వే ఆఫ్ లివింగ్ స్టూడియో.. అస్సాం సిల్క్‌కు పునర్జీవం.!

by Daayi Srishailam |

గ్రామీణ మహిళలకు గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పిస్తోంది

వే ఆఫ్ లివింగ్ స్టూడియో.. అస్సాం సిల్క్‌కు పునర్జీవం.!
X

దిశ, ఫీచర్స్: పోచంపల్లి చేనేత.. సిరిసిల్ల చీర.. గద్వాల రైక ఇలా ప్రతీ ప్రాంతానికి కట్టుబొట్టులో ప్రత్యేకత ఉంటుంది. అట్లా అస్సాంకు ముగా సిల్క్ స్పెషల్. జాగృతి ఫుకన్ అనే 32 ఏళ్ల డిజైనర్ ''వే ఆఫ్ లివింగ్ స్టూడియో'' ద్వారా అస్సాం వారసత్వ సిల్క్‌లైన ముగాకు పునర్జీవం పోస్తోంది. దీనిద్వారా గ్రామీణ మహిళలకు గౌరవప్రదమైన జీవనోపాధిని కల్పిస్తోంది.

నిరాశలోంచి ఆలోచన..

జాగృతి చిన్నప్పుడు సాంప్రదాయ ముగా మెకెల వేసుకునేది. కొత్త ముగా దుస్తులు వేసుకున్నప్పుడు కాలుకు గీసుకుపోయేది. కానీ పాత మెకెల మాత్రం మెత్తగా ఉండి సౌకర్యంగా అనిపించేది. ఫైబర్‌కు ఉండే సామర్థ్యాన్ని చిన్నప్పుడే తెలుసుకున్న జాగృతి పెద్దయ్యాక దానిపై కొంత అధ్యయనం చేసింది. ఢిల్లీలోని ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదివింది. తర్వాత ఫాస్ట్ ఫ్యాషన్ పరిశ్రమలో పనిచేసింది. అధిక ఉత్పత్తి.. శ్రమ దోపిడీ.. సాంప్రదాయ కళల ధ్వంసం వంటివన్నీ తనకు తీవ్ర నిరాశను కలిగించాయి. ఆ నిరాశలో నుంచి ఒక కొత్త ఆలోచన వచ్చింది.

వే ఆఫ్ లివింగ్ స్టూడియో..

2021లో ధేమాజీలో ''వే ఆఫ్ లివింగ్ స్టూడియో''ను ప్రారంభించింది జాగృతి. ''వే ఆఫ్ లివింగ్ స్టూడియో'' అనేది ఒక వ్యాపార కంపెనీ కాదు. అదొక కళల సమాజం. ''స్లో'' అనే పదాన్ని రివర్స్‌లో చదివితే ఈ పేరు వచ్చేలా దీనిని రూపొందించింది. స్టూడియో పెట్టిన తర్వాత ముగా సిల్క్ మీద కాన్సెంట్రేట్ చేసింది. ముగా ఒక అరుదైన పురాతన సిల్క్. అస్సాం ప్రజల గుర్తింపు. బిహు లాంటి పండుగలో తప్పనిసరిగా ఈ సిల్క్ ధరించాల్సిందే. పురాతన ఈ సిల్క్‌కు ఆధునిక హంగులద్ది సాంస్కృతిక స్థిరత్వం తీసుకురావాలనుకుంది. ముగాను మళ్లీ సమాజంలో భాగస్వామ్యం చేసేందుకు నడుంబిగించింది.

ఇంటి పెరట్లోనే..

''వే ఆఫ్ లివింగ్ స్టూడియో''.. ''సాయిల్ టు సిల్క్'' మోడల్‌పై పనిచేస్తోంది. ఇంటి పెరట్లోనే చెట్లను పెంచి నూలు వచ్చేలా చేస్తారు. మహిళలు ఇంట్లోనే వెదురు సాధనాలతో నూలు వడుకుతారు. సహజసిద్ధమైన తోటల్లోని మొక్కలతో రంగు వేస్తారు. ఏ పనినీ పరిశ్రమలకు అప్పగించరు. ఇప్పుడు 14 నేత మెకాన్లు స్టూడియో ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రతి మెకాన్ ఎనిమిది మంది కళాకారులను పోషిస్తుంది. దీంట్లో మొత్తం 57 మంది సభ్యులు ఉంటారు. వారిలో 24 మంది నూలు వడుకుతారు. 15 మంది సెరీకల్చర్ రైతులున్నారు. 10 మంది నేతకారులు.. ఆరుగురు రంగు వేసేవాళ్లు.. ఇద్దరు కోఆర్డినేటర్లు ఉంటారు.

లండన్‌ ప్రాజెక్ట్‌లో..

జాగృతి టీమ్‌లో 99 శాతం మహిళలే ఉన్నారు. 80 శాతం మంది గృహ హింస బాధితులు.. ఒంటరి మహిళలు ఉన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వీళ్లు పనిచేస్తారు. పందుల పెంపకం.. కోళ్ల పెంపకం.. ఇంటి పనులు చేసుకొని ఆ తర్వాత స్టూడియోకు వస్తారు. వీళ్ల కథలు ఆలిండియా ఇండియా రేడియోలో ప్రసారమయ్యాయి. లండన్‌లోని సెంట్రల్ సెయింట్ మార్టిన్స్‌తో ప్రాజెక్ట్‌లో బ్రాండ్ మోడల్‌గా కూడా ఎంపికయ్యారు ఇక్కడ పనిచేసే మహిళలు. ''వే ఆఫ్ లివింగ్ స్టూడియో''లో చేరిన తర్వాత 3.5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.

Next Story