సర్జన్లకు సమానంగా సర్జికల్ రోబోలు.. ఆ చికిత్సల్లో ఏఐ విప్లవం!

by Javid Pasha |

శస్త్రచికిత్స వీడియోలను చూపించి, ట్రాన్స్‌ఫార్మర్-ఆధారిత ఏఐతో పరిశోధకులు సర్జికల్ రోబోలకు శిక్షణ ఇచ్చారు.

సర్జన్లకు సమానంగా సర్జికల్ రోబోలు.. ఆ చికిత్సల్లో ఏఐ విప్లవం!
X

దిశ, ఫీచర్స్ : ఏఐ ఆధారిత ఆధునిక సాంకేతికత తెచ్చిన అద్భుతమైన మార్పుల్లో సర్జికల్ రోబోలు కూడా ఒకటి. అంటే డాక్టర్లు వివిధ శస్త్ర చికిత్సల్లో రోబోల సహాయం తీసుకోవడం లేదా శిక్షణ ఇచ్చిన రోబోలనే చికిత్సలో వినియోగించడం ఇందులో భాగం. అయితే సాంప్రదాయకంగా సర్జికల్ రోబోలకు సర్జన్లు, ఇంజినీర్లు కలిసి ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ డాక్టర్లు కూడా రోబోలకు శిక్షణ ఇవ్వడానికి సంవత్సరాలపాటు ట్రైనింగ్ తీసుకుంటారు. ఇక రోబోను ప్రోగ్రామ్ చేయడమనేది ఇంజినీర్లు చేస్తారు. ప్రతీ చిన్న కదలికను(micro-movements) హ్యాండ్-కోడింగ్ ద్వారా రాయాల్సి ఉంటుంది. ఇది చాలా సమయం తీసుకునే, కష్టమైన ప్రక్రియ. కానీ దీనికి చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించారు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు. ఇంతకీ ఏమిటది? ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇమిటేషన్ లెర్నింగ్

సాంప్రదాయకంగా అయితే సర్జికల్ రోబోలకు ట్రైనింగ్ ఇవ్వడం సంవత్సరాలు పట్టే ప్రక్రియ. కానీ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సమస్యను ఇమిటేషన్ లెర్నింగ్ (Imitation Learning) ద్వారా పూర్తిగా అధిగమించారు. ఎలాగంటే.. శస్త్రచికిత్స వీడియోలను రోబోలకు చూపించి, ట్రాన్స్‌ఫార్మర్-ఆధారిత AI నిర్మాణంతో (ChatGPT లాంటి సాంకేతికత) శిక్షణ ఇచ్చారు. దీని వల్ల ట్రైనింగ్ పొందిన రోబోలు సూదులను నియంత్రించడం, కణజాలాన్ని గుర్తించి సర్దుబాటు చేయడం, కుట్టడం వంటి పనులు అచ్చం మానవ డాక్టర్ల మాదిరి చేయగలిగాయి. ఈ వ్యవస్థలోని నిజమైన స్మార్ట్‌నెస్ ఏమిటంటే.. దాని అనుకూలత అంటున్నారు పరిశోధకులు.

భవిష్యత్‌పై ఆశలు

ట్రయల్స్‌లో భాగంగా శిక్షణ ఇచ్చిన ఒక సర్జికల్ రోబోను పరిశోధకులు పరిశీలించినప్పుడు అది చిన్న నిడిల్ పడిపోయినా ఫ్రీజ్ కాకుండా, స్వయంగా దాన్ని తిరిగి తీసుకుని ఆపరేషన్ పూర్తి చేసింది. ప్రీ-ప్రోగ్రామ్డ్ సూచనలు లేకుండానే.. ఇలా స్వయంప్రతిపత్తి(With autonomy)తో పని చేయడం అనుకరణ లేదా అనుసరించడం ద్వారా నేర్చుకోకునే విధానానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. అందుకు చక్కటి ఉదాహరణ.. 2025 జులైలో ఒక సర్జికల్ రోబో గాల్ బ్లాడర్ సర్జరీలో ఒక భాగాన్ని పూర్తి స్వయంప్రతిపత్తితో (human help లేకుండా) చేసి చరిత్ర సృష్టించింది. కాబట్టి ఈ పద్ధతివల్ల సంవత్సరాలు పట్టే బదులు కేవలం రోజుల్లోనే కొత్త శస్త్రచికిత్స ప్రక్రియలను రోబోలు నేర్చుకోవడం సాధ్యం అవుతుంది. అంతేకాకుండా ఈ పురోగతి పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన సర్జికల్ అసిస్టెంట్ రోబోల అభివృద్ధిని వేగవంతం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తే గనుక భవిష్యత్తులో ఆపరేషన్ థియేటర్‌లో మానవ తప్పిదాలను తగ్గించి, రోగులకు మరింత సురక్షితమైన చికిత్స అందించడంలో కీరోల్ పోషించనున్నాయి. ఇవి ఇంకా పరిశోధనా దశలో ఉన్నప్పటికీ, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

Next Story