Groom's Dance.. బ్యాండ్ బాజా బారాత్.! (రాజా.. వద్దు రాజా)

by Daayi Srishailam |   (  Updated:2026-01-12 08:50:56  IST  )

తన పెళ్లిలో వరుడు డ్యాన్స్ చేశాడు.. వధువు తండ్రి పెళ్లి క్యాన్సిల్ చేశాడు

Grooms Dance.. బ్యాండ్ బాజా బారాత్.!  (రాజా.. వద్దు రాజా)
X

మన పెళ్లికి..

పక్కోడు డ్యాన్స్ చేస్తే రొటీన్.

అదే మనం చేస్తే..

సమ్‌థింగ్ స్పెషల్.!

వైరల్ కంటెంట్ కూడా.

సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయొచ్చు.

ఫేమస్ కావచ్చు.!!

ఇంతవరకు బానే ఉంది.

కానీ.. అది ఎవరి పెళ్లోక కాదు బాబాయ్.

నీ పెళ్లి.!

అంటే.. నీ డిసిప్లేన్‌కు సరైన స్టేజ్.!!

అయ్యా బాబులూ. పెళ్లి మనదనే సంతోషంలో ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి పెంట చేయకండి. పెళ్లి నీదే కావచ్చు. బారాత్ నీదే కావచ్చు. ఆ కాలు నీదే కావచ్చు. ఈ కాలూ నీదే కావచ్చు. కానీ.. అది పెండ్లి పిల్లకో.. వాళ్ల నాన్నకో.. వాళ్లమ్మకో నచ్చాలని లేదు కదా.? పుష్ప లెవల్లో బిల్డపివ్వకుండా సొంత పెళ్లికి కొంత మానుకో బ్రదర్. లేకపోతే ఏమవుతుందో తెలుసుకోవాలనుందా.?

డ్యాన్స్ చేస్తే పెళ్లి క్యాన్సిల్

ఢిల్లీలో ఒక పెళ్లి వేడుక. అతిథులంతా వచ్చేశారు. పెళ్లి పీటలపై వధువు కూర్చుంది. ఇంతలో వరుడిని తీసుకొచ్చే తంతు. ఆ సమయంలో అతడి స్నేహితులు జోష్‌తో కేరింతలు కొట్టారు. ఈలలు వేశారు. వరుడు వాళ్ల వైపు చూసి నవ్వాడు. ఎయ్ మామా.. స్టెప్పులెయ్యాల్సిందే. మల్ల మల్ల టైమొస్తదా.? ఇయ్యాలటితో నీ బ్యాచిలర్ లైఫ్ క్లోజ్. మల్లా రాదు ఈ లైఫ్. ఎయ్ మామా ఎయ్ అని రెచ్చగొట్టారు. రెచ్చగొడితే రెచ్చిపోతరా.. అని అడగొచ్చు మీరు. కొందరు ఈ వరుడిలా రెచ్చిపోతారు. దోస్తులు అడిగేసరికి కాదనలేక ఉబ్బితబ్బిపోయి డ్యాన్స్ చేశాడతను. అంతే.. పందిట్లో నుంచి వధువు తండ్రి.. పెళ్లి క్యాన్సిల్ అని కేకేశాడు.

అంతా సాంగే చేసింది

అన్యాయం కాకపోతే.. పెళ్లిలో నాలుగు స్టెప్పులేస్తే క్యాన్సిల్ చేస్తారా అనిపిస్తుంది. వాలిడ్ పాయింటే ఇది. కానీ పిల్లనిచ్చే వ్యక్తికి ఇది ఇష్టంలేదు. నిండు సభలో తాళి కట్టాల్సిన అల్లుడు డ్యాన్సు చేయడం ఆయనకు సిల్లీగా అనిపించింది. డ్యాన్స్ కంటే అక్కడ ప్లే చేసిన సాంగ్ పైనే ఎక్కు గుర్రుగా ఉన్నాడు. ఆ సాంగే ఖల్ నాయక్ సినిమాలోని చోళీకే పీచే క్యా హై అనే పాట. ఈ పాట వింటే ఎవరికైనా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. కానీ వధువు తండ్రి దృష్టిలో అదొక బూతు పాట. ఛల్ ఇంతచేసి బూతుపాటలకు డ్యాన్సు చేసేటోడికి నా బిడ్డెను ఇస్తనా అనుకున్నడో ఏమో.. పెళ్లి కుదరదంటే కుదరదన్నాడు.

సెన్సేషన్ కోసమేనా.?

ఒక్క ఈ పెళ్లి ముచ్చట్నే కాదు. ప్రతీ పెళ్లిలో ఇదొక తప్పనిసరి తంతు అయింది. పెళ్లి కూతురో లేదా పెళ్లి కొడుకో డ్యాన్స్ చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి.. అది వైరల్ అవ్వాలనే ధ్యాస ఎక్కువైంది. ఈ సెన్సేషన్ కోసమే ఎవరి పెళ్లిలో వాళ్లు డ్యాన్స్ చేస్తున్నారు. కానీ అందరూ దీనిని పాజిటివ్‌గా తీసుకుంటారా అంటే నో అనే చెప్పాలి. తాజా ఢిల్లీ పెళ్లి గురించే తీసుకుందాం. అల్లుడు పెళ్లి మండపంలో డ్యాన్స్ చేయడాన్ని మామ క్రమశిక్షణా రాహిత్యంగా తీసుకున్నాడు. ఏమో అపురూపంగా పెంచుకున్న కూతుర్ని చేతిలో పెడుతున్నాం.. ఇలా చిందేస్తున్నాడంటే ఇంకేమేం అలవాట్లున్నాయో అనే అభద్రతా భావం కావచ్చు.

భయపడుతుంది బ్రదర్

ఇది మరో పెళ్లి సీన్. వధువు ఒకచోట నిలబడి ఉంది. వరుడిని ఫ్రెండ్స్ ఆమె దగ్గరికి తోసేశారు. మనోడు ఏమాత్రం ఆలోచించకుండా డ్యాన్స్ మొదలుపెట్టాడు. కహోనా ప్యార్ హై చిత్రంలోని ఆయ్ ప్యార్ కీ యే రూట్ పాట అది. దుమ్ము లేపాడనుకోండీ. ఈ విపరీతమైన డ్యాన్స్ చూసి పెళ్లి కూతురు బెంబేలెత్తి పోయింది. అదేదో తుపాను వచ్చినట్లే ఉంది అతడి డ్యాన్స్. ఇంకెప్పుడైపోతుంది సామీ అన్నట్లు ఫేస్ పెట్టింది వధువు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కొన్ని గంటల్లోనే 55వేల లైక్స్ వచ్చాయి. నీ పెళ్లి సంబరం సల్లగుండా అమ్మాయి పారిపోగాల బ్రో అని కామెంట్లు చేశారు నెటిజన్లు.

మాడిపోయిన ముఖం

దేబాసిష్ స్వైన్ షేర్ చేసిన ఇంకో పెళ్లి డ్యాన్స్ తంతు ఇది. వరమాల వేడుక ముగిసింది. వధూవరులను అందరూ ఆశీర్వదించి అక్షింతలేస్తున్నారు. ఫొటోలు దిగుతున్నారు. అంతలోనే వరుడి ఫ్రెండ్స్ వచ్చారు. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతుర్ని డ్యాన్స్ చేయాల్సిందిగా ఫోర్స్ చేశారు. వరుడు ససేమిరా అన్నారు. వధువు మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా డ్యాన్స్ ఊపేసింది. వరుడు ఆశ్చర్యపోయి చూస్తూనే ఉన్నాడు. పైగా అతడినీ చేయాలని పట్టుబడుతోంది. నా వల్ల కాదు తల్లోయ్ అన్నట్లు ఫేస్ పెట్టాడు. అయినా కూడా ఆమె డ్యాన్స్ మాత్రం ఆపలేదు. పాపం.. పెండ్లిపిల్ల డ్యాన్స్‌కు వరుడి మొఖం మాడిపోయింది.

చూసుకోవాలిగా తమ్ముడూ

పెళ్లి అయిపోయింది. బరాత్ నడుస్తోంది. వధూ వరులు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఒకరకంగా ఇద్దరూ పోటీ పడ్డారు. డ్యాన్స్ చేస్తూ మధ్య మధ్యలో పెండ్లిపిల్లను ఎత్తుకోవాలి అనేది కెమెరామెన్ సలహా. పాపం.. అలానే చేయబోయాడు వరుడు. ప్చ్.. ఆమెను ఎత్తుకుంటుండగా వరుడి ప్యాంట్ పర్రుమని చినిగింది. అక్కడున్నవాళ్లంతా ఘొళ్లున నవ్వారు. ఎక్కడ పెళ్లిపిల్ల చూస్తుందో అనేది మనోడి బాధ. కవర్ చేసుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. మెల్లగా దీనిని గమనించింది వధువు. అతన్ని పక్కకు నెట్టుకుంటూ కిందికి వెళ్లింది. పక్కనున్న వ్యక్తి తన కోటునిచ్చి కట్టుకోమన్నాడు. చూసుకోవాలిగా తమ్ముడూ.

మరదలితో డ్యాన్సా.?

బాలీవుడ్ సాంగ్ వో జింకే ఆగే జీ.. వో జింకే పేచే జీ సాంగ్‌కు వధూ వరులు హుషారుగా డ్యాన్సులు చేస్తున్నారు. వీళ్లిలా చేస్తుండగానే పెళ్లికూతురు చెల్లె సీన్లోకి ఎంటరైంది. ఇక.. పెళ్లి కొడుకు వధువును వదిలేసి మరదలితో డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. డ్యాన్సంటే మామూలు డ్యాన్స్ కాదది.. రొమాంటిక్ సీన్లకు మించి ఉంది. ఎంత ఆపినా ఆగకపోవడంతో పెళ్లికూతురు నారాజ్ అయింది. బాబూ.. డ్యాన్స్ చేయాల్సిందో మరదలితో కాదు.. నీ భార్యతో.

అత్త డ్యాన్స్.. అల్లుడు షాక్

పెళ్లి కొడుకు పెళ్లి మండపంలో కూర్చున్నాడు. పెళ్లికూతుర్ని అప్పుడే తీసుకొస్తున్నారు. వధువు కుటుంబ సభ్యులు ధూమ్ ధామ్‌గా డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లికూతురు తల్లి చేతిలో సిగరెట్ పట్టుకొని వీర లెవల్లో స్టెప్పులు ఇరగదీస్తోంది. ఇదెందుకో అల్లుడికి నచ్చలేదు. ఇదెక్కడి మాస్ రా మామా అనుకుంటూ అల్లుడు పెళ్లి పీటల మీది నుంచి వెళ్లిపోయాడు. నాకు ఈ పెళ్లి వద్దంటే వద్దన్నాడు. చూశారా.. అల్లుడే కాదు.. అత్తమామ కూడా బాధ్యతగా ఉంటేనే పెళ్లి.

Next Story