హెల్తీ క్యాండీ.. దేశంలోనే తొలి షుగర్ ఫ్రీ లాలిపాప్

by Sujitha Rachapalli |

ఆరోగ్యకరమైన క్యాండీని లాంచ్ చేసిన 28 ఏళ్ల యువతి.. ఏళ్లకు ఏళ్లు ప్రయోగం చేశాక చివరకు సక్సెస్.. వాటర్ మిలన్ ఫ్లేవర్‌లో ‘బేసికల్లీ హెల్తీ’

హెల్తీ క్యాండీ.. దేశంలోనే తొలి షుగర్ ఫ్రీ లాలిపాప్
X

దిశ, ఫీచర్స్: క్యాండీలు తింటే ఆరోగ్యం పాడవుతుందని భయం అందరిలో ఉంటుంది. ఐతే.. ఇక అలాంటి భయం అక్కర్లేదు అంటోంది ఢిల్లీకి చెందిన 28 ఏళ్ల సానియా కుమార్. క్యాండీ తింటే ఏమో అవుతుందనే భయపడే రోజులు పోయాయంటోంది. క్యాండీ తిని మరింత అందంగా.. యవ్వనంగా మారొచ్చని చెప్తూ దేశంలో మొదటి షుగర్ ఫ్రీ వేగన్ కొలాజెన్ లాలిపాప్‌ను తయారు చేసింది.

ఆప్షన్ షుగరేనా?

చిన్నప్పుడు క్యాండీలు.. గమ్మీ బేర్స్ తినడం ఎంతో ఆనందం. కానీ పెద్దయ్యా్క ఆరోగ్యం గురించి ఆలోచించి క్యాండీలు తినాలంటే నేరం చేసినట్లు అనిపిస్తుంది. సానియా కూడా అదే సమస్య ఎదుర్కొంది. గమ్మీలు తిన్న తర్వాత కడుపు నొప్పి.. ఉబ్బరం వచ్చేవి. ప్యాకెట్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తే అర్థమయ్యేది బయటకు ఆరోగ్యకరమైనవని చెప్పినా.. లోపల షుగర్ ఎక్కువగా ఉండేది. మార్కెట్‌లో ఉన్న హెల్తీ ఆప్షన్లు కేవలం షుగర్ బాంబులే. దీన్ని మార్చాలనుకుంది సానియా. న్యూఢిల్లీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిగ్రీ పూర్తి చేసిన తను ఆ తర్వాత లగ్జరీ మార్కెటింగ్.. బ్రాండ్ స్ట్రాటజీ.. క్రియేటివ్ డైరెక్షన్ రంగాల్లో పని చేసింది.

బేసికల్లీ హెల్తీ లాంచ్..

పీడబ్ల్యూసీ.. జీ20 వంటి సంస్థలతో లీడ్ క్రియేటివ్ కన్సల్టెంట్‌గా పని చేయడం ద్వారా ఎన్నో నేర్చుకుంది సానియా. ఐతే.. ఆఫీసు రాజకీయాలు.. అసంతృప్తి ఆమెను స్టార్టప్ వైపు నడిపించాయి. ఏదిచేసినా జీరో నుంచి చేయాలనే ఉద్దేశంతో ఫుడ్ అండ్ హెల్త్ రంగాన్ని ఎంచుకుంది. క్యాండీలు తినాలంటే ఆరోగ్యం పాడవుతుందనే భావనను మార్చాలని సానియా నిర్ణయించుకుంది. మార్కెట్ రీసెర్చ్ చేసి చుట్టూ ఉన్నవారితో మాట్లాడి ఈ నిర్ధారణకొచ్చింది. 2025లో "బేసికల్లీ హెల్తీ"ని స్థాపించి 2026 ఫిబ్రవరిలో అధికారికంగా లాంచ్ చేసింది. రూ.20 లక్షలు సొంత సేవింగ్స్.. మిగిలిన రూ.25 లక్షలు కుటుంబం నుంచి తీసుకొని ఇందులో పెట్టింది.

టార్గెట్ 50 లక్షలు..

మార్కెట్‌లో ఉన్న సప్లిమెంట్లు కాకుండా నిజమైన క్యాండీ ఫార్మాట్‌లో ఆరోగ్యాన్నిచ్చే ఉత్పత్తి తయారు చేయాలని నిర్ణయించింది. చాలా ల్యాబ్‌లు సహకరించలేదు. చివరికి థింకింగ్ ఫోర్క్స్ టీమ్‌తో కలిసి ఒక సంవత్సరం పాటు పనిచేసి సాఫ్ట్ సెంటర్ ఉన్న "కాలిపాప్"ను సృష్టించింది. ఐదు సార్లు ఫెయిల్ అయిన తర్వాత 50% వేస్టేజ్ జరిగినా చివరికి విజయం సాధించింది. ఇది దేశంలో మొదటి షుగర్ ఫ్రీ లాలిపాప్‌. పుచ్చకాయ ఫ్లేవర్‌లో వచ్చే ఈ కాలిపాప్ సాధారణ లాలిపాప్‌ల కంటే పెద్దది. ఈ ఉత్పత్తి ఇప్పటికే 1000కి పైగా కస్టమర్లను చేరుకొని రూ.8 లక్షలు సాధించింది. ఈ సంవత్సరం చివరి నాటికి నెలకు రూ.50 లక్షల విక్రయాలు చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story