- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
70 ఏళ్ల వయసులో 35 దేశాలకు ఒంటరి ప్రయాణం.!
ప్రతి తల్లి ఒక్కసారైనా ఒంటరి ప్రయాణం చేయాలని పిలుపునిస్తోంది

దిశ, ఫీచర్స్: కేరళకు చెందిన రిటైర్డ్ బయోకెమిస్ట్రీ టీచర్ ఇందిర ఎం.. తన అరవై ఏళ్ల వయసులో ఒంటరి ప్రయాణాలను ప్రారంభించింది. అలా ఇప్పటివరకు 35 దేశాలను చుట్టేసింది. ఆర్థిక స్వేచ్ఛతో తన కలలను సాకారం చేసుకొని ప్రతి తల్లి ఒక్కసారైనా ఒంటరి ప్రయాణం చేయాలని పిలుపునిస్తోంది.
మొదటి అడుగు..
ప్రపంచాన్ని అన్వేషించాలనే కల ఇందిరకు ఎప్పట్నుంచో ఉండేది. కానీ కుటుంబ బాధ్యతల్లో పడి అదంత ఈజీ కాలేదు. అరవై ఏళ్ల వయసులోనే తన కలలను సాకారం చేసుకోగలిగింది. 2015లో దక్షిణాఫ్రికా సవన్నాలో తన మొదటి ఒంటరి అంతర్జాతీయ ప్రయాణంలో ఆమెలోని బాల్యం ఆనందంతో ఉప్పొంగింది. ఏనుగులు, సింహాలు, జిరాఫీల సమూహంతో కలిసి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఆనందించింది. జోహన్నెస్‌బర్గ్, కేప్ టౌన్‌లను అన్వేషించి అడవి జంతువులు, ప్రకృతితో మమేకమైంది. ఈ అనుభవం ఆమె ఒంటరి ప్రయాణాలకు మొదటి అడుగుగా నిలిచింది.
35 దేశాలు చుట్టేసి..
ఇందిరా ఇప్పటివరకు 35 దేశాలను సందర్శించింది. ఆమె ప్రయాణాలు "ఊహించిన దానికంటే ఎక్కువ" అని ఆమె వివరిస్తుంది. దక్షిణాఫ్రికా సఫారీ ఆమె జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఎందుకంటే అది ఆమె ఒంటరి ప్రయాణాలకు మొదటి ద్వారం. ప్రకృతి పట్ల ప్రేమను బలపరిచింది. ఇస్తాంబుల్‌లో సూట్‌కేస్ కోడ్ మరచిపోవడం, జపాన్‌లో పడిపోయి గాయపడడం వంటి సంఘటనలు ఆమె ప్రయాణాల్లో భాగమైనప్పటికీ ప్రతి సందర్భంలో తన సమూహం నుంచి సహాయం అందింది. ప్రతీ ప్రయాణంలో స్నేహితులు ఏర్పడి.. వాళ్లంతా ఒక కుటుంబంలా కలిసిపోతారు.. ఒకరికొకరు సాయం చేసుకుంటారు.
బాధ్యతలన్నీ తీరాక..
ఇందిరా దృష్టిలొ ఒంటరి ప్రయాణం అంటే స్వీయ-ఆవిష్కరణ, సాంస్కృతిక అనుబంధాలు, సొంత గతిలో కదిలే స్వేచ్ఛ. పెళ్లికి ముందు తన ఆర్థిక స్థితి కారణంగా.. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల కారణంగా తను ప్రయాణించలేకపోయియంది. అందుకే బాధ్యతలన్నీ తీరిన తర్వాత.. పిల్లలు స్థిరపడ్డాక తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. పెన్షన్, ప్రొవిడెంట్ ఫండ్ ఆమెకు ఆర్థిక స్వేచ్ఛను ఇచ్చాయి. తన ప్రపంచాన్ని చూడాలనుకుంది. సురక్షితంగా, ఊహించదగిన రీతిలో, ఖర్చును సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంది.
అనూహ్య అవకాశం..
2010లో ఇందిరా భర్త మరణించారు. జీవితం ఒంటరిగా అనిపించేది. ఎటూ తోచకపోయేది. అప్పుడే కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఒక ప్రయాణం ప్లాన్ చేస్తున్నారు. వారిలో ఒకరికి రూమ్‌మేట్ అవసరమైంది. ఇంట్లో కూర్చొని బాధపడేబదులు వారితో జాయిన్ అవ్వాలనుకుంది. పిల్లల్ని అడిగితే వెళ్లమని ప్రోత్సహించారు. అదే తన ఆత్మవిశ్వాసానికి మొదటి అడుగైంది. ప్రతి ప్రయాణంలో అనుభవాలు, జ్ఞాపకాలు, ఆటంకాలు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ ఒంటరిగా, స్వేచ్ఛగా సరికొత్త ప్రపంచంలో విహరిస్తోంది. ప్రతి మహిళా ఇలాంటి ఒంటరి ప్రయాణాలు చేయాలని పిలుపునిస్తోంది.






