- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 2000తో ప్రారంభించి.. ఏడాదికి రూ. 1 కోటి సంపాదిస్తున్న మహిళ!
కేవలం రూ.2000తో ‘ఘర్చి అథ్వాన్’ అనే టిఫిన్ & ఫుడ్ సర్వీస్ ప్రాంరంభించిన గృహిణి, నేడు రూ. కోటి టర్నోవర్ సాధిస్తోంది.

దిశ, ఫీచర్స్ : పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైనా ముందుకు సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ.. ప్రతి కూల పరిస్థితులు వెంటాడుతున్నప్పుడు కూడా అడుగు ముందుకు వేస్తూ పోరాడేవారు నిజమైన విజేతలు అంటుంటారు పెద్దలు. ఈ రెండవ కోవకు చెందిన వ్యక్తే లలితా పాటిల్. ఒకప్పుడు సాధారణ గృహిణిగా.. పేదరికంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఆమె కేవలం ఇంటి నుంచే చిన్న వ్యాపారం ప్రారంభించింది. అంచలంచలుగా ఎదుగుతూ నేడు నెలకు లక్షల్లో టర్నోవర్ సాధిస్తోంది. ఎలా సాధ్యం అసలు?
రూ. 2 వేలతో ప్రారంభించి..
మహారాష్ట్రలోని థానే పట్టణానికి చెందిన లలితాపాటిల్ ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు అయిపోగానే 20 ఏండ్ల వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. ఆమె భర్త కూడా థానేలోనే గ్యాస్ ఏజెన్సీ వ్యాపారం చేసేవాడు. దానిపై వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోయేది. తర్వాత ఆ వ్యాపారం కూడా క్రమంగా ఇబ్బందుల్లో పడటంతో లలితా పాటిల్ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు ఓ ఐడియా వచ్చింది. తాను కూడా ఏదో ఒక చిన్న వ్యాపారం మొదలు పెడితే కుటుంబానికి ఆసారాగా ఉంటుందని భావించింది. కేవలం రూ.2000తో 2016లో ‘ఘర్చి అథ్వాన్’ అనే చిన్న టిఫిన్ & ఫుడ్ సర్వీస్ ఇంటి నుంచే ప్రారంభించింది. విద్యార్థులు, ఉద్యోగులు, పనులకు వెళ్లే వారికి వంటలు చేసి అందించడం ద్వారా ఆదాయం పొందేది. మొదట్లో ఏడెనిమిది మందితో ప్రారంభమైన ఈ వ్యాపారం క్రమంగా పెరిగింది. బయటి ఆహారంతో పోలిస్తే నాణ్యమైన ఇంటి వంటలు నచ్చడంతో అనేకమంది తమకు సైతం భోజనాలు చేసి ఇవ్వాలని ఆమెను సంప్రదించేవారు. ఈ విధంగా డిమాండ్, సరఫరా, వ్యాపారం పెరుగుతూ వచ్చాయి.
లక్షల్లో టర్నోవర్, ఎందరికో స్ఫూర్తి..
అది 2019. పెద్ద పెట్టుబడి లేకుండానే చిన్నపాటి వ్యాపారంతో స్వతహాగా ఎదిగిన లలితా పాటిల్ బ్రిటానియా మేరీగోల్డ్ మై స్టార్టప్ పోటీల్లో ఎంపికై రూ.7 లక్షలు గెలుచుకుంది. వాటికి తోడు తనవద్ద జమచేసుకున్న కొద్దిమొత్తం డబ్బులను కూడా పోగేసి థానే రైల్వే స్టేషన్ సమీపంలో ఒక చిన్న రెస్టారెంట్ ప్రారంభించింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి సమయంలో నష్టాలు ఎదురైనప్పటికీ, హోం డెలివరీలకు మారి వ్యాపారాన్ని కాపాడుకున్నది. పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ వ్యాపారం ఊపందుకున్నది. ఇక నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా ఆమె ఫుడ్&టిఫిన్ సర్వీస్ వ్యాపారం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నెలవారీ టర్నోవర్ రూ. 6-7 లక్షలు కాగా.. సంవత్సరానికి రూ. కోటి దాకా సాధిస్తోంది. మరో 10 మందికిపైగా తన రెస్టారెంట్‌లో ఉపాధి కల్పిస్తోంది. ఒక సాధారణ గృహిణి కేవలం రూ. 2000 పెట్టుబడితో కోటి రూపాయల ఆదాయం వచ్చే చిన్న వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న లలితాపాటిల్ సక్సెస్ జర్నీ ఇప్పుడు ఎందరికో ప్రేరణగా మారింది. ఆమె స్వయం సమృద్ధిని సాధించిన స్ఫూర్తిగా నిలుస్తోంది.






