును మీరు విన్నది నిజమే తాజా గణాంకాల ప్రకారం.. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం (Madhapar village) ధనిక గ్రామంగా ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ గ్రామం భారతదేశంలోని అత్యంత సంపన్న గ్రామాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా, ఆసియా ఖండంలోనే ఉన్నత స్థానంలో నిలిచింది. అయితే ఈ గ్రామంలో ఉన్న ప్రజల సంపదకు ప్రధాన కారణం ఇక్కడి నివాసుల బ్యాంకు డిపాజిట్లు. మాధపర్ గ్రామంలో సుమారు 32,000 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామస్తులు స్థానికంగా ఉన్న బ్యాంకుల్లో సుమారు 7,000 కోట్ల రూపాయలకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా జమ చేసుకున్నారు. ఈ గణాంకాలు ఈ గ్రామాన్ని ఆసియాలోని అత్యంత ధనిక గ్రామంగా నిలిపాయి.

మాధపర్ గ్రామం గురించి..

ఈ మాధపర్ గ్రామంలోని సంపదలో అధికంగా గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, యూరప్, అమెరికా వంటి ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులైన ఎన్‌ఆర్‌ఐల (నాన్-రెసిడెంట్ ఇండియన్స్) నుండి వస్తుంది. వీరు విదేశాల్లో సంపాదించిన డబ్బును స్వగ్రామంలోని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. ఈ గ్రామంలో 17కి పైగా బ్యాంకు శాఖలు ఉన్నాయి. అయితే ఒక గ్రామంలో ఇన్ని బ్యాంకులు తమ శాఖలను కలిగి ఉండటం అసాధారణం. కానీ ఇలా 17 బ్యాంకుల శాఖలు కలిగి ఉండటం.. ఈ గ్రామ ఆర్థిక బలాన్ని సూచిస్తుంది. ఈ గ్రామంలో ఆధునిక సౌకర్యాలు, విశాలమైన రోడ్లు, లగ్జరీ ఇళ్లు, ఇతర సౌలభ్యాలు ఉన్నాయి, ఇవి సాధారణ గ్రామీణ ప్రాంతాలకు భిన్నంగా ఉంటాయి.

మాధపర్ గ్రామం చరిత్ర

మాధపర్ గ్రామం 15వ శతాబ్దంలో మధ కంజీ సోలంకి (Madha Kanji Solanki) అనే వ్యక్తి చేత స్థాపించబడింది. ఈ గ్రామంలో కెజీకె (కచ్ఛీ గుజరాతీ కమ్యూనిటీ) సముదాయానికి చెందిన వారు ఉంటారు. మాధపర్ గ్రామస్తులు వ్యాపారం, విదేశీ ఉపాధి ద్వారా ఈ సంపదను సంపాదించారు. చాలా మంది గ్రామస్తులు ఆఫ్రికా లోని దేశాల్లో వ్యాపారాలు చేస్తూ, అక్కడి నుంచి సంపాదించిన ఆదాయాన్ని స్వదేశంలో పెట్టుబడిగా మార్చారు. ఈ డబ్బును వారు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో ఉంచుతారు. దీనివల్ల గ్రామ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఒక్కో వ్యక్తి పేరిట సగటున 18-20 లక్షల రూపాయల డబ్బు డిపాజిట్ ఉంటుందని అంచనా. ఇది భారతదేశంలోని సాధారణ గ్రామాలతో పోలిస్తే అసాధారణమైన ఆర్థిక స్థితిని సూచిస్తుంది. మాధపర్ గ్రామం ఆర్థిక విజయం దాని నివాసుల కఠోర శ్రమ, వ్యాపార దక్షత, విదేశీ సంబంధాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ గ్రామం గుజరాత్ రాష్ట్రానికే కాకుండా, భారతదేశానికి కూడా గర్వకారణంగా ఉంది.

Read More..

Viral News: గాల్లో నిలబడే నివాసాలు.. భూకంపాల నుంచి రక్షించేందుకు జపాన్‌ కొత్త ప్రయోగాలు!

Next Story