లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్.. నో ఎగ్జిట్?

by Disha Web |
లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్.. నో ఎగ్జిట్?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత ప్రపంచంలో, ప్రత్యేకించి మెట్రో నగరాల్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్స్ చాలా కామన్ అయిపోయాయి. ప్రేమ, శారీరక సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వివాహం లేకుండా కలిసి జీవించడమే 'సహజీవనం' కాగా.. ఈ ట్రెండ్ కొన్నేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. కానీ, ఇటీవలే శ్రద్ధా వాకర్ అనే యువతి తన లివ్-ఇన్ పార్ట్‌నర్ చేతిలో హత్యకు గురైన ఘటన.. ఈ 'లివ్-ఇన్ రిలేషన్‌షిప్' కాన్సెప్ట్‌పై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఆమె హత్య ఇలాంటి సంబంధాల నుంచి బయటికి వెళ్లేందుకు ఒక వ్యక్తి ఎదుర్కొనే ఇబ్బందులు సహా అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. శ్రద్ధ కూడా పార్ట్‌నర్‌తో టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడాలని కోరుకున్నప్పటికీ అలా చేయడంలో విఫలమైంది. ఈ విషయాలు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుండగా.. వ్యక్తులు సహజీవన సంబంధాలను వదిలించుకోవడాన్ని కష్టంగా భావించడం వెనకున్న కొన్ని కారణాలు నిపుణుల మాటల్లో..

సొసైటికల్ చేంజెస్.. రిలేషన్‌షిప్స్‌లోనూ మార్పు తీసుకొస్తు్న్నాయి. ఇష్టమైన వ్యక్తితో, నచ్చినంత కాలం జీవితాన్ని పంచుకోవడమనే కాన్సెప్ట్ మెట్రో నగరాల్లో పాపులర్ అయిపోయింది. సంప్రదాయ వివాహ సంబంధాల మాదిరి ఇక్కడ పితృస్వామ్య విధానాలతో పాటు జెండర్ డిస్క్రిమినేషన్ లేకపోవడం, ఇండిపెండెంట్‌గా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించడంతో యువత ఈ కాన్సెప్ట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి తల్లిదండ్రుల సంరక్షణలో చిన్నప్పటి నుంచి ప్రతి పనిలో నియంత్రణ ఎదుర్కొన్న అమ్మాయిలు.. ప్రొఫెషనల్ కెరీర్‌లో సహచరుల వద్ద పొందిన ప్రేమ, ఆప్యాయతలకు లొంగిపోతున్నారు. వెనకాముందు ఆలోచించకుండా, అవసరమైతే పేరెంట్స్‌ను ఎదిరించి లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌‌లోకి ఎంటర్ అవుతున్నారు. కొంతకాలం కలిసి జీవించాక భాగస్వామి అసలు రూపం తెలిసి ఖంగుతింటున్నారు. బంధాన్ని వదిలేయాలనుకుంటే పార్ట్‌నర్ నుంచి ఎదురయ్యే బ్లాక్‌మెయిల్స్‌కు భయపడి, నరకప్రాయమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవేళ పార్ట్‌నర్‌పై ఒత్తిడి తీసుకొస్తే నిర్ధాక్షిణ్యంగా బలైపోతున్నారు.

లివ్-ఇన్ రిలేషన్‌షిప్ వదిలించుకోలేరా?

వ్యక్తులు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను విడిచిపెట్టలేకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని :

* మనం ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు, వారిలోని నెగెటివ్ విషయాలను నిర్లక్ష్యం చేయడం మానవ ప్రవర్తన. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులకు కూడా ఇదే కారణం కావచ్చు. ఇది వారిని బయటకు వెళ్లకుండా వెనక్కి లాగుతుంది.

* ఎప్పుడైనా, ఎవరితోనైనా కలిసి జీవించడం ప్రారంభించిన తర్వాత, అవతలి వ్యక్తి మీ గురించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకుంటారు. ఇది మీకు మానసిక పరాధీనతను ఇస్తుంది. కొంతమంది వ్యక్తులు లివ్-ఇన్ రిలేషన్‌షిప్ నుంచి బయటకు రావడంలో విఫలమయ్యేందుకు ఇది కూడా కారణం కావచ్చు.

* భాగస్వామి మానిప్యులేటివ్‌గా ఉంటే.. అతను/ఆమె మిమ్మల్ని మానసికంగా ప్రభావితం చేసి, ఈ సంబంధంలో మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. పైగా మీ లివ్-ఇన్ పార్ట్‌నర్‌తో మీరు ఒక రకమైన సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉన్నందున, ఈ సంబంధానికి అవకాశం ఇవ్వాలని అనుకోవచ్చు.

* కొంతమంది వ్యక్తులు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు స్టాక్‌హోమ్ సిండ్రోమ్‌కు గురవుతారు. అంటే బాధితులు.. తమను బంధీగా మార్చిన వ్యక్తి లేదా దుర్వినియోగదారుల పట్ల విశ్వాసం లేదా ఆప్యాయత భావాలను పొందుతారు.

* చివరగా.. భాగస్వామితో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, చాలా మంది తమ సహజీవన సంబంధాలను కొనసాగించడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ రకమైన సహజీవనాన్ని భారతీయ సమాజం అంగీకరించడం ఇప్పటికీ కష్టం. అందుకే కొంతమంది వ్యక్తులు సమాజం దీనిపై ఎలా స్పందిస్తుందోనని, వారి సంబంధ స్వభావం ఆధారంగా వారిని ఏవిధంగా అంచనా వేస్తారనే భయంతో తమ భాగస్వాములతో కలిసి జీవించడం కొనసాగిస్తారు.

టాక్సిక్ రిలేషన్ ఎలా వదిలేయాలి?

* అతను/ఆమె దుర్వినియోగమైన లేదా నరకప్రాయమైన సంబంధంలో ఉన్నట్లయితే, ముందుగా దీని గురించి ఎవరికైనా తెలియజేయాలి. అప్పుడు సదరు వ్యక్తి దాని నుంచి బయటపడేందుకు మీకు సాయపడటమే కాకుండా, అవసరమైన వాటిని చేయగల శక్తిని కూడా మీరు కనుగొంటారు.

* మీరు అబ్యూసివ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లయితే ఎప్పుడు కూడా వృత్తిపరమైన సహాయాన్ని పొందవచ్చు. సంబంధం నుంచి కోలుకోవడం కష్టమైనప్పటికీ అది విషపూరితమైనదని తెలిసినపుడు ఎలాగైనా వదిలించుకోవాలి. ఈ క్రమంలో ఎవరైనా థెరపిస్ట్ వద్దకు వెళ్లడం మీ విశ్వాసాన్ని తిరిగి పొందడంలో సాయపడుతుంది.

* ఇష్టమైన వ్యాపకంలో మునిగిపోయి మీ కోసం సమయాన్ని వెచ్చిస్తే, అది పాత గాయాల నుంచి మిమ్మల్ని కోలుకునేలా చేసి, మీ స్వీయ-విలువను గ్రహించేలా చేస్తుంది.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed