సే ట్రీస్.. కపిల్ శర్మ హరితోద్యమం.!

by Daayi Srishailam |

చెట్లను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు

సే ట్రీస్.. కపిల్ శర్మ హరితోద్యమం.!
X

దిశ, ఫీచర్స్: మనం బాగుండాలంటే నీళ్లుండాలి. పుష్కలంగా నీళ్లుండాలంటే వర్షాలు సమృద్ధిగా పడాలి. వర్షాలు పడాలంటే చెట్లుండాలి. కానీ.. ఎవరు పెంచుతున్నారు.? రోడ్డనీ.. ఇల్లనీ.. ప్లాట్లనీ.. ఫ్లాట్లనీ ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. కానీ.. కపిల్ శర్మ అలా కాదు. ఆయనకు చెట్లంటే ప్రాణం. మనిషి ఆయువు చెట్లలోనే ఉందని నమ్ముతాడు. అందుకే చెట్లను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

పూర్వ వైభవం కోసం..

కపిల్ శర్మది రాయపూర్. ఇంజినీరింగ్ చదివేందుకు బెంగళూరు వెళ్లాడు. బెంగళూరు ఆకుపచ్చ అందాలను చూసి ఫిదా అయ్యాడు. రాయపూర్లో ఎండలో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాళ్లట. అందుకే బెంగళూరులో రోజూ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. వర్షంలో తడుస్తూ ముచ్చటపడేవాడు. అంతలా తనను అట్రాక్ట్ చేసిన బెంగళూరుకు మళ్లీ వచ్చినప్పుడు మొత్తం ఉక్కపోతతో ఊపిరాడకుండా చేసింది. సిటీ అంతా పొల్యూషన్. మామూలు రోజుల్లో కూడా 41.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండేది. ఈ మార్పును చూసి ఆవేదన చెందిన కపిల్ బెంగళూరుకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.

సే ట్రీస్ ఉద్యమం..

ఆకుపచ్చని పట్టణాలను, గ్రామాలను, నగరాలను తీర్చిదిద్దేందుకు ''సే ట్రీస్' అనే ఎన్జీఓను స్థాపించాడు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అటవీకరణ, సరస్సుల పునరుద్ధరణకు నడుం బిగించాడు. కార్పొరేట్ సంస్థలు, సొసైటీ సహకారంతో 38 లక్షల చెట్లను నాటి దేశవ్యాప్తంగా అటవీ పునరుద్ధరణకు కృషి చేస్తున్నాడు. 2007లో కపిల్ వీకెండ్స్‌లో చెట్లను నాటడం ప్రారంభించాడు. కపిల్ కాన్సెప్ట్ నచ్చి ఎంతోమంది స్వచ్ఛందంగా ఈ మిషన్లో చేరారు. అలా ''సే ట్రీస్'' ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడీ సంస్థలో 100 మంది సభ్యులు ఇండియా మొత్తం చెట్లను పెట్టే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

40 బావుల పునరుద్ధరణ..

''సరస్సుల నగరం''గా పిలిచే బెంగళూరులో 2001లో 2789 సరస్సులు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో రియల్ ఎస్టేట్, వాణిజ్య కట్టడాలు, డంపింగ్ గ్రౌండ్‌లు ఉన్నాయి. వాతావరణ మార్పులు, నియంత్రణ లేని అభివృద్ధి కారణంగా సరస్సులు ఎండిపోతున్నాయి. 2017 నుంచి ''సే ట్రీస్'' నీటి సంరక్షణపై దృష్టి సారించింది. మొక్కలకు రెండు మూడు సంవత్సరాలు నీరు అవసరం. ఐతే.. వర్షాకాలంలో నాటిన మొక్కలకు వేసవిలో నీరు అందించడం కష్టమైంది. అందుకే నీటి సంరక్షణ అవసరమని గుర్తించాడు కపిల్. ఇప్పటివరకు ''సే ట్రీస్'' బెంగళూరు, పూణేలలో 40 బావులు, ఆరు సరస్సులను పునరుద్ధరించింది.

టార్గెట్ 15 సరస్సులు..

''సే ట్రీస్'' విజయ రహస్యం కపిల్ ట్రిపుల్ పీ ఫార్ములా. ప్రాజెక్ట్, పీపుల్, పైసా అనేది దాని కాన్సెప్ట్. బెంగళూరులోని 23 ఎకరాల చూడసంద్ర సరస్సును పునరుద్ధరించేందుకు రూ. 4 కోట్లు ఖర్చయ్యాయి. ఈ సరస్సు మురుగునీటి, చెత్తతో నిండిపోయి ఉండేది. ఒక సంవత్సరం కృషితో దాన్ని పచ్చని పక్షుల స్వర్గంగా, వాకింగ్ జోన్‌గా మార్చారు. వచ్చే సంవత్సరం బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్‌లలో 15 సరస్సులను పునరుద్ధరించాలని కపిల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న కపిల్ సంవత్సరానికి ఒకసారి ఇండియాకు వచ్చి పనులను పర్యవేక్షిస్తాడు.

Next Story