ఎత్తైన బిల్డింగ్స్‌లో జనాలు ఎంత వరకు సేఫ్?

by Sujitha Rachapalli |

ప్రపంచ వ్యాప్తంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ అంటే మోజు పెరిగింది. ప్యాషన్‌గా మారింది. విద్యావంతులు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మెట్రో సిటీవాసుల్లో లైఫ్ స్టయిల్ మారింది. ఐతే 50, 60 ఫ్లోర్ల వరకు కడుతున్నారు కదా.. దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏం చేస్తారు?

ఎత్తైన బిల్డింగ్స్‌లో జనాలు ఎంత వరకు సేఫ్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా హై రైజ్డ్ బిల్డింగ్స్ అంటే మోజు పెరిగింది. ప్యాషన్‌గా మారింది. విద్యావంతులు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మెట్రో సిటీవాసుల్లో లైఫ్ స్టయిల్ మారింది. ఐతే 50, 60 ఫ్లోర్ల వరకు కడుతున్నారు కదా.. దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏం చేస్తారు? తప్పించుకునే అవకాశం ఉందా? అందరూ సురక్షితంగా బయటపడేందుకు మార్గం ఉందా? హై రైజ్డ్ బిల్డింగ్స్ అంటూ గొప్పలు చెప్పే డెవలపర్లు, కంపెనీలు దీనికి ఏం సమాధానం ఇస్తాయి? అసలు రక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నాయి? 50వ ఫ్లోర్‌లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంటే ఫైర్ ఇంజిన్ అక్కడి దాకా చేరుకునే వ్యవస్థ ఉందా? అలాంటి యంత్రాలు హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో ఉన్నాయా? అంత ఎత్తు వరకు వెళ్లగలిగేందుకు.. అగ్ని ప్రమాద నియంత్రణ శాఖ సిబ్బందికి శిక్షణ ఉందా?

అదే సమయంలో ఈ భవనాల్లో భద్రతా ప్రమాణాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో దేశ రాజధాని ప్రాంతంలోని హై-రైజ్ టవర్లలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు నివాసితులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. జూన్ 5న నోయిడాలోని ఒక అపార్ట్‌మెంట్‌కు చెందిన 12వ అంతస్తులోని ఫ్లాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంతకు ముందు ఢిల్లీలోని మాల్వియా నగర్ హోటల్‌లో జరిగిన ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘజియాబాద్, గురుగ్రామ్‌లలోని లగ్జరీ అపార్ట్‌మెంట్లలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాలన్నింటికీ కారణం ఒక్కటే.. షార్ట్ సర్క్యూట్. తీవ్రమైన ఎండల కారణంగా ఏసీలపై లోడ్ పెరగడం, సరైన నిర్వహణ లేకపోవడం, ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే అత్యవసర దారులు లేకపోవడం కారణాలుగా ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని అగ్నిమాపక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హై-రైజ్ భవనాల్లో నివసించే ప్రజలు ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు ఏమిటన్న చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో జరగాలి.

ఒక్క ప్రశ్న వేయండి

మెట్రో నగరాల్లో 14 కంటే ఎక్కువ ఫ్లోర్లు వేసే బిల్డర్ల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారంతా హై రైజ్డ్ బిల్డింగ్స్ సంఖ్యను ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల హైరైజ్డ్ బిల్డింగుల సంఖ్య విపరీతమైంది. ఇటీవల ప్రభుత్వం వేలం వేసిన నియోపొలిస్, బుద్వేలు, రాయదుర్గం పాన్ మక్తా వంటి ప్రాంతాల్లోని ల్యాండ్ పార్సిల్స్‌లో 100 శాతం హైరైజ్డ్ బిల్డింగ్స్ వస్తాయి. ఇందుకు కొనుగోలుదారులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని కంపెనీలు ప్రాజెక్టు లాంచ్ చేయగానే వందలాది ఫ్లాట్లు బుక్ అయ్యాయంటూ ప్రచారం చేస్తున్నాయి. అతి గొప్ప విషయంగా హోర్డింగ్స్ పెట్టి మరీ ప్రచారానికి తెర తీస్తున్నారు. ఇలాంటి పెద్ద డెవలపర్లకు ఒకే ఒక్క ప్రశ్న.. 14వ అంతస్తు నుంచి పై ఫ్లోర్లల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎలా కాపాడుతారు? ప్రాణాలతో బయట పడే చాన్స్ ఉందా? ఫైర్ అంత ఎత్తు దాకా వస్తుందా? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారు? కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుగోలు చేస్తే ప్రాణాలకు భరోసా ఇస్తున్నారా? అనే ప్రశ్నలు వేయాల్సిన అవసరం కస్టమర్లకే ఉంది. ఈ డౌట్ క్లారిఫై చేసుకున్న తర్వాతే ఫ్లాట్‌కి అడ్వాన్స్ ఇవ్వండి.

ఫైర్ ఇంజిన్‌కు నో చాన్స్

హై-రైజ్ భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే అంత ఎత్తు దాకా వెళ్లేందుకు ఫైర్ ఇంజిన్లు లేవు. అందుకే అంతర్గత రక్షణ వ్యవస్థే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ ఫైర్ టెండర్లు (ఫైర్ ఇంజన్లు), హైడ్రాలిక్ నిచ్చెనలు సాధారణంగా 4 నుంచి 12 అంతస్తుల వరకే సులభంగా చేరుకోగలవు. అంత కంటే ఎత్తైన అంతస్తుల్లో ప్రమాదం జరిగితే కష్టం. 15, 20.. అంత కంటే పై అంతస్తుల్లో ప్రమాదం జరిగితే బయటి నుంచి మంటలను ఆర్పడం అగ్ని మాపక సిబ్బందికి సాధ్యం కాదు. అందుకే బిల్డింగ్ లోపల ఉండే వెట్ రైజర్లు, వాటర్ ట్యాంకులు, స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ అలారాలు నిరంతరం పని చేసే స్థితిలో ఉండాలి. బిల్డర్ ఇల్లు అప్పగించేటప్పుడు లభించే ఫైర్ నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్‌తోనే బాధ్యత ముగిసిపోదు. ప్రతి ఏటా లేదా రెండేళ్లకు ఒకసారి అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏసీలు వెరీ డేంజర్

ఇటీవల అగ్ని ప్రమాదాల్లో షార్ట్ సర్క్యూట్ అతి పెద్ద కారణంగా తెలుస్తుంది. వేసవి కాలం ప్రారంభంలో, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు ఏసీలను నిరంతరాయంగా వాడటం వల్ల విద్యుత్ వ్యవస్థలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఏసీలను ఏడాదికి కనీసం ఒకసారైనా నిపుణులైన టెక్నీషియన్లతో సర్వీసింగ్ చేయించాలి. ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా కాకుండా 24 వద్ద నిర్వహించడం వల్ల మెషిన్‌పై లోడ్ తగ్గుతుందని.. తద్వారా షార్ట్ సర్క్యూట్ ముప్పు తప్పుతుందని చెబుతున్నారు.

లిఫ్టులు వాడొద్దు

అపార్ట్‌మెంట్‌లో ఎక్కడైనా మంటలు లేదా పొగ వ్యాపిస్తే పొరపాటున కూడా లిఫ్టులను వాడొద్దు. కేవలం మెట్లను మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే పొగ నిండకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ప్రెషరైజ్డ్ మెట్ల మార్గాలు సురక్షితంగా బయటపడటానికి ఉత్తమ మార్గం. అలాగే కిచెన్ చిమ్నీలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. అక్కడ పేరుకుపోయే నూనె జిడ్డు వల్ల కూడా మంటలు త్వరగా వ్యాపించే అవకాశం ఉంది.

దారులను క్లియర్ చేయండి

చాలా అపార్ట్‌మెంట్లలో నివాసితులు ఎమర్జెన్సీ మెట్ల దారులలో పాత సామాన్లు, సైకిళ్లు, మొక్కల కుండీలు లేదా చెత్త డబ్బాలను పెడుతుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య. ప్రమాదం జరిగి దట్టమైన పొగ కమ్మేసినప్పుడు.. ఈ వస్తువులు అడ్డుపడి ప్రజలు బయటకు పరుగులు తీయడానికి తీవ్ర అంతరాయం కలిగిస్తాయి. అత్యవసర ద్వారాలు ఎల్లప్పుడూ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఖాళీగా ఉండాలి.

Next Story