మార్పు కోసం మాట్లాడాలి.. మహిళా శక్తి చాటాలి : దియా మీర్జా

by Javid Pasha |   (  Updated:2025-10-03 11:37:38  IST  )

మహిళలు తమ సొంత కథలను, కథనాలను, విజయ గాథలను సమాజానికి చెప్పడం, చర్చించడం ద్వారా సామాజిక మార్పును తీసుకురావచ్చునని బాలీవుడ్ నటి దియా మీర్జా అన్నారు.

మార్పు కోసం మాట్లాడాలి.. మహిళా శక్తి చాటాలి : దియా మీర్జా
X

దిశ, ఫీచర్స్ : ‘‘మీరు మార్పు కోరుకుంటున్నారా? లింగ అసమానతలను ఛేదించాలనుకుంటున్నారా? అయితే మౌనంగా ఉండకండి. నోరు విప్పి మీ భావాలను పంచుకోండి. వివిధ వేదికల్లో, సోషల్ మీడియాలో మీ సొంత అనుభవాలను, కథనాలను, ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సాధించిన విజయాలను పంచుకోండి. ఇది మీరు కోరుకున్న సామాజిక మార్పునకు దోహదం చేస్తుంది’’ అంటున్నారు ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత, పర్యావరణ వేత్త(Environmentalists) దియా మీర్జా. ఇటీవల జరిగిన ఫ్యాబులస్ ఓవర్ ఫోర్టీ ఫెస్టివల్‌లో ఆమె లింగ భేదాలను ఛేదించడంలో మహిళా శక్తి గురించి అనేక విషయాలను వెల్లడించారు.

ఫ్యాబులస్ ఓవర్ ఫోర్టీ అంటే?

ఫ్యాబులస్ ఓవర్ ఫోర్టీ ఫెస్టివల్ అనేది ఇండియాలో మొదటి మెనోపాజ్ వెల్‌నెస్ ఫెస్టివల్. అతి పెద్ద మహిళా ప్లాట‌ఫారమ్ నడుపుతున్న విజనరీ షైలి చోప్రా(Shaili Chopra) దీనికి నేతృత్వం వహించగా అనేకమంది మహిళలు పాల్గొని తమ భావాలను వ్యక్త పరిచారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళలు ఇందులో పాల్గొని మిడ్‌లైఫ్, మెనోపాజ్ సమస్యలు, వెల్‌నెస్, కథలను స్పాట్‌లైట్‌లోకి తీసుకురావడం ద్వారా సామాజిక మార్పును కోరుకుంటారు. దియామీర్జా కూడా ఇందులో పాల్గొని తన వ్యక్తిగత, వృత్తిపరమైన కథనాలను పంచుకున్నారు.

ప్రారంభ రోజులు.. సినీ ప్రయాణం

మిస్ ఇండియా రన్నర్-అప్ అండ్ మిస్ ఏషియా పసిఫిక్ 2000 సంవత్సరంలో, ఫెమినా మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్‌లో రెండవ రన్నర్- అప్‌గా నిలిచాను. అదే సంవత్సరం మిస్ ఏషియా పసిఫిక్ టైటిల్‌ను గెలుచుకున్న. ఈ సక్సెస్ నాకు బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించింది. దీంతో 2001లో ‘రెహనా హై తేరే దిల్ మే’ సినిమాతో యాక్టింగ్ జర్నీని ప్రారంభించాను. ఇది నాకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. వైల్డ్ డాగ్ (2000), కాఫిర్ (2020), గ్రే (2022) వంటి సినిమాలు, మరికొన్ని వెబ్ సిరీస్‌లలో నటించాను. ఇవి నాలోని నటనా సామర్థ్యాన్ని, విభిన్న పాత్రలను పోషింగలననే నమ్మకాన్ని నింపాయి.

మాట్లాడితేనే మార్పు సాధ్యం

మహిళలు తమ సొంత కథలను, కథనాలను, విజయ గాథలను సమాజానికి చెప్పడం, చర్చించడం ద్వారా సామాజిక మార్పును తీసుకురావచ్చు. నేను నా నిర్మాణ సంస్థ బోర్న్ ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా కాఫిర్ వంటి మహిళా-కేంద్రిత కథల(Women-centric stories)ను నిర్మించడం ద్వారా లింగ అసమానతలు, ముఖ్యంగా మహిళల సమస్యలు, మానవ సంబంధాలు, యుద్ధ ప్రభావాలు చర్చించాను. అది సమాజాన్ని ఆలోచింపజేసింది.

నేను అదే చేశాను

సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ. కెరీర్ ప్రారంభంలో నా స్థానాన్ని కాపాడుకోవడానికి అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. ఇదంతా నేను మౌనంగా, నోర్మూసుకొని ఉండటంవల్ల సాధ్యం కాలేదు. అందరితో సమస్యలను పంచుకున్నాను. పరిష్కారాలను ఆలోచించాను. సక్సెస్ సాధించాను. తర్వాత నిర్మాతగా, నటిగా సామాజిక సమస్యలపై దృష్టి సారించే కథలను ఎంచుకోవడంలోనూ విజయం సాధించాను. ఇప్పటికే నేను చెప్పేదేంటంటే.. మహిళలు తమ స్వీయ కథనాలను, కథలను, సమస్యలను సమాజంతో పంచుకోండి. సమాలోచన చేయండి. తద్వారా సమాజంలో లింగ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడగలిగే మార్గం, శక్తి రెండూ ఏర్పడతాయి. నేను అదే చేశాను.

పర్యావరణం కోసం

దీంతోపాటు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా పనిచేస్తూ, పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వం కోసం కృషి చేస్తున్నాను. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే నేను ప్లాస్టిక్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ, సుస్థిర ఫ్యాషన్, అండ్ జీవన విధానాలను ప్రోత్సహిస్తున్నాను. 2021లో నాకు వైభవ్ రేఖీతో జరిగిన వివాహాన్ని కూడా ప్లాస్టిక్ రహిత, స్థిరమైన వేడుకగా నిర్వహించాం.

Next Story