చిక్‌ బుక్‌ చిక్‌ బుక్‌ రైలే.. రుద్ర హాస్పిటల్ కదిలే.!

by Daayi Srishailam |

1266 మందికి పైగా సేవలందించి కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది

చిక్‌ బుక్‌ చిక్‌ బుక్‌ రైలే.. రుద్ర హాస్పిటల్ కదిలే.!
X

దిశ, ఫీచర్స్: మహారాష్ట్రలోని భుసావల్ రైల్వే డివిజన్‌లో డీఆర్‌ఎంగా పనిచేస్తున్న ఇతీ పాండే వదిలేసిన రైలు కోచ్‌ను ''రుద్ర మొబైల్ హాస్పిటల్''గా మార్చేసింది. ఈ మొబైల్ హాస్పిటల్ ఇప్పుడు 25 వేల మంది రైల్వే కార్మికులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య సేవలందిస్తోంది. టెస్టులు, ఆపరేషన్లు, చికిత్సలు అన్నీ రైలు మీదే నడుస్తున్నాయి. ఇప్పటివరకు 1266 మందికి పైగా సేవలందించి కార్మికుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది.

మొబైల్ హాస్పిటల్..

ఇతీ పాండే 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. ముంబై వెస్టర్న్ రైల్వే, సెంట్రల్ రైల్వేలో పని చేసింది. భుసావల్ డివిజన్‌లో మొదటి మహిళా డీఆర్‌ఎం‌గా 2023లో చేరింది. భుసావల్‌లో చేరిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉండే కార్మికుల ఆరోగ్య సమస్యలు గమనించింది. చాలిస్‌గావ్, ముర్తిజాపూర్, బద్నేరా వంటి గ్రామాల్లో 25 వేల మంది కార్మికులు ఉన్నారు. వారికి గాయాలు, దీర్ఘకాలిక వ్యాధులు సాధారణం. కానీ.. భుసావల్ ఆసుపత్రికి వెళ్లడం కష్టం. ఇలాంటి సమస్యలు చూసిన ఐటీ పాండేకు ''రుద్ర'' ఆలోచన వచ్చింది. సంజీవని మొబైల్ హాస్పిటల్ నుంచి ఆమె స్ఫూర్తి పొందింది.

నిరంతర చికిత్స..

రుద్ర.. సాధారణ రైలు కోచ్ కాదు. ఇదొక జీవితాన్ని రక్షించేది. ప్రతి రెండు వారాలకు దూరంగా ఉన్న డివిజన్లకు ఇది వెళ్తుంది. కార్మికులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు, స్పెషలిస్ట్ సలహాలు అందిస్తుంది. ముంబై మటుంగా వర్క్‌షాప్ నుంచి కోచ్‌ను భుసావల్‌కు తీసుకొచ్చారు. అక్కడి సిబ్బంది కోచ్‌ను పూర్తిగా మార్చారు. ఈసీజీ మెషిన్, రక్త సేకరణ, సాధారణ పరీక్షా యూనిట్, మహిళలకు గైనకాలజికల్ టేబుల్‌లు ఉన్నాయి. అదనంగా టెలిమెడిసిన్ సౌకర్యం కూడా ఉంది. ప్రతి ఒక్కరికీ యూనిక్ ఐడీ ఇచ్చి ఫాలో-అప్ చికిత్సకు భుసావల్ ఆసుపత్రిలోకి షిఫ్ట్ చేస్తారు. ఇది నిరంతర చికిత్సను అందిస్తోంది.

...

1266 మందికి వైద్యం..

2025 జనవరి 18న చాలిస్‌గావ్‌లో మొదటి మెడికల్ క్యాంప్ జరిగింది. ఒకే రోజులో 259 మందికి సేవలు, 159 మంది కార్మికులు, 72 మంది కుటుంబ సభ్యులు, 25 మంది రిటైర్డ్ వర్కర్లకు ఈ సేవలు అందాయి. బ్లడ్ షుగర్, ఆనిమియా వంటి వ్యాధులను గుర్తించి, సమస్యలు పెరగకుండా చేశారు. ఫిబ్రవరి 30న ముర్తిజాపూర్‌లో 291 మందికి సేవలు అందించారు. మొత్తంగా 1266 మందికి ఈ మొబైల్ ట్రైన్ హాస్పిటల్ ద్వారా సేలందించారు. వీటిలో బుర్హాన్‌పూర్లో 302, నంద్‌గావ్లో 247, అకోలాలో 167 మందికి వైద్య సేవలు అందించారు.

ఆపరేషన్ థియేటర్..

రుద్ర విజయంలో డీఆర్‌ఎం‌తో పాటు ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, టెలికాం డిపార్ట్‌మెంట్లు కూడా సహకరిస్తున్నాయి. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 2025 జనవరి 8న రుద్రను ప్రారంభించాడు. పాండేకు 2025 ఆగస్టులో సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా పదవి వచ్చింది. రుద్రను మరింత మెరుగుపరచాలని పాండే ఆలోచిస్తోంది. రెండో కోచ్‌ను మార్చి కంటి, నోటి ఆరోగ్య సేవలను కూడా చేర్చాలని ప్లాన్ చేస్తోంది. కటారాక్ట్ సర్జరీలు, చిన్న డెంటల్ ప్రొసీజర్లకు ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి దూరపు ప్రాంతాల్లో మరింత మందికి రుద్ర సేవలు అందించాలనేది తన లక్ష్యం.

Next Story