ఐఏఎస్ ఆఫీసర్.. గో బ్యాక్ ప్లే గ్రౌండ్ ఛాలెంజ్.!

by Daayi Srishailam |

ఛాలెంజ్‌గా తీసుకొని సక్సెస్ అయ్యాడు

ఐఏఎస్ ఆఫీసర్.. గో బ్యాక్ ప్లే గ్రౌండ్ ఛాలెంజ్.!
X

దిశ, ఫీచర్స్: యువత విలువైన సమయాన్ని స్మార్ట్ ఫోన్లలో వృథా చేసుకుంటోంది. ఒకప్పుడు ఏ ఊర్లో చూసినా సాయంత్రం వేళల్లో శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఆటలాడేవాళ్లు. ఇప్పుడు ఆటా.. పాటా అంతా స్మార్ట్ ఫోన్లలోనే. ఈ ట్రెండ్‌ను మార్చి యువతను తిరిగి క్రీడా మైదానాలకు తీసుకురావాలని సంకల్పించాడు కేరళకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రేమ్ కృషన్. దాన్నొక ఛాలెంజ్‌గా తీసుకొని సక్సెస్ అయ్యాడు.

ప్రతీ యువకుడు తనలా..

ప్రేమ్ కృషన్ తిరువనంతపురంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇన్ఫోసిస్, బీఎస్ఎన్ఎల్‌లో జాబ్ చేశాడు. ఐతే తన లక్ష్యం ఐఏఎస్ కావడం. రాత్రిపూట చదువుతూ.. డే టైంలో పనిచేస్తూ యూపీఎస్సీకి ప్రిపేరయ్యాడు. ఐఏఎస్ సాధించాక త్రిస్సూర్‌లో వరద సహాయ కార్యక్రమాలను ముందుండి నడిపించాడు. పెట్టిముడి భూకంపం సమయంలోనూ క్రియాశీలకంగా పాల్గొని రక్షణ చర్యలను నిర్వహించాడు. ఈ అనుభవాలు అతన్ని సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి. తనలా యువత ఎందుకు సక్సెస్ కావద్దని ఆలోచించాడు.

స్వాప్ యువర్ స్క్రీన్ ఫర్ ఎ స్పోర్ట్..

కొత్త యువతరాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షించిన ప్రేమ్ కృషన్‌కు నిరాశ ఎదురైంది. చిన్నప్పట్నుంచే పిల్లలు మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోవడం.. ఆట స్థలాలను విస్మరించడం చూసి బాల్యం ఎలా కనుమరుగువుతుందో గమనించాడు. వాళ్లలో సృజనాత్మకతను పెంపిందించాలి అనుకున్నాడు. "స్వాప్ యువర్ స్క్రీన్ ఫర్ ఎ స్పోర్ట్" అనే ఛాలెంజ్ స్టార్ట్ చేశాడు. "పతనం తిట్ట" జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేసి పిల్లలు స్మార్ట్ ఫోన్లను పక్కనపెట్టి ఆట స్థలాల్లో ఫుట్‌బాల్, క్రికెట్ వంటి క్రీడలు ఆడేలా ప్రోత్సహిస్తున్నాడు. అతను ఆదేశాలివ్వలేదు. పిల్లలతో కలిసి నేరుగా క్రీడల్లో పాల్గొని కొత్త లైఫ్ స్టయిల్‌ను అలవాటు చేశాడు.

ఆరోగ్యకరమైన జీవనశైలి..

ప్రేమ్ ఆలోచన పిల్లల స్క్రీన్ టైంను తగ్గించడానికి కాదు. బాల్యంలో పొందాల్సిన ఆనందాన్ని, స్వేచ్ఛను కల్పించడమే తన ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. అనుకున్నట్లుగానే పిల్లల్ని ఆటస్థలాలకు రప్పించాడు. వారి మొఖంలో ఆనందాన్ని చూశాడు. ఆటలు కేవలం వినోదం కోసం కాదు.. అవి జీవితాన్ని నేర్పిస్తాయి అని అవగాహన కల్పించాడు. అతని చొరవ వల్ల పథనంతిట్టలో ఎక్కడ చూసినా ఆటస్థలాలు నిండుగా కనిపిస్తున్నాయి. పిల్లలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అనతికాలంలోనే ఈ కార్యక్రమం సామాజిక ఉద్యమంగా మారి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించి యువతకు లక్ష్యాన్ని గుర్తుచేసే కార్యక్రమంగా మారింది.

తల్లిదండ్రులు కూడా..

"స్వాప్ యువర్ స్క్రీన్ ఫర్ ఎ స్పోర్ట్" ఛాలెంజ్ గొప్పదనం ఏంటంటే ఈ కార్యక్రమంలో పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా భాగస్వాములయ్యారు. ఈ రోజుల్లో ఎవరి ఇంట్లో చూసినా సెల్‌ఫోన్‌లో మునిగిపోయే పేరెంట్స్.. వాళ్లను అనుకరించి ఫోనే ప్రపంచంగా బతికే పిల్లలను చూస్తుంటాం. ఈ ధోరణి మానవ సంబంధాలను దెబ్బతీసి ఒక పొల్యూట్ కల్చర్‌ను విస్తరింపజేస్తుంది. పథనంతిట్ట జిల్లాలో ఇప్పుడు ఈ కల్చర్ పటాపంచలు అయిపోయి పిల్లలు, తల్లిదండ్రులు కలిసి క్రీడా మైదానాల్లో ఆడుకుంటున్నారు. పిల్లలతో పేరెంట్స్ బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నారు.

Next Story