ఇండియన్ ఆఫ్ ది ఇయర్.. ప్రొఫెసర్ మాధవి లత.!

by Daayi Srishailam |

ప్రపంచాన్ని జయించిన కీర్తి పొందింది

ఇండియన్ ఆఫ్ ది ఇయర్.. ప్రొఫెసర్ మాధవి లత.!
X

దిశ, ఫీచర్స్: 2025వ సంవత్సరం గుర్తుంచుకోదగిన వాళ్లలో ప్రొఫెసర్ మాధవి లత ఒకరు. ఆమె మన తెలుగు మహిళే. పేదరికంలో పుట్టి.. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పెరిగింది. కానీ తన పేదరికాన్ని చూస్తూ అక్కడే ఆగిపోలేదు. పెద్ద లక్ష్యం పెట్టుకుంది. ఆమె అస్త్రం చదువు. ఆ చదువుతోనే పేదరికాన్ని జయించడమే కాదు.. ఇప్పుడు ప్రపంచాన్ని జయించిన కీర్తి పొందింది.

సమస్యలు చుట్టుముట్టినా..

మాధవి లత బాల్యం కష్టాల మధ్య సాగింది. వాళ్ల నాన్నొక రైతు. ఆర్థిక పరిస్థితులు బాగలేక కుటుంబం ఆస్తులన్నీ కోల్పోయింది. ఎంత పేదరికం అంటే.. పాత పుస్తకాలు అమ్మి 40 పైసలు వస్తే.. వాటితో కిరోసిన్ కొన్న రోజులున్నాయి. ఇంత పేదరికం చుట్టుముడితే వేరేవాళ్లు ఏంచేస్తారు.? ఇంకోమాట లేకుండా చదువు మానేసి ఏ కూలి పనికో వెళ్తారు. కానీ మాధవీలత అలా చేయలేదు. తన పేదరికానికి ఏకైక పరిష్కారం చదువు మాత్రమే అని బలంగా నమ్మింది. వాళ్ల అమ్మమ్మ ప్రోత్సాహంతో ముందుకు సాగింది. జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. సమస్యలు చుట్టుముట్టినా చదువును విడువలేదు.

ఏనాడూ అధైర్యపడలేదు..

కాకినాడలో మాధవిలత సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసింది. వాళ్ల ఊరు నుంచి ఇంజినీరింగ్ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచింది. హాస్టల్ జీవితంలో ఇబ్బందులు ఎదురైనా సాంస్కృతిక మార్పులతో సతమతమైనా తను ఏనాడూ అధైర్యపడలేదు. వరంగల్‌లో ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో మొదటి మహిళా ఫ్యాకల్టీ సభ్యురాలిగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం సెంటర్ ఫర్ సస్టయినబుల్ టెక్నాలజీస్ హెడ్‌గా.. ఇండియన్ జియోటెక్నికల్ జర్నల్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది.

కష్టతరం చేసినా..

జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన చీనాబ్ రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంటుంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్‌‌లో కశ్మీర్‌ను దేశంతో అనుసంధానం చేస్తుంది. ఇది పూర్తికావడంలో కీలకపాత్ర మాధవిలతది. వంతెన నిర్మాణం అసాధారణ సవాళ్లతో కూడుకున్నది. హిమాలయ కొండలు అస్థిరంగా ఉండి భూకంపాలు ఎక్కువగా జరిగే ప్రాంతం. కఠిన వాతావరణం.. ప్రతికూల పరిస్థితులు నిర్మాణాన్ని కష్టతరం చేశాయి. అలాంటిదాన్ని ఏళ్లపాటు కష్టపడి చేసి చూపించింది మాధవిలత.

మనుషులే తిరగని ప్రాంతం..

మాధవిలత 2005లో మొదటిసారి అక్కడికి వెళ్లినప్పుడు మనుషులు తిరిగే ఆనవాళ్లు కనిపించలేదు. గుర్రపు బండ్లపై వెళ్లాల్సి వచ్చింది. అలాంటి ప్రదేశంలో 359 మీటర్ల ఎత్తులో వంతె నిర్మాణమంటే మామూలు విషయం కాదు. జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా మాధవి లత తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. 17 ఏళ్ల పాటు నిర్మాణాన్ని పర్యవేక్షించిందామె. వంతెన ఆర్చ్ రెండు గుట్టల మధ్య ఇంటర్‌మీడియేట్ సపోర్ట్ లేకుండా ఉండటం పెద్ద సవాలు. భూకంపాలు.. 220 కిలో మీటర్ల వేగంతో వీచే గాలులు తట్టుకునేలా భూకంప జియోటెక్నికల్ ఇంజినీరింగ్.. రాక్ మెకానిక్స్ నైపుణ్యంతో దీనిని కట్టారు.

సైన్స్ ఐకాన్‌..

మాధవి లత లాంటి వాళ్లు సమాజానికి ఆదర్శం. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలకే కన్నీళ్లు పెట్టుకునేవారు తన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రముఖ ఛానెల్ ఎన్‌డీటీవీ ''ఇండియన్ ఆఫ్ ది ఇయర్''లో సైన్స్ ఐకాన్‌గా మాధవి ఎంపికైంది. ఈ అవార్డు మాధవి లత శాస్త్రీయ.. ఇంజినీరింగ్ రంగాల్లో అసాధారణ సహకారానికి గుర్తింపుగా చెప్పుకోవచ్చు. చీనాబ్ వంతెన నిర్మాణంలో ఆమె పాత్ర.. దశాబ్దాల జియోటెక్నికల్ ఇంజినీరింగ్ అంకితం ఇందులో భాగం. శాస్త్రవేత్తగానే కాకుండా భవిష్యత్ ఇంజినీర్లకు మార్గదర్శకురాలిగా కూడా తన ప్రభావం ఉండి యువతను శాస్త్ర రంగంలోకి ప్రేరేపిస్తుంది.

Next Story