Technology : ఇక గాలి నుంచి విద్యుదుత్పత్తి.. నాణెం సైజు జనరేటర్!

by Javid Pasha |   (  Updated:2025-12-02 06:16:55  IST  )

సాంకేతిక పరిశోధకులు డెవలప్ చేసిన కాయిన్ సైజ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్‌ను ‘Humidity-Powered Generator’ అని పిలుస్తున్నారు. ఇది గాలిలోని తేమ (నీటి ఆవిరి) నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

Technology : ఇక గాలి నుంచి విద్యుదుత్పత్తి.. నాణెం సైజు జనరేటర్!
X

దిశ, ఫీచర్స్ : నీటితోనో, సోలార్ పవర్‌తోనో విద్యుత్ జనరేట్ అవుతుందన్న విషయం తెలిసిందే. కానీ గాలి నుంచి కూడా కరెంటును ప్రొడ్యూస్ చేయవచ్చుననే విషయం మీకు తెలుసా? ఇంతకాలమైతే అలాంటి పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ(Kyoto University)కి చెందిన సాంకేతిక పరిశోధకులు ఈ అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీశారు. నాణెం సైజులో ఉండే చిన్న ఎలక్ట్రిసిటీ జనరేటర్‌ను డెవలప్ చేశారు. ఇంతకీ అదెలా పనిచేస్తుంది? దానివల్ల ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం.

సాంకేతిక పరిశోధకులు డెవలప్ చేసిన కాయిన్ సైజ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్‌ను ‘Humidity-Powered Generator’ అని పిలుస్తున్నారు. ఇది గాలిలోని తేమ(నీటి ఆవిరి) నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అందుకోసం ఈ డివైజ్‌లో ప్రత్యేకమైన మల్టీ లేయర్ నానోఫిల్మ్‌లను ఉపయోగించారు. ఇది గాలిలో ఉండే నీటి ఆవిరిని గ్రహించి, దానిని నిరంతరం ప్రవహించే చిన్న విద్యుత్ ప్రవాహంగా మారుస్తుంది. సౌర శక్తి లేదా గాలి శక్తి మాదిరిగా కాకుండా, ఇది రాత్రింబవళ్లు 24 గంటలూ పనిచేస్తుంది. ఎండ లేకపోయినా, గాలి వీయకపోయినా, ఇంటి లోపలైనా, ఆరు బయటైనా ఒకే తీరుగా పనిచేస్తుంది. పైగా ఈ జనరేటర్‌లో ఎటువంటి కదిలే భాగాలు లేవు కాబట్టి, ఎక్కడ పెట్టినా దీర్ఘకాలికంగా పనిచేస్తుంది.

ఇప్పటికే ఆగ్నేయాసియాలోని వరిపొలాల్లో నాణెం సైజు ఎలక్ట్రిసిటీ పరికరం పనితీరును పరీక్షించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా అది నెలల తరబడి సెన్సార్లకు విద్యుత్తును సరఫరా చేయడంలో సక్సెస్ అయింది. తేమ ఉంటే చాలు, ఎటువంటి ప్రత్యేక పరిస్థితులు అవసరం లేదు. కాబట్టి దూరప్రాంతాలు, అడవులు, పర్వత ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సెన్సార్లు, IoT పరికరాలు, వ్యవసాయ యంత్రాలకు నిరంతరం విద్యుత్తును అందించే అద్భుత అవకాశం ఈ నాణెం సైజ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్ కల్పిస్తుందని సాంకేతికత నిపుణులు అంటున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తే రూరల్ ఏరియాల్లో, అటవీ ప్రాంతాల్లో, ఎత్తైన కొండ ప్రాంతాల్లో ప్రత్యేకించి విద్యుత్ కనెక్షన్లు, సోలార్ ప్యానెల్స్ వంటివి అవసరం లేకుండానే చాలా సింపుల్‌గా విద్యుత్తు అందించవచ్చు. పైగా ఇది పర్యావరణ హితమైనదే కాకుండా, ఎటువంటి నిర్వహణ ఖర్చు లేకుండానే గ్లోబల్ ఎనర్జీ సెక్టార్‌లో (global energy sector) ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు సాంకేతిక నిపుణులు.

Next Story