నమ్మకాన్ని పెంచే రైతు సందేశం.. అక్కడి మార్కెట్లలో ఏం చేస్తారంటే..!

by Javid Pasha |

జపాన్ మార్కెట్లలో అమ్మే పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్‌లపై రైతు పేరు, ఫొటో, సందేశం కూడా ఉంటుంది!

నమ్మకాన్ని పెంచే రైతు సందేశం.. అక్కడి మార్కెట్లలో ఏం చేస్తారంటే..!
X

దిశ, ఫీచర్స్ : మనం షాపింగ్‌మాల్లోనో, సూపర్ మార్కెట్లోనో ప్యాకేజింగ్ కూరగాయలు, పండ్లు, పప్పులు కొన్నప్పుడు వాటిమీద బ్రాండ్ లేదా కంపెనీ పేరు, లోగో, ఫొటో ఉంటాయి. కానీ జపాన్‌లోని మార్కెట్లలో అలా కాదు. ఇక్కడి ఫ్రూట్స్, కూరగాయల ప్యాకెట్లపై వాటిని పండించిన రైతు ఫొటోలు, వారిచ్చే చిన్న సందేశాలు ఉంటాయి. అవి వినియోగదారులను, కొనుగోలు దారులను ఆకట్టుకుంటాయి. రైతులతో పరోక్ష అనుబంధాన్ని, రైతులపట్ల గౌరవాన్ని పెంచుతాయి. ఈ విధానం అటు రైతులకు ప్రోత్సాహకరంగా, ప్రేరణగా నిలువడంతోపాటు ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సైతం ఇస్తున్నది. ఇంతకీ ఎందుకలా చేస్తారు? దాని వెనుక కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.

పేరు, ఫొటో, సందేశం..

పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు వంటి ఉత్పత్తులపై రైతు పేరు, ఫొటో, సందేశం ముద్రించడాన్ని జపాన్‌లో “కావో నో మియేరు యాసాయి’’ అంటారు. అంటే ముఖం కనిపించే కూరగాయలు లేదా ‘విజిబుల్ ఫేస్ వెజిటబుల్స్’ అని అర్థం. ఈ విధమైన ప్రాక్టీస్ జపాన్‌లో 1990లలో ప్రారంభమైంది. ఈ ప్రచారం హోక్కైడో, నాగనో, కుమామోటో వంటి రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించింది. ఈ విధానానికి ప్రధాన కారణం.. ఆ సమయంలో జపాన్‌లో ఆహార భద్రతా సమస్యలు, నాణ్యతలేని ఆహారాలు, ఆహార కుంభకోణాలవల్ల వినియోగదారుల్లో నాణ్యతపై నమ్మకంపోయింది. ఆ తర్వాత పరిస్థితులు సర్దుకున్నా ప్రజల్లో మునపటిలా నమ్మకం పెరగకపోవడంతో అక్కడి వ్యాపారులు, సూపర్ మార్కెట్ యాజమాన్యాలు ఈ ‘కావో నో మియేరు యాసాయి’ పద్ధతికికి శ్రీకారం చుట్టాయి.

ఆరోగ్యం, ఆహార నాణ్యత కోసం

‘కావో నో మియేరు యాసాయి’ అనేది రైతుల అనుమతితో వారి ముఖాలను, పేర్లను, వారిచ్చే సందేశాలను ప్యాకెట్లపై ప్రచురించే ఉద్యమం లాంటిది. అంతేకాకుండా ‘ఈ కూరగాయలను నేనే పండించాను. చాలా జాగ్రత్తగా ఎటువంటి కల్తీ లేకుండా చూశాను’ అని చెప్పే రైతుల సందేశాలను సైతం ముద్రించడం ద్వారా వినియోగదారుల్లో అవగాహనను, నమ్మకాన్ని పెంపొందించారు. 2010ల నాటికి సుమారు 60% జపాన్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్స్ (JA) దీన్ని అనుసరించాయి. ఇప్పుడు చాలా సూపర్‌మార్కెట్ ప్యాకెట్లు, ఫార్మ్ బాక్సుల్లో రైతు ఫోటోతో పాటు ‘నా టమాటాలు ఇలా పండించాను, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను” అనే రైతుల వ్యక్తిగత సందేశాలు సైతం ఉంటాయి. ఈ విదానం రైతుల శ్రమను గౌరవించడమే కాకుండా ఆహార ప్రాముఖ్యతను వెల్లడిస్తుందని, కల్తీని నివారిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ఇటీవల ఈ ప్రాక్టీస్ కాస్త తగ్గుముఖం పట్టిందని కూడా నివేదికలు పేర్కొంటున్నాయి.

Next Story