వారెవ్వా.. రబ్బర్ ఫ్లోరింగ్

by Daayi Srishailam |

విభిన్న ఆకృతులు.. మరెన్నో రంగులు

వారెవ్వా.. రబ్బర్ ఫ్లోరింగ్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ఆధునిక పోకడలు.. అభిరుచుల వల్ల ఇంటీరియర్ లో కొత్తదనం చూపించాలి. ఎప్పటికప్పుడు ఇంటీరియర్ లో మార్పులు వస్తూనే ఉన్నాయి. వైవిధ్యభరితమైన ఇంటీరియర్ ఉత్పత్తులు హైదారాబాద్ మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి. వీటిలో ‘రబ్బర్ ఫ్లోరింగ్’కు మంచి గిరాకీ ఉంది. ఇంటీరియర్ ప్రియులు గ్రానైట్, మార్చుల్స్ టైల్స్ కు బదులుగా రబ్బర్ ఫ్లోరింగ్ ను ఎంపిక చేసుకుంటున్నారు.

రబ్బర్ ఫ్లోరింగ్ వల్ల లాభాలు

ఇంటీరియర్ లో రబ్బర్ ఫ్లోరింగ్ వాడకం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా రబ్బర్ ఫ్లోరింగ్ కు మన్నిక ఎక్కువ. అధికంగా వినియోగించే ప్రాంతాలలో రబ్బర్ ఫ్లోరింగ్ అనుకూలంగా ఉంటుంది. బాత్రూమ్, కిచెన్ ల వంటి తడి ప్రదేశాలలో జారకుండా ఉంటుంది. రబ్బర్ ఫ్లోరింగ్ పై నడవడం సౌకర్యవంతంగా ఉంటుంది.

గదికో డిజైన్..

రబ్బర్ ఫ్లోరింగ్ ను సాధారణంగా జిమ్ లు, క్రీడా మైదానాలలో వినియోగిస్తుండే వారు. కానీ నగరవాసులు ఇళ్లలోనూ వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి పిల్లల గదులలో రబ్బర్ ఫ్లోరింగ్ ను వేయిస్తున్నారు. పై అంతస్థులో పిల్లలు అడుకుంటే కిందకి శబ్దాలు వినిపించకుండా ఉంటుంది. ఒకవేళ వారు ఆడుకుంటూ కింద పడినా దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఈ రబ్బర్ ఫ్లోరింగ్ ను ఎంపిక చేస్తున్నారు.

విభిన్న ఆకృతులలో..

రబ్బర్ ఫ్లోరింగ్ ఉత్పత్తులు మార్కెట్లలో విభిన్న ఆకృతులతో లభిస్తున్నాయి. మ్యాట్స్, టైల్స్, రోల్స్ రూపంలో వివిధ రంగులు, డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వీటిని సరిగ్గా నిర్వహణ చేస్తే 20 ఏళ్లకంటే ఎక్కువ కాలం మన్నుతాయి, ఇతర ఫ్లోరింగ్ లతో పోలిస్తే చిరిగిపోవటం, పాడై పోవటం వంటివి చాలా తక్కువ, ఫంగస్ కూడా రబ్బర్ ఫ్లోరింగ్ పట్టదని ఇంటీరియర్ నిపుణులు తెలియజేస్తున్నారు.

Next Story