దర్భంగా చివరి రాణి.. కామసుందరి దేవి.!

by Daayi Srishailam |

కామసుందరి దేవి మరణంతో మిథిలా సంస్కృతికి తెరపడింది

దర్భంగా చివరి రాణి.. కామసుందరి దేవి.!
X

దిశ, ఫీచర్స్: రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. కానీ రాజవంశం తాలుకు మెమొరీస్ మిగిలే ఉన్నాయి. అలాంటి జ్ఞాపకాల్లో బిహార్‌ దర్భంగా రాజవంశం చివరి మహారాణి కామసుందరి దేవి ఒకరు. ఆమె జనవరి 12, 2026న కల్యాణి నివాసంలో కన్నుమూసింది. తన మరణంతో మిథిలా సంస్కృతికి తెరపడింది.

64 ఏళ్ల పాటు వితంతువుగా..

కామసుందరి దేవి 1932 అక్టోబర్ 22న మధుబని జిల్లాలోని మంగ్రౌని గ్రామంలో పుట్టింది. చాలా చిన్న వయసులోనే అంటే 1940లో ఆమెకు పెండ్లి జరిగింది. అదికూడా మహారాజాధిరాజ సర్ కమేశ్వర్ సింగ్ మూడో భార్యగా. ఐతే ఆమెకు సంతానం కలగలేదు. 1962లో మహారాజా మరణించాడు. ఆమె 64 ఏళ్ల పాటు వితంతువుగా జీవించించింది. సింహాసనం ఎక్కకపోయినా ఒక రాణిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. రాజకీయ అధికారం కంటే సేవ.. దేశభక్తి పట్ల ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. 64 ఏళ్లపాటు తాను నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేసి చిరస్థాయిగా నిలిచిపోయింది.

చారిత్రక సంపద కోసం..

భారత్-చైనా యుద్ధ సమయంలో దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు దర్భంగా రాజవంశం 600 కిలోల బంగారాన్ని ప్రభుత్వానికి దానం చేసింది. జాతీయ రక్షణకు.. దేశ ధైర్యానికి ఇది భారీ మద్దతును ఇచ్చిట్లయింది. దీని ద్వారా రాజవంశం దేశ భవిష్యత్తుపై విశ్వాసాన్ని చాటింది. కామసుందరి దేవి తన భర్త మరణం తర్వాత కూడా ఈ దేశభక్తి స్ఫూర్తిని కొనసాగించించింది. మహారాజా మరణం తర్వాత మిథిలా సాంస్కృతిక.. చారిత్రక సంపద కాపాడాలనే ఉద్దేశంతో 1989 మార్చి 16న మహారాజాధిరాజ కమేశ్వర్ సింగ్ కల్యాణి ఫౌండేషన్‌ను స్థాపించింది. ఆమె సంతకం చేసిన ట్రస్ట్ డీడ్‌తో ఇది రిజిస్టర్ అయింది.

మొఘల్ కాలం నుంచి..

మహారాజాధిరాజ కమేశ్వర్ సింగ్ కల్యాణి ఫౌండేషన్‌ దర్భంగా రాజ్య బౌద్ధిక.. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతోంది. మొఘల్ కాలం నుంచి మహామహోపాధ్యాయ మహేశ్ ఠాకూర్ వంశపరంపర వరకు ఇక్కడ అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫౌండేషన్‌లోని గ్రంథాలయంలో 15,000కి పైగా పుస్తకాలున్నాయి. అరుదైన సంస్కృత చేతిరాత ప్రతులు.. చిత్రాలు.. 18-19 శతాబ్దాల చారిత్రక దస్తావేజులు.. ఫర్నిచర్.. డైరీలు.. లేఖలు.. అధికారిక రికార్డులు ఇక్కడున్నాయి. 12,000 ఫోటోలు.. పాత గ్రామోఫోన్ రికార్డులు.. 1932-1948 మధ్య 18 కోడక్ ఫిల్మ్‌లు కూడా ఇక్కడ భద్రపరచబడ్డాయి.

మిథిలా వారసత్వాన్ని కాపాడుతూ..

ఫౌండేషన్ 30కి పైగా లెక్చర్ సిరీస్‌లు.. అకడమిక్ ఈవెంట్‌లు నిర్వహించింది. వేలాది చారిత్రక.. జాతీయ ప్రాముఖ్యత గల పుస్తకాలు.. దస్తావేజులు ప్రచురించింది. ఫౌండేషన్‌కు కామసుందరి దేవి శాశ్వత సహకారంగా నిలిచింది. రాజవంశం.. విద్వత్తు.. గతం-భవిష్యత్తును అనుసంధానిస్తోంది. ఆమె జీవితకాలమంతా రాజకీయ వారసత్వ అధికారంలో లేదు. నైతిక నాయకత్వంలో మాత్రం కొనసాగింది. నిశ్శబ్దంగా ఉంటూ సేవా మార్గాన్ని అనుసరించి మిథిలా వారసత్వాన్ని కాపాడింది. ఆమె మరణంతో రాజవంశం ముగిసినా తాను చేసిన కృషి దర్భంగా రాజ్య స్ఫూర్తిని తరతరాలకు ప్రేరేపిస్తుంది.

Next Story