ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్లోటింగ్ వెజిటబుల్ బెడ్స్.. అక్కడి యువత చేస్తున్న అద్భుతం ఇదే..

by Javid Pasha |

వాళ్లు ఖాళీ సమయాల్లో పాత ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి, వాటిని బ్యూయింట్ బేస్‌లుగా మారుస్తున్నారు. వాటిపై కూరగాయలు పండిస్తున్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్లోటింగ్ వెజిటబుల్ బెడ్స్.. అక్కడి యువత చేస్తున్న అద్భుతం ఇదే..
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌, ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్స్‌, ఇలా ప్లాస్టిక్‌తో కూడిన వస్తువులేవైనా వాటి వినియోగం తర్వాత పడేస్తుంటారు చాలామంది. కానీ కొందరు వాటితో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతుంటారు. ప్రస్తుతం ఇండోనేషఇయాలోని చాలామంది పెద్దలు, యువత కూడా ఇదే చేస్తున్నారు. ఇక్కడ తరచుగా వర్షాలు, వరదలు సాధారణం కావడంతో స్థానిక యువత, కమ్యూనిటీలు ఒక సృజనాత్మక పరిష్కారాన్ని అమలు చేస్తున్నాయి. ఇంతకీ అదేమిటి? దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తరచుగా కురిసే వర్షాల కారణంగా ఇండోనేషియాలో పెద్ద పెద్ద జలాశయాలతోపాటు, చిన్న చిన్న కాలువలు, నీటి వనరులు అధికంగా ఉంటాయి. అయితే ఈ అవకాశాన్ని అక్కడి ప్రజలు ఎంతో చక్కగా ఉపయోగించుకోవడమే కాకుండా ప్లాస్టిక్ బాటిల్స్‌ వ్యర్థాలుగా మారి పర్యావరణానికి హాని కలుగకుండా చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఖాళీ సమయాల్లో పాత ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి, వాటిని బ్యూయింట్ బేస్‌లుగా మారుస్తున్నారు. అంటే వెదురు కట్టెలతో బాటిళ్లను కట్టి నీటిపై తేలియాడే పొడవైన తెరచాపలుగా మారుస్తున్నారు. వాటిపై మట్టి లేదా తేలికపాటి గ్రోయింగ్ మెటీరియల్ వేసి కూరగాయలు పండిస్తున్నారు. వీటినే ఫ్లోటింగ్ వెజిటబుల్ బెడ్స్ అని కూడా పిలుస్తుంటారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఈ బెడ్స్ నీటిమట్టంతోపాటు పైకి తేలిపోయి, మొక్కలి నీటిలో మునగకుండా ఉంటాయి. దీంతో అప్పటికే నాటిన మొక్కలు, చల్లిన విత్తనాలు సైతం పాడవకుండా ఉంటాయి. అవి పెరిగి స్థానిక అవసరాలు తీర్చడమే కాకుండా, ఆ కూరగాయలను మార్కెట్లోనూ అమ్ముతుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇండోనేషియా ప్రజలు, యువతలోని సృజనాత్మకతపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story